Begin typing your search above and press return to search.

కుర్ర ఓపెనర్.. కెప్టెన్సీ కొట్టేశాడు?

కేవలం ఐదేళ్లు.. అంతకుముందు చూసినా అండర్ 19 కెప్టెన్ కూడా కాదు.. అప్పుడు జట్టులో నంబర్ 2 బ్యాట్స్ మన్ కూడా.

By:  Tupaki Desk   |   25 Nov 2023 9:47 AM GMT
కుర్ర ఓపెనర్.. కెప్టెన్సీ కొట్టేశాడు?
X

కేవలం ఐదేళ్లు.. అంతకుముందు చూసినా అండర్ 19 కెప్టెన్ కూడా కాదు.. అప్పుడు జట్టులో నంబర్ 2 బ్యాట్స్ మన్ కూడా. ఇప్పడు మాత్రం ఏకంగా టీమిండియా భావి కెప్టెన్ గానూ భావిస్తున్నారు. ఈలోగానే జాక్ పాట్ లా ఐపీఎల్ ఫ్రాంజైజీ సారథ్యం కొట్టేశాడని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే అతడు భారత కెప్టెన్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని స్పష్టమవుతోంది. పెద్దగా అంచనాల్లేని దశ నుంచి సూపర్ స్టార్ గా ఎదుగుతున్న అతడికి వచ్చే సీజన్ లో ఐపీఎల్ జట్టు కెప్టెన్సీ దక్కితే పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

2023 బాగా కలిసొచ్చింది

టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కు 2023 సంవత్సరం బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. 24 ఏళ్ల గిల్.. ఈ ఏడాదే వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ సభ్యుడైన అతడు మొత్తం ఆరు సెంచరీలు కొట్టాడు. 2023లోనే 2 వేల అంతర్జాతీయ పరుగులు రాబట్టాడంటే ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ అతడే కావడం విశేషం. కాగా, ప్రపంచ కప్ లో మాత్రం గిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. నాలుగు అర్ధ శతకాలు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 92. ఫైనల్లోనూ తొందరగానే ఔటయి అభిమానులను నిరాశపరిచాడు.

సహచరుడిని వెనక్కునెట్టి..

శుబ్ మన్ గిల్, ప్రథ్వీ షా ఇద్దరూ 2018 అండర్ 19 ప్రపంచ కప్ జట్టు సభ్యులు. కానీ, అప్పట్లో షాకు వచ్చినంత పేరు గిల్ కు రాలేదు. షాను భవిష్యత్ స్టార్ గానూ అందరూ కొనియాడారు. అతడి తర్వాతే గిల్ పేరు వినిపించేది. నేడు చూస్తే.. షా అసలు టీమిండియా దరిదాపుల్లోనే లేడు. గిల్ మాత్రం దూసుకెళ్తున్నాడు. షాను బ్యాడ్ లక్ బాగా వెంటాడగా, గిల్ ను స్టార్ డమ్ పట్టుకుంది. మరీ ముఖ్యంగా 2023లో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు సంవత్సరం ముగుస్తుండగా గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గానూ నియమితుడు కానున్నట్లు సమాచారం.

ఐదేళ్లకే సారథ్యం..

గిల్ 2018లో ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2022లో గుజరాత్ టైటిల్ కొట్టడంలో, ఈ ఏడాది ఫైనల్ చేరడంలో గిల్ దే కీలక పాత్ర. వచ్చే సీజన్ నుంచి అతడు కెప్టెన్సీ కూడా చేపట్టనున్నట్లు సమాచారం. వాస్తవానికి గిల్.. మరో ఫ్రాంచైజీకి మారుతున్నట్లు కథనాలు వచ్చాయి. కెప్టెన్సీ కోసమే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు గుజరాత్ కెప్టెన్సీనే అతడికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంచి క్లాస్ బ్యాట్స్ మన్ అయిన గిల్ కు నాలుగైదేళ్లలో టీమిండియా కెప్టెన్సీ కూడా దక్కొచ్చు. అదే జరిగితే.. శుబ్ మన్ కు అంతా శుభమే.