Begin typing your search above and press return to search.

సొంత జట్టుపై హైదరాబాదీ పేసర్ ప్రతీకారం.. ఓటమి రుచి చూపాడు

సాధారణ బౌలర్ గా ఉన్న అతడిని ఆ ఫ్రాంచైజీ టీమ్ ఇండియా బౌలర్ గా మార్చింది.

By:  Tupaki Desk   |   3 April 2025 3:57 PM IST
Siraj Redemption: Triumph Against His Former Team!
X

సాధారణ బౌలర్ గా ఉన్న అతడిని ఆ ఫ్రాంచైజీ టీమ్ ఇండియా బౌలర్ గా మార్చింది.. హైదరాబాద్ గల్లీలకు పరిమితమైన అతడిని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది.. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఏడేళ్లు తమ జట్టుతో ఉంచుకుంది.. అలాంటి అతడు ఇప్పుడు ఆ జట్టుపైనే ప్రతీకారం తీర్చుకున్నాడు.. ఓటమి రుచి చూపాడు..

పైన చెప్పుకొన్నదంతా సరదాగానే.. ఇదేమీ సీరియస్ మ్యాటర్ కాదు. పైగా హైదరాబాదీ పేసర్ కు ఇప్పుడు చాలా మేలే జరిగింది. ఇంతకూ విషయం ఏమంటే..? టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ మొన్నటివరకు కీలక బౌలర్ గా ఉన్నాడు మొహమ్మద్ సిరాజ్. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి అతడిని పక్కనెట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తో సిరీస్ కూ ఎంపిక చేయలేదు. సిరాజ్ బంతి పాతబడ్డాక వికెట్లు తీయలేకపోతున్నాడు. పైగా పరుగులూ ఇస్తున్నాడు. అందుకని టీమ్ ఇండియా నుంచి పక్కకు పెట్టారు. టెస్టుల్లో ఇప్పటికీ సిరాజ్ కు చోటుంది. కానీ, జూన్ వరకు టెస్టులే లేవు.

రిటైన్ చేసుకోకపోగా, గత ఏడాది నవంబరులో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సిరాజ్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్దనుకుంది. 2017లో సన్ రైజర్స్ కు, ఆ తర్వాత ఏడు సీజన్లు బెంగళూరుకు ఆడుతూ వస్తున్నాడు సిరాజ్. కాగా, వేలంలో రూ.11 కోట్లు పెట్టి అతడిని గుజరాత్ టైటాన్స్ కొనుక్కుంది. కాగా, తొలి మ్యాచ్ లో మాత్రం సిరాజ్ తన జట్టుకు ఉపయోగపడలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఆ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 54 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు.

కాగా, రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై మాత్రం సిరాజ్ చెలరేగాడు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ లను బౌల్డ్ చేసి ఫామ్ లోకి వచ్చాడు. అసలైన సవాల్ మాత్రం బుధవారం తన మాజీ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎదురైంది. తనను పెద్దవాడిని చేసిన బెంగళూరుతో మ్యాచ్ అంటే సిరాజ్ కు ఎంతైనా ఎమోషనే కదా...?

అయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సిరాజ్ తనదైన బౌలింగ్ తో దెబ్బతీశాడు. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్, యువ బ్యాట్స్ మన్ దేవదత్ పడిక్కల్ తో పాటు హాఫ్ సెంచరీతో మంచి ఊపుమీదున్న లివింగ్ స్టన్ నూ ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు 169 పరుగుల తక్కువ స్కోరుకే పరిమితమైంది. ప్రస్తుత లీగ్ లో తమ తొలి రెండు మ్యాచ్ లలో కోల్ కతా, చెన్నైపై గెలిచిన బెంగళూరు తొలిసారి ఓడిపోయింది.

గత రెండు మ్యాచ్ ల మరీ ముఖ్యంగా తాజాగా బెంగళూరుపై ప్రదర్శన మాత్రం సిరాజ్ లో మళ్లీ పునరుత్తేజం నింపేదే. టీమ్ ఇండియాకు దూరమై, కెరీర్ పరంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్న సిరాజ్ కు తాజా ఐపీఎల్ సీజన్ ఎనర్జీ ఇచ్చేదే.