బౌలర్.. బ్యాట్స్ మన్ డిష్యుం డిష్యుం.. పిచ్ పైనే తన్నులాట
క్రికెట్ లో ఏ దశలోనైనా ఆటగాళ్లకు చెప్పే మాట ఒకటి ఉంటుంది.. ‘‘అంపైర్ ఈజ్ అంపైర్’’. అంటే.. మైదానంలో అంపైర్ చెప్పిందే ఫైనల్ అని.
By: Tupaki Desk | 30 May 2025 2:00 PM ISTక్రికెట్ లో ఏ దశలోనైనా ఆటగాళ్లకు చెప్పే మాట ఒకటి ఉంటుంది.. ‘‘అంపైర్ ఈజ్ అంపైర్’’. అంటే.. మైదానంలో అంపైర్ చెప్పిందే ఫైనల్ అని. ఆటగాళ్ల మధ్య గొడవలను నివారించే ఉద్దేశంలో ఈ మాట అంటూ ఉంటారు. అందుకే క్రికెట్ అంటే జెంటిల్ మెన్ గేమ్ అని చెబుతారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అయితే ఆటగాళ్లకు కచ్చితమైన ప్రవర్తనా నియమావళి ఉంటుంది. మైదానంలో ప్రవర్తనతో పాటు అన్నిటిని నిబంధనల కళ్లు గమనిస్తూ ఉంటాయి. ఎవరైనా హద్దులు దాటితే దాని స్థాయి ప్రకారం జరిమానాలు, శిక్షలు ఉంటాయి. అయితే, బంగ్లాదేశ్ లో మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఘటన మాత్రం అన్ని పరిమితులు దాటింది.
దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ (వర్ధమాన) జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. బంగ్లాదేశ్ ఎమర్జింగ్ టీమ్ తో నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతోంది. గురువారం మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా బౌలర్ షెపో ఎంటులి.. బంగ్లా బ్యాటర్ రిపాన్ మెండాల్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎంటులి బౌలింగ్ లో రిపాన్.. సిక్స్ కొట్టగా నాన్ స్ట్రయికర్ గా ఉన్న బంగ్లా జాతీయ ఆటగాడు మెహదీ హసన్ అతడిని అభినందించాడు. దీంతో ఎంటులి ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు అది.. నెట్టుకోనేవరకు దారితీసింది. రిపాన్ ఛాతీపై కొట్టిన ఎంటులి.. తల (హెల్మెట్ )పైనా రెండుసార్లు కొట్టాడు.
అంపైర్లు అడ్డుగా వెళ్లి.. తోటి ఆటగాళ్లు కలగజేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రిపాన్ ను లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడారు. రిపాన్-ఎంటులిని విడదీశాక రిపాన్ ను దూషించారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
