Begin typing your search above and press return to search.

గ్రౌండ్ లో అంపైర్లతోనే లొల్లి.. ఐపీఎల్ లో కెప్టెన్ పై వేటు?

దీంతో ఈ సీజన్ లో తొలిసారిగా ఓ వేటు పడనున్న కెప్టెన్ గా అతడి పేరు వినిపిస్తోంది. గతంలో ఓవర్లు నిదానంగా వేసినందుకు (స్లో ఓవర్ రేట్) మ్యాచ్ నిషేధం ఎదుర్కొనాల్సి వచ్చేది

By:  Tupaki Desk   |   3 May 2025 4:23 PM IST
గ్రౌండ్ లో అంపైర్లతోనే లొల్లి.. ఐపీఎల్ లో కెప్టెన్ పై వేటు?
X

తన ఔట్ సందర్భంగానూ వాగ్వాదం.. తమ జట్టు ఫీల్డింగ్ సందర్భంగానూ వాగ్వాదం.. ఇదేదో తోటి ఆటగాళ్లతో కాదు.. అంపైర్లతో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ కెప్టెన్ నిర్వాకం. దీంతో ఈ సీజన్ లో తొలిసారిగా ఓ వేటు పడనున్న కెప్టెన్ గా అతడి పేరు వినిపిస్తోంది. గతంలో ఓవర్లు నిదానంగా వేసినందుకు (స్లో ఓవర్ రేట్) మ్యాచ్ నిషేధం ఎదుర్కొనాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ రూల్ లేకున్నా.. వేరే నిబంధనల కింద ఆ కెప్టెన్ పై సస్పెన్షన్ విధించే అవకాశం కనిపిస్తోంది.

టీమ్ ఇండియా యువ బ్యాట్స్ మన్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో మంచి జోష్ లో ఉండగా రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ లో ఇది జరిగింది. తనను ఔట్ ఇచ్చినందుకు ఫీల్డ్‌ అంపైర్‌ తో పాటు బౌండరీ లైన్‌ వద్ద ఉన్న అంపైర్‌ తోనూ గిల్ వాగ్వాదానికి దిగాడు. సన్‌ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఎల్బీడబ్ల్యూ కోసం 14వ ఓవర్ లో అప్పీల్ చేయగా అంపైర్‌ ఇవ్వలేదు. డీఆర్‌ఎస్‌ లో అంపైర్స్‌ కాల్‌ అని రావడంతో గిల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.

ఈ రెండు ఘటనలూ గిల్ పై వేడు పడుతుందా? భారీ జరిమానా కూడా విధిస్తారా? అనే చర్చను రేకెత్తిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోడ్‌ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 ప్రకారం మాత్రం గిల్‌ పనిష్మెంట్ తప్పించుకోలేడు.

ఆర్టికల్ 2.8 ప్రకారం.. అంపైర్ల నిర్ణయంపై తీవ్ర నిరసన తెలపడం, వారి నిర్ణయం ఇష్టం లేకుంటే ఆట ఆపేందుకు ప్రయత్నించడం, క్రీజు వీడడం, నిరసనలో భాగంగా తలను తీవ్ర స్థాయిలో ఊపడం, ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినప్పుడు ఇన్‌ సైడ్ ఎడ్జ్‌ తీసుకుందని చెప్పేలా చూపడం, క్యాచ్ పట్టినప్పుడు బంతి బ్యాట్‌ కు కాకుండా ప్యాడ్లు, భుజానికి తాకిందని మళ్లీమళ్లీ చెప్పడం, అంపైర్‌ నుంచి దూకుడుగా టోపీ లాక్కోవడం, అంపైర్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో చర్చించడం తప్పదాలు. వీటిలో రెండు సెక్షన్లు మాత్రం గిల్ కు సరిపోయే చాన్సుంది. దీంతో జరిమానా, మ్యాచ్ సస్పెన్షన్ రెండూ విధిస్తారని కూడా అంటున్నారు.