Begin typing your search above and press return to search.

అన్నీ ఆలోచించే రోహిత్ ప‌గ్గాలు చేప‌ట్టాడా? టీం ఇండియాపై గంగూలీ వ్యాఖ్య‌లు

విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్‌ను కేప్టెన్‌గా ప్రకటించిన విష‌యం తెలిసిందే. అన్ని ఫార్మట్లలోనూ జట్టు పగ్గాలను రోహిత్ చేతుల్లో నే పెట్టింది

By:  Tupaki Desk   |   11 Nov 2023 12:30 AM GMT
అన్నీ ఆలోచించే రోహిత్ ప‌గ్గాలు చేప‌ట్టాడా?  టీం ఇండియాపై గంగూలీ వ్యాఖ్య‌లు
X

రోహిత్ శ‌ర్మ‌. టీం ఇండియా కెప్టెన్‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్ అజేయ గెలుపు దిశ‌గా సాగుతోందంటే దీనికి కార‌ణం రోహిత్ శ‌ర్మే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వరుస విజయాల్లో కెేప్టెన్‌గా, జట్టు ఓపెనర్‌గా కీలక పాత్రను పోషించ‌డంతోపాటు.. దక్షిణాఫ్రికా, శ్రీలంకను వంద పరుగులు కూడా దాటనివ్వకుండా పెవిలియ‌న్ దారి ప‌ట్టించిన ఘ‌న‌త‌కూడా రోహిత్‌దే. బ్యాటర్‌గా భారీ స్కోర్లు చేస్తూనే.. సమయానుకూలంగా బౌలర్లను మార్చి త‌న స‌త్తా చాటుతున్నాడు. స్పిన్నర్లు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాడు.

అయితే.. టీం ఇండియా కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను రోహిత్ శ‌ర్మ చేప‌ట్ట‌డం అంత తేలిక‌గా జ‌ర‌గ‌లేద‌ని.. దీని వెనుక పెద్ద త‌తంగ‌మే న‌డించింద‌ని భార‌త మాజీ క్రెక‌ట‌ర్‌, బీసీఐ మాజీ చైర్మ‌న్ గంగూలీ వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా కొల్‌క‌తాకు చెందిన ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయా విష‌యాలు వెల్ల‌డించాడు.

విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్‌ను కేప్టెన్‌గా ప్రకటించిన విష‌యం తెలిసిందే. అన్ని ఫార్మట్లలోనూ జట్టు పగ్గాలను రోహిత్ చేతుల్లో నే పెట్టింది. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ను సక్సెస్ ఫుల్ టీమ్‌గా మార్చ‌డంలో రోహిత్ కృషిని గ‌మ‌నించినబీసీఐ భార‌త ప‌గ్గాలు అత‌నికి అప్ప‌గించింది. అయితే.. ఈ విష‌యంలో ముందు.. త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట న‌ల‌ను గంగూలీ వివ‌రించాడు.

ముందు అస‌లు రోహిత్ కెప్టెన్సీ బాధ్య‌త‌ను తీసుకునేందుకు త‌ట‌ప‌టాయించిన‌ట్టు గంగూలీ చెప్పాడు. దీనికి కార‌ణం.. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మాట్లల్లో జట్టును న‌డిపించే బాధ్య‌త‌ను తీసుకుంటే త‌న‌పై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంద‌ని రోహిత్ భావించిన‌ట్టు గంగూలీ వివ‌రించాడు. అయితే.. అప్ప‌టికే బీసీఐ రోహిత్ పేరును ప‌రిశీల‌న‌లోకి తీసుకుంది. కానీ, అత‌ని అంగీకారం కోసం ఎదురుచూసింద‌ని గంగూలీ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ అప్ప‌టికే రోహిత్ ఓకే చెప్పి ఉంటే.. వెంట‌నే అత‌ని పేరును ప్ర‌క‌టించేందుకు కూడా సిద్ధ‌మైన‌ట్టు ఆయ‌న వివ‌రించాడు.

త‌న‌ను టీం ఇండియా కెప్టెన్ చేయాల‌న్న బీసీసీఐ నిర్ణ‌యంపై రోహిత్ చాలా కాలం పాటు ఆలోచించిన‌ట్టు గంగూలీ పేర్కొన్నాడు. అయితే.. స‌మ‌యం తీసుకున్నా.. అన్ని కోణాల్లోనూ.. అన్ని లోతుల్లోనూ ప‌రిశీలించుకుని.. నిపుణుల స‌ల‌హాలు కూడా తీసుకున్నాకే.. టీం ఇండియా కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ట్టు వివ‌రించాడు. అయితే..ఇంత సుదీర్ఘ స‌మ‌యం తీసుకున్నా.. రోహిత్ టీం ఇండియాను న‌డిపించ‌డంలో స‌క్సెస్ బాట‌లోనే ఉన్నాడ‌ని ప్ర‌శంస‌లు గుప్పించారు.