Begin typing your search above and press return to search.

ఆసియా కప్ ఫైనల్లో లంక.. భారత్ - పాక్ పోరు లేనట్టే?

శ్రీలంక - పాకిస్థాన్ మధ్య కాసేపట్లో జరిగే సూపర్ 4 మ్యాచ్ సెమీఫైనల్ లాంటిదే. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం భారత్ తో జరగాల్సిన ఫైనల్లో తలపడుతుంది.

By:  Tupaki Desk   |   14 Sep 2023 9:56 AM GMT
ఆసియా కప్ ఫైనల్లో లంక.. భారత్  - పాక్ పోరు లేనట్టే?
X

ఆసియా కప్ లో మరికొద్దిసేపట్లో సెమీఫైనల్ కాని సెమీఫైనల్. టోర్నీని లీగ్, సూపర్-4 దశలుగా నిర్వహిస్తుండగా ఈ సెమీఫైనల్ ఎక్కడిది అనేగా మీ ప్రశ్న.. ఆగండాగండి.. సెమీ ఫైనల్ ఎక్కడినుంచి వచ్చిందనుకుంటున్నారా? నిజమే.. మీ అనుమానం నిజమే. శ్రీలంక –పాకిస్థాన్ మధ్య కాసేపట్లో జరిగే సూపర్ 4 మ్యాచ్ సెమీఫైనల్ లాంటిదే. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం భారత్ తో జరగాల్సిన ఫైనల్లో తలపడుతుంది. ఇక శుక్రవారం భారత్ –బంగ్లా మ్యాచ్ నామమాత్రమే. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడినందున బంగ్లా ఇంటికి వెళ్లడం ఖాయమైంది.

ఆడకముందే ఓడినట్టా?

లంతో సూపర్ -4 మ్యాచ్ లో పాకిస్థాన్ ఫేవరెట్. మంచి బ్యాటింగ్ బలంతో పాటు బౌలర్లు మెరుగ్గా ఉండడమే దీనికి కారణం. అయితే, పాక్ జట్టు మైదానంలోకి దిగకముందే చాలామంది జట్టు ఓడిపోయిందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఆలోచించకుండా తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. దీనికి కారణం.. కీలక మ్యాచ్ కు పాక్ ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగుతుండడమే.

ఇదేం చోద్యం..?

ఏ జట్టయినా పరిస్థితులకు తగ్గట్టు మార్పులతో మ్యాచ్ లోకి దిగడం సహజం. పాకిస్థాన్ కూడా అలానే గురువారం మ్యాచ్ లో దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రధాన పేసర్లు హారిస్ రవూఫ్, నసీమ్ షా గాయాల పాలయ్యారు. పేలవ ఫామ్ కారణంగా ఓపెనర్ ఫఖర్ జమాన్ పై వేటు వేశారు. ఆఘా సల్మాన్ కూడా గాయపడ్డాడు. ఫహీం అష్రాఫ్ కూడా దారుణంగా ఆడుతున్నందున అతడిని పక్కనపెట్టారు. దీంతో ఐదు అనివార్య మార్పులు జరిగాయి.

వారు లేకుంటే ఓడినట్టేనా?

పాకిస్థాన్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక బ్యాట్స్ మన్ ఫఖర్ జమాన్. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో భారత్ పై విజయానికి బాటలు వేసిన రికార్డు అతడి సొంతం. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ తో సిరీస్ లో మూడు సెంచరీలు బాదాడు. కానీ, ఆ తర్వాతి నుంచి జమాన్ ఫామ్ గాడి తప్పింది. కీలక మ్యాచ్ ల్లోనూ రాణించడం లేదు. దీంతోనే పక్కనపెట్టాల్సి వచ్చింది. ఇది అతడికి ఒక విధంగా విశ్రాంతి అనుకోవచ్చు కూడా. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగంతో బంతులేసే రవూఫ్ ది స్వల్ప గాయమే. ప్రపంచ కప్ ముందు ఎందుకైనా మంచిదని ఆడించడం లేదు. నసీమ్ షాదీ ఇదే కథ. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా లంకతో మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయినట్లుగా.. భారత్ తో ఫైనల్లో తలపడేది శ్రీలంక అని వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి పాకిస్థాన్ ఓ అనిశ్చిత జట్టు. ఎంత పేలవంగా ఆడుతుందో.. అంతే బలంగా ప్రతిఘటిస్తుంది. అయినా అంతర్జాతీయ స్థాయిలో ఎవరు ఆడినా అత్యుత్తమ ఆటగాళ్లే అయి ఉంటారు. కాబట్టి టీమిండియాతో ఆదివారం ఫైనల్లో తలపడేది పాకిస్థానే అని.. సెలవు రోజు మంచి మ్యాచ్ చూడబోతున్నందుకు సంబరపడదాం..