Begin typing your search above and press return to search.

క్రికెట్ పాలిటిక్స్... అటు తిరిగి ఇటు తిరిగి మినిస్టర్ ని మింగేసింది!

క్రీడల మంత్రిగా రోషన్ ను తప్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 5:30 PM GMT
క్రికెట్  పాలిటిక్స్... అటు తిరిగి ఇటు తిరిగి మినిస్టర్  ని మింగేసింది!
X

తాజాగా ముగిసిన ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ తర్వాత పలు దేశాల క్రికెట్ బోర్డుల్లో పెను సంచలనాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ వరల్డ్ కప్ లో ఘోరమైన పెర్ఫార్మెన్స్ చూపించిన పలు టీంల బోర్డులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. మరికొన్ని సందర్భాల్లో ఆయా టీం ల కెప్టెన్ లే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాధ్యతలనుంచి తప్పుకుంటున్నారు.

ఈ వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శన ఫలితంగా అటు పాక్ క్రికెట్ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకోగా.. ఇక శ్రీలంక బోర్డులో అయితే ఊహించని పరిణామాలు జరిగాయి. ఇందులో భాగంగా... తాజాగా శ్రీలంక దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘేపై వేటు పడింది. క్రీడల మంత్రిగా రోషన్ ను తప్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... శ్రీలంక క్రీడల మంత్రిగా రోషన్ ను తప్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయనకు ఉన్న మిగతా మంత్రిత్వ శాఖలనూ తొలగించారు. శ్రీలంక క్రికెట్ బోర్డులో జోక్యం చేసుకోవటమే దీనికి గల ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇలాంటి చర్యకు ఉపక్రమించడం ద్వారా శ్రీలంక క్రికెట్ పై ఐసీసీ విధించిన నిషేధాన్ని తొలగించుకునే దిశగా ఒక అడుగు అని అంటున్నారు పరిశీలకులు!

బోర్డులో రాజకీయ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ పై ఐసీసీ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి తొలగింపు నిర్ణయం పట్ల శ్రీలంక క్రికెట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇది సరైన, సహేతుకమైన చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. సంక్షోభాలు ఎంతటి టీంకైనా సహజమే కానీ... అందులో రాజకీయ జోక్యం మాత్రం సమర్ధనీయం కాదని అంటున్నారు.

కాగా తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన శ్రీలంక కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశం తర్వాత నెదర్లాండ్ మాత్రమే ఉంది! ఈ క్రమంలో ఆ దేశ క్రీడల శాఖ మంత్రి రోషన్ రణసింఘే మొత్తం శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేశాడు.

అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలో తాత్కాలికంగా ఓ కొత్త కమిటీని నియమించారు. ఇందులో భాగంగా ఏడుగురు సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ లో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మాజీ బోర్డు అధ్యక్షుడు కూడా ఉన్నారు. దీనికి తోడు క్రికెట్ బోర్డుపై వేటు వేయాలని ఐసీసీకి లేఖ రాశారు. దీంతో క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేసింది.

ఈ నేపథ్యంలో... పాత క్రికెట్ బోర్డు సభ్యులంతా కలిసి కేంద్ర మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ సమయంలో క్రీడల శాఖ ఇచ్చిన ఆర్డర్ పై సుప్రీం స్టే విధించింది. ఈ సమయంలో క్రికెట్ బోర్డులో అవినీతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్న తనను ప్రధాని హత్య చేయించేందుకు కుట్ర పన్నారని రోషన్ రణసింఘే ఆరోపణలు చేశారు. దీంతో రోషన్ ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తూ ప్రధాని రణిల్ విక్రమ సింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.