సన్ రైజర్స్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ కు కరోనా
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కరోనా వైరస్ బారినపడ్డాడు
By: Tupaki Desk | 19 May 2025 9:35 AM ISTసన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ధృవీకరించారు. దీని కారణంగా హెడ్ సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కరోనా సోకడంతోనే భారత్‌కు రావడంలో హెడ్‌కు ఆలస్యమైందని వెట్టోరి తెలిపారు. అయితే, హెడ్‌కు ఎప్పుడు, ఎక్కడ వైరస్ సోకిందనే దానిపై మాత్రం కోచ్ స్పష్టత ఇవ్వలేదు. హెడ్ సోమవారం ఉదయం భారత్‌కు చేరుకుంటాడని, ఆ తర్వాత జట్టు వైద్య సిబ్బంది అతన్ని పరీక్షించి, పరిస్థితిని సమీక్షిస్తారని వెట్టోరి పేర్కొన్నాడు.
ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం పాటు వాయిదా పడినప్పుడు, ట్రావిస్ హెడ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాడు. జూన్ 11న ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో, వీరిద్దరూ మళ్ళీ ఐపీఎల్‌లో పాల్గొంటారా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, మిగిలిన మ్యాచ్‌ల కోసం హెడ్, కమిన్స్ ఇద్దరూ భారత్‌కు వస్తారని సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం గతంలోనే స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో పాటు, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో సన్‌రైజర్స్ తలపడనుంది. మే 25న కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌తో హైదరాబాద్ గ్రూప్ దశను ముగించనుంది.
ట్రావిస్ హెడ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 281 పరుగులు చేశాడు. ఇందులో అతని సగటు 28.10, స్ట్రైక్ రేట్ 156.11గా ఉంది. గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 567 పరుగులు చేసి అదరగొట్టిన హెడ్, ఈ సీజన్‌లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమయ్యాడు. హెడ్ గైర్హాజరీ లక్నోతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు కూర్పుపై ప్రభావం చూపనుంది.
