సన్‌రైజర్స్‌ను హెచ్‌సీఏ ఇబ్బందిపెట్టింది నిజమే..తేల్చిన విజిలెన్స్
హైదరాబాద్ క్రికెట్ సంఘం పెద్దలు.. సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తేవడంతో వారు విసిగిపోయి వెళ్లిపోతామని చెప్పినట్లు కథనాలు వచ్చాయి.
By: Tupaki Desk | 28 May 2025 2:00 AM ISTభారత్-పాక్ ఉద్రిక్తతలకు ముందు.. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చిన్నపాటి కుదుపు ఏమంటే.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ బెదిరించడం.. కాటేరమ్మ కొడుకులు, ఆరెంజ్ ఆర్మీ అంటూ అభిమానులు ముఖ్యంగా హైదరాబాదీలు ఎంతగానో ఓన్ చేసుకున్న ఈ ఫ్రాంచైజీ ఎందుకిలా అల్టిమేటం ఇచ్చిందనేది అప్పట్లో పెద్ద సంచలనం. తర్వాత తేలిన విషయం ఏమంటే..ఐపీఎల్ టికెట్ల వ్యవహారం అని.
హైదరాబాద్ క్రికెట్ సంఘం పెద్దలు.. సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తేవడంతో వారు విసిగిపోయి వెళ్లిపోతామని చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తాజాగా విజిలెన్స్ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులో.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు.. సన్ రైజర్స్‌పై టికెట్ల కోసం ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొంది. ఎస్ఆర్‌హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు నిర్ధారించిన విజిలెన్స్.. పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్నప్పటికీ ఇంకో పదిశాతం కూడా ఇవ్వాలని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యంపై ఒత్తిడి చేశారని తేల్చింది.
అయితే, మరో పది శాతం అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం తేల్చడంతో సమస్య ముదిరిందని విజిలెన్స్ నివేదించింది.
కాగా, ఓపెన్ మార్కెట్లో కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ అడగ్గా.. హెచ్‌సీఏ ద్వారా కోరాలని సన్ రైజర్స్ షరతు పెట్టిందని విజిలెన్స్ తెలిపింది.
కాగా, తనకు వ్యక్తిగతంగా 10శాత టికెట్లు కావాలని జగన్మోహన్ డిమాండ్ చేసినట్లుగానూ విజిలెన్స్ నివేదించింది. అలా కుదరదని ఎస్ఆర్ హెచ్ చెప్పడంతో ఐపీఎల్ మ‍్యాచ్‌ల సందర్భంగా ఫ్రాంచైజీని ఇబ్బంది పెట్టారని తెలిపింది.
సన్ రైజర్స్ -లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరమే ఫ్రాంచైజీ వెళ్లిపోతామంటూ బెదిరించింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎస్‌ఆర్‌హెచ్‌ను హెచ్‌సీఏ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తేల్చిన విజిలెన్స్.. హెచ్‌సీఏపై చర్యలకు సిఫారసు చేసింది.
రాజకీయమేనా?
ప్రస్తుతం హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్‌రావు బీఆర్‌ఎస్ పెద్దలకు సన్నిహితులు. ఆ పార్టీ ప్రభుత్వంలోనే అధ్యక్షుడు అయ్యారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హెచ్‌సీఏపై ఫోకస్ పెట్టింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు తరచూ హెచ్‌సీఏను టార్గెట్ చేశారు. దీనివెనుక ఆయన స్వప్రయోజనాలు కొన్ని ఉన్నాయనే ఆరోపణలూ వచ్చాయి. అయితే, హెచ్‌సీఏను కూడా శుద్ధపూస అని చెప్పలేం. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం.
