కాటేరమ్మకు అసలు కొడుకులే లేరట
ఈసారి ఐపీఎల్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. గత సీజన్లో పన్నెండేళ్లుగా నిలిచిన ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డును మూడుసార్లు బద్దలు కొట్టిన జట్టది.
By: Tupaki Desk | 18 April 2025 10:00 PM ISTఈసారి ఐపీఎల్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. గత సీజన్లో పన్నెండేళ్లుగా నిలిచిన ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డును మూడుసార్లు బద్దలు కొట్టిన జట్టది. నిరుడు 287 స్కోరు సాధించడంతో... ఈసారి 300 కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయమనుకున్నారు. అందులోనూ తొలి మ్యాచ్‌లోనే 286 పరుగులు సాధించడంతో 300 మైలురాయి లాంఛనమే అనే అభిప్రాయాలు కలిగాయి.
కానీ తర్వాతి మ్యాచ్ నుంచి మొదలైంది అసలు కథ. వరుసగా నాలుగు పరాజయాలతో తుస్సుమనిపించింది హైదరాబాద్. గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బోలెడన్ని లైఫ్‌లతో సాధించిన శతకం సాయంతో మళ్లీ గెలుపు బాట పట్టింది కానీ.. ఆ మురిపెం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. నిన్న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తేలిపోయింది. 162 పరుగులే చేసి చిత్తుగా ఓడిపోయింది.
దీంతో సన్‌రైజర్స్ మీద సోషల్ మీడియా ఎటాక్ మామూలుగా లేదు. సొంత అభిమానులే ఆ జట్టు గాలి తీసేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఇచ్చిన హైప్ అంతే ఉత్తిదే అని.. హైదరాబాద్ జట్టుకు అంత సీన్ లేదని తీసి పడేస్తున్నారు. నిన్నటిదాకా ‘కాటేరమ్మ కొడుకులు’ అంటూ ఇచ్చిన ఎలివేషన్ ఇప్పుడు తిరగబడింది. కాటేరమ్మ తనకు అసలు కొడుకులే లేరని అంటున్నట్లుగా మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు.
గత సీజన్లో, ఈ సీజన్ ఆరంభానికి ముందు హైదరాబాద్ అంటే మిగతా జట్లు వణికిపోతున్నట్లుగా ఫ్యాన్స్ చేసిన అతి వల్ల ఆ జట్టు మీద ఇతర జట్ల అభిమానుల్లో నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. సీజన్లో ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు ఓడిపోవడంతో సన్‌రైజర్స్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. టైటిల్‌కు హాట్ ఫేవరెట్ అనుకున్న జట్టు కాస్తా.. ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరడమే కష్టంగా మారడంతో నెటిజన్లు హైదరాబాద్ జట్టును ఒక ఆట ఆడేసుకుంటున్నారు.
