పెన్ను తాకిందని వెళ్లిపోయాడు..కోల్ కతా రచ్చకు మెస్సీనే కారణం?
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ భారత పర్యటన ముగిసింది.. సోమవారం సాయంత్రం అతడు ఢిల్లీ నుంచి వెళ్లిపోయాడు.
By: Tupaki Desk | 16 Dec 2025 1:23 PM ISTప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ భారత పర్యటన ముగిసింది.. సోమవారం సాయంత్రం అతడు ఢిల్లీ నుంచి వెళ్లిపోయాడు. శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో మొదలైంది గోట్ టూర్ ఆఫ్ ఇండియా. అంతా ప్రశాంతంగానే జరిగినా.. కోల్ కతాలోనే తేడా కొట్టింది. అక్కడి సాల్ట్ లేక్ స్టేడియం నుంచి షెడ్యూల్ కంటే మెస్సీ ముందుగానే వెళ్లిపోవడంతో అభిమానులు రభస రభస చేశారు. భద్రతా కారణాల రీత్యానే మెస్సీ ఇలా మధ్యలో వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. తీరా చూస్తే.. స్టేడియంలో మెస్సీని చుట్టుముట్టిన రాజకీయ ప్రముఖులు, ఆర్గనైజర్లు సహా ఇతర వీఐపీల్లోని ఒకరు ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో మెస్సీకి పెన్ను గుచ్చుకోవడంతో భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని అతడి సెక్యూరిటీ టీమ్ భావించింది. ఇదే విషయాన్ని గోట్ టూర్ ఆఫ్ ఇండియా ఆర్గనైజర్ శతద్రు దత్తాకు మెస్సీ తెలిపి అక్కడినుంచి వెళ్లిపోయాడట. ఈ నేపథ్యంలో స్టేడియంలో రెండు గంటల పాటు ఉండాల్సిన మెస్సీ కేవలం 22 నిమిషాలే గడపడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో గ్రౌండ్ లోకి నీటి సీసాలు విసిరేశారు. కుర్చీలను విరగ్గొట్టారు. చివరకు పరిస్థితి శతద్రు సహా మరికొందరి అరెస్టు వరకు వెళ్లింది. అయితే, తాజాగా ఈ అంశంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
అతడే కారణం...
కోల్ కతా ఘటనకు మెస్సీనే కారణమని గావస్కర్ తప్పుబట్టాడు. అతడికి నిబద్ధతే లేదని నిందించాడు. కానీ, మెస్సీని తప్ప మిగతావారందరినీ తప్పుబడుతున్నారని అన్నాడు. అసలు అతడి టూర్ లో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటో కూడా తెలియదని పేర్కొన్నాడు. అనుకున్న సమయం కంటే ముందే వెళ్లిపోయిన మెస్సీ, అతడి స్టాఫ్‌నే అసలు దోషులను మండిపడ్డాడు.
మెస్సీకి అసలు ముప్పు ఎక్కడ?
మెస్సీకి భారత పర్యటనలో అసలు ముప్పు ఎక్కడుందని గావస్కర్ నిలదీశాడు. మెస్సీ చుట్టూ నాయకులు, వీఐపీలు చేరారని అలాంటప్పుడు ఇక భద్రతకు లోటు ఏముందని ప్రశ్నించాడు. అలాంటప్పుడు మైదానంలో నడుస్తూ, అభిమానులకు అభివాదం చేస్తూ, ఫుట్ బాల్ ఆడుతూ గడపాల్సిందని అన్నాడు. చుట్టూ చేరినవారు పక్కకు తప్పుకొంటే మెస్సీ అందరికీ కనిపించేవాడని.. అదేమీ చేయకపోవడంతో పాటు వెళ్లిపోవడం అభిమానుల ఆగ్రహానికి కారణమైందని విశ్లేషించాడు. ఇదే సమయంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీల్లో మెస్సీ పర్యటన సజావుగా సాగిన విషయాన్ని గావస్కర్ గుర్తుచేశాడు. అక్కడ షెడ్యూల్ ప్రకారం నడుచుకున్నాడని.. కోల్ కతాలో మాత్రం షెడ్యూల్ ను పాటించలేదని, కాబట్టి గందరగోళానికి మెస్సీనే కారణం అని గావస్కర్ కుండబద్దలు కొట్టాడు.
