విందులు..విహారాల్లో సన్ ’సెట్’.. ఐపీఎల్ లో హైదరాబాద్ ఖేల్ ఖతం
ఐపీఎల్ ఎంతటి బ్యాట్స్ మెన్ గేమ్ అయినా.. కేవలం బ్యాటింగ్ నే నమ్ముకుని బరిలో దిగితే పనికాదని ఈ సీజన్ లో సన్ రైజర్స్ ను చూస్తే తెలుస్తోంది.
By: Tupaki Desk | 7 May 2025 3:00 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నిరుడు ఫ్లూక్ లో 280 కొట్టేసి.. ఈ ఏడాది 300 కొట్టేస్తాం అని బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తుస్ మనిపించింది.. ఆ జట్టు ఓటమి కంటే ఓడిన తీరే అభిమానులకు భారం అనిపించింది.
ఐపీఎల్ ఎంతటి బ్యాట్స్ మెన్ గేమ్ అయినా.. కేవలం బ్యాటింగ్ నే నమ్ముకుని బరిలో దిగితే పనికాదని ఈ సీజన్ లో సన్ రైజర్స్ ను చూస్తే తెలుస్తోంది.
అసలు సన్ రైజర్స్ జట్టు కూర్పే ఈ సీజన్ లో బాగోలేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఇలా కీలకమైన టాప్ ఆర్డర్ లో ముగ్గురూ ఎడమచేతివాటం ఆటగాళ్లే. వారు పోగా.. క్లాసెన్ తప్ప మంచి బ్యాటరే లేడు. మార్క్ రమ్ వంటివాడిని వదులుకోవడం తప్పు. ఆ స్థానాన్ని సమర్థుడితో భర్తీ చేయకపోవడం మరీ తప్పు.
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని నాలుగో స్థానంలో దింపినా అతడు ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మిడిలార్డర్ బలహీనపడింది. ఇక బౌలింగ్ లోనూ హైదరాబాద్ ది పేలవ ప్రదర్శన. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రపంచ స్థాయి బౌలర్ అయినా.. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ పైన మాత్రమే ఈ స్థాయిలో బౌలింగ్ చేశాడు.
సన్ రైజర్స్ లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీది ఫ్లాప్ షో. ఇటీవల గాయ నుంచి కోలుకున్న షమీ.. ఇంకా రిథమ్ అందుకోలేదు. అన్నిటికి మించి సన్ రైజర్స్ లో మంచి ఆల్ రౌండర్ లేదు. ఓవైపు ఆన్ ఫీల్డ్ లో జట్టు ప్రదర్శన ఇలా ఉంటే.. ఆఫ్ ఫీల్డో వ్యహరించిన తీరు మరింత విమర్శలకు తావిచ్చింది. దీంతో సన్ రైజర్స్ టైం పాస్ కోసమే ఆడుతున్నదన్న విమర్శలు వచ్చాయి.
గత వారం చెన్నై సూపర్ కింగ్స్ ను తొలిసారిగా వారి సొంత మైదానం చెపాక్ లో ఓడించిన సన్ రైజర్స్.. పుంజుకునే చాన్సుందన్న ఆశలు రేకెత్తించింది. తర్వాతి మ్యాచ్ కు వారం విరామం ఉండడంతో ఆటగాళ్లను మాల్దీవ్ లకు పంపింది యాజమాన్యం.
సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అనుకుంటే ఓకే. కానీ, జట్టు జట్టంతా ఫామ్ లేమితో ఉంటే ప్రాక్టీస్ కు ప్రాధాన్యం ఇవ్వకుండా హనీమూన్ కు వెళ్లినట్లుగా ఇలాంటి టూర్లు వేయడం ఏమిటనేది ప్రశ్న.
మరోవైపు హైదరాబాద్ లోనూ సన్ రైజర్స్ ప్లేయర్లు పబ్ లు అంటూ తిరిగారనే విమర్శలున్నాయి. మాల్దీవ్ బీచ్ లలో వాలీబాల్ ఆడుతూ.. మద్యం తాగుతూ చిల్ అయ్యారు.
సన్ రైజర్స్ హెడ్ కోచ్ వెటోరి మాత్రం తమకు ఈ సీజన్ లో అచ్చి రాలేదు అని చెబుతున్నాడు. కానీ, వాస్తవం అది కాదు.. ఆటగాళ్లు ఆడలేదు అని చెప్పుకోవాలి.
కొసమెరుపు: సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది కాబట్టి సరిపోయింది. లేదంటే పిచ్ పరిస్థితుల రీత్యా చూస్తే ఈ మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ ఓడేదేమో?
నిరుటి రన్నరప్ అయిన ఈ జట్టు.. ఈ సారి 11 మ్యాచ్ లలో మూడు మాత్రమే నెగ్గి ఈ సీజన్ ను ముందే ముగించింది.
