Begin typing your search above and press return to search.

మహాద్భుత స్పెల్.. సఫారీలను చుట్టేసిన హైదరాబాదీ

ప్రపంచ కప్ నకు ముందు ఆసియా కప్ లో అద్భుతంగా రాణించాడు.. మెగా టోర్నీలో టీమిండియాకు తురుపుముక్కగా మారతాడు అనుకుంటే పెద్దగా ప్రభావం చూపలేదు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 11:19 AM GMT
మహాద్భుత స్పెల్.. సఫారీలను చుట్టేసిన హైదరాబాదీ
X

ప్రపంచ కప్ నకు ముందు ఆసియా కప్ లో అద్భుతంగా రాణించాడు.. మెగా టోర్నీలో టీమిండియాకు తురుపుముక్కగా మారతాడు అనుకుంటే పెద్దగా ప్రభావం చూపలేదు. ఓవిధంగా ఫైనల్ లో అతడు రాణించి ఉంటే ప్రపంచ కప్ చేజారకపోయేదేమో..? ఇక అప్పటినుంచి విశ్రాంతి తీసుకుని దక్షిణాఫ్రికా టూర్ లో పరిమిత ఓవర్ల మ్యాచ్ లో పాల్గొన్నప్పటికీ గతంలోలా మెరుపులే లేవు. తొలి టెస్టులోనూ విఫలమయ్యాడు. దీందో అతడి పనైపోయిందనే భావన వ్యక్తమైంది.

మళ్లీ బుల్లెట్ బంతులు..

హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో అదరగొట్టాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి.. విదేశాల్లో ఇటీవలి కాలంలో అద్భుతం అనదగ్గ ప్రదర్శన కనబర్చాడు. 9 ఓవర్లు వేసిన అతడు మూడు మెయిడిన్లు సహా 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ప్రపంచ కప్ ముందటి సిరాజ్ ను గుర్తుచేశాడు. వాస్తవానికి సిరాజ్ మెగా టోర్నీలో వికెట్లు తీయలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు 2021 నుంచి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (30 పైగా) తీసిన బౌలర్ లలో సిరాజ్ టాప్ లో ఉన్నాడు. అలాంటిది సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ లో సిరాజ్ వికెట్లు పడగొట్టలేకపోయాడు. అయితే, దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో మాత్రం పుంజుకుని ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ పనిపట్టాడు.

మొదటి 7లో ఆరు అతడికే..

తొలి టెస్టులో భారత్ పై ఇన్నింగ్స్ విజయం సాధించిన ఊపులో రెండొ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు సిరాజ్ చుక్కులు చూపించాడు. చకచకా వికెట్లు పడగొట్టాడు. సఫారీలు ఓ దశలో కోల్పోయిన 7 వికెట్లలో ఆరు సిరాజ్ పడగొట్టినవే. సహచర పేసర్, తొలి టెస్టులో దుమ్ము రేపిన బుమ్రాను మించి హైదరాబాదీ సిరాజ్ రాణించాడు. బుమ్రా (2/25), కొత్త కుర్రాడు ముకేశ్ (2/2) మిగతా పని పూర్తి చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా బెంబేలు..

సిరాజ్ దెబ్బకు దక్షిణాఫ్రికా చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణ ప్రదర్శన కనబర్చింది. ఎప్పుడో 1927లో ఇంత తక్కువ స్కోరు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఘనతలో ప్రధాన పాత్ర హైదరాబాదీ సిరాజ్ కే దక్కుతుందనడంలో సందేహంలేదు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి నిలవలేకపోయిన టీమిండియా రెండో టెస్టులో ఏమాత్రం పోటీ ఇస్తుందోననే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. కానీ, మన పరువు నిలుపుతూ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 350పైగా పరుగులు చేస్తే టెస్టు మనదే అవుతుంది. తద్వారా సిరీస్ 1-1తో సమం అవుతుంది. దక్షిణాఫ్రికా నుంచి గౌరవప్రదంగా తిరిగొస్తుంది.