Begin typing your search above and press return to search.

‘పాసు’ల పంచాయితీ.. హైదరాబాద్ కో దండం అంటున్న అంటున్న సన్ రైజర్స్

దక్కన్ చార్జర్స్ (డీసీ).. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పక్కా హైదరాబాదీ టీమ్.. రెండో సీజన్ లోనే టైటిల్ విజేతగానూ నిలిచింది.

By:  Tupaki Desk   |   30 March 2025 2:10 PM IST
Sunrisers Hyderabad’s Frustration with HCA
X

దక్కన్ చార్జర్స్ (డీసీ).. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పక్కా హైదరాబాదీ టీమ్.. రెండో సీజన్ లోనే టైటిల్ విజేతగానూ నిలిచింది. కానీ, మన తెలుగువారి బ్యాడ్ లక్.. ఆ జట్టు రద్దయింది. దీంతో సన్ రైజర్స్ ‘హైదరాబాద్’ పేరిట హైదరాబాద్ తో అసలు సంబంధమే లేని తమిళులకు చెందిన టీమ్ లీగ్ లో ఆడుతోంది. ఇప్పుడు ఈ జట్టు కూడా హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం అంటోంది..

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ).. దీని గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఎంతో గొప్ప చరిత్ర.. అంతకుమించిన అవినీతి ఆరోపణలతో భ్రష్టుపట్టింది. ఇప్పుడు ఐపీఎల్‌ మ్యాచ్‌ ల ఉచిత పాస్‌ ల కోసం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మేనేజ్ మెంట్ ను తీవ్రంగా వేధిస్తూ వార్తల్లో నిలిచింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను వీడి వెళ్తామని హెచ్చరించింది.

ఎపుడూ టికెట్ల, పాస్ ల పంచాయితీనే..

హెచ్ సీఏకు అదేమిటో కానీ.. ఎప్పుడూ పాస్ ల పంచాయితీనే. గతంలో టికెట్ల అమ్మకాల సందర్భంగా తొక్కిసలాట జరిగి అభాసుపాలైంది. ఇప్పుడు కోరినన్ని పాస్‌ లు ఇవ్వనందుకు ఓ మ్యాచ్‌ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్‌ బాక్స్‌ కు తాళాలు వేశారంటూ సన్‌ రైజర్స్‌ సంచలన విషయాన్ని బయటపెట్టింది.

పైగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్‌ ప్రతినిధి లేఖ రాయడం తీవ్ర దుమారం రేపుతోంది.

పాస్ లంటే ఉచిత టికెట్లు. వీటిని తమకు నచ్చినవారికి, కావాల్సిన వారికి ఇచ్చుకునేందుకు హెచ్ సీఏ పెద్దలు పెద్దఎత్తున పైరవీ చేస్తుంటారు. వీటికోసం హెచ్‌సీఏ నుంచి బెదిరింపులు, బ్లాక్‌ మెయిలింగ్‌ ఎదురవుతోందని.. తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని సన్ రైజర్స్ తెలిపింది.

2013లో సన్ రైజర్స్ తెరంగేట్రం చేసింది. కానీ గత రెండు సీజన్ల నుంచి మాత్రం వేధింపులు ఎక్కువైనట్లు ఆరోపిస్తోంది. 50 సీట్లున్న ఎఫ్‌12ఏ కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్లతో కలిపి ఒప్పందం మేరకు హెచ్‌సీఏకు 10 శాతం (3900) ఉచిత టికెట్లు కేటాయిస్తున్నామని తెలిపింది. ఈసారి కార్పొరేట్ బాక్స్ కెపాసిటీ 30 మాత్రమే అని, మరో బాక్స్‌ లో 20 టికెట్లు కావాలని హెచ్ సీఏ అడిగిందని సన్ రైజర్స్ పేర్కొంటోంది.

దీనికోసం గత వారం మ్యాచ్ సందర్భంగా ఎఫ్‌-3 బాక్సుకు తాళాలు వేశారని తెలిపింది.

మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని ఆరోపించింది.

ఈ ఏడాది హెచ్‌సీఏ అధ్యక్షుడు చాలాసార్లు బెదిరించారని.. దీన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చామని.. ఇదంతా చూస్తే తాము ఇక్కడ ఆడడం ఇష్టం లేనట్లు ఉందని సన్ రైజర్స్ ప్రతినిధి వాపోయారు. ఇలాగైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, సన్ రైజర్స్ యాజమాన్యంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతాం అని లేఖ రాశారు.