Begin typing your search above and press return to search.

పాపం దక్షిణాఫ్రికా... సరికొత్త రికార్డ్ 0-7!

అవును... లీగ్ దశలో దుమ్ములేపి దంచికొట్టే సఫారీలు నాకౌట్ మ్యాచ్‌ లకు వచ్చేసరికి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:56 AM GMT
పాపం దక్షిణాఫ్రికా... సరికొత్త రికార్డ్  0-7!
X

వన్డే ప్రపంచ కప్ 2023 లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆసిస్ చేతిలో ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా టీం ని చూసిన చాలా మంది ఇదే మాట అని ఉంటారు! ఇక కాస్త క్రికెట్ చరిత్ర తెలిసిన వారైతే ఖచ్చితంగా ఆ మాట అంటారు. అదే... “పాపం దక్షిణాఫ్రికా”! కారణం... లీగ్ దశలో ప్రత్యర్థులను ఒక ఆటాడుకునే సఫారీలు నాకౌట్ దశలో మాత్రం ఒత్తిడికి గురవుతున్నారు! ఫలితంగా... “చోకర్స్‌” అన్న ముద్రను కాపాడుకుంటూ వస్తున్నారు!

అవును... లీగ్ దశలో దుమ్ములేపి దంచికొట్టే సఫారీలు నాకౌట్ మ్యాచ్‌ లకు వచ్చేసరికి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మరోసారి ఈ బలహీనత వెంటాడిన వేళ.. దక్షిణాఫ్రికా ఏడోసారి ప్రపంచకప్‌ సెమీస్‌ లో ఓటమి పాలైంది. ఇందులో ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ లు కాగా... రెండు సార్లు టీ-20 సెమీ ఫైనల్స్ కావడం గమనార్హం. ఇది ఏ టీం కైనా, ఏ టీం అభిమానులకైనా తీవ్ర విషాధగాధ అనడంలో సందేహం ఉండకపోవచ్చు!

వాస్తవానికి ఈసారి వరల్డ్ కప్ లో ఆ జట్టు లీగ్ దశలో చూపించిన దూకుడు చూస్తే కచ్చితంగా ఫైనల్‌ చేరుతుందని అంతా అనుకునే ఉంటారు. కారణం... బ్యాటింగ్ ఆర్డర్ ఆ స్థాయిలో ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ లలలోనూ ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రతీసారీ ఆ టీం 300 పై చిలుకు పరుగులే సాధించింది. ఇదే సమయంలో ఫైనల్ లోనూ ఫస్ట్ బ్యాటింగ్ కి దిగింది.

దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అత్యల్ప స్కోరు 311/7 కావడంతో... సెమీస్ లో మామూలుగా ఉండదని అంతా భావించారు. టాప్ ఆర్డర్ లో డీకాక్, బవుమా, వాండర్ డసెన్ లు శుభారంభాన్ని ఇస్తే... ఇక చివర్లో మార్క్రం, మిల్లర్ లు బంతాడేస్తారని భావించారు. అయితే జరిగింది వేరు! డేవిడ్‌ మిల్లర్‌ (101: 8×4, 5×6) అద్భుత శతకం, క్లాసెన్‌ (47: 4×4, 2×6) మినహా మరెవరూ రాణించలేదు!

దీంతో 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఇక ఛేదనలో కాస్త తడబడినప్పటికీ కంగారులు 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేశారు. ఆసిస్ బ్యాటర్స్ లో "మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" హెడ్‌ (62: 9×4, 2×6) కావడం గమనార్హం! దీంతో.. “పాపం సఫారీలు... వీరికే ఎందుకు ఇలా జరుగుతుంది” అనే కామెంట్లు కామెంటరీలలోనూ, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ లోనూ దర్శనమివ్వడం గమనార్హం.

కాగా... ఈ తాజా మ్యాచ్ తో కలిపి ప్రపంచకప్‌ లో సెమీ ఫైనల్ మ్యాచ్ లో వెనుదిరగడం దక్షిణాఫ్రికాకు ఇది ఏడోసారి! ఇందులో భాగంగా...1992, 1999, 2007, 2015, 2023 లలో వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లలోనూ 2009, 2014 టీ20 ప్రపంచకప్‌ లలోనూ ఓడిపోతూ వస్తున్నారు. మరి ఈ ఆ జట్టుకు ఈ సమస్య పోవడానికి ఇంకెంతకాలం పడుతుందో వేచి చూడాలి!