మళ్లీ రగడ.. ఇంగ్లండ్ కు క్రీడా స్ఫూర్తి లేదన్న భారత కెప్టెన్ గిల్
బుధవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో గిల్ మాట్లాడాడు.
By: Tupaki Desk | 23 July 2025 12:14 PM ISTబంతి పాతబడడం.. ఆటగాళ్ల మధ్య వాగ్వాదం.. ఇంకా అనేక కారణాలతో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో వరుసగా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.. దీనికితోడు కొత్తగా కావాలనే సమయాన్ని వేస్ట్ చేయడం అనే అంశంపై రగడ జరుగుతోంది. ''ఇంగ్లండ్ ఆటగాళ్లు కావాలని ఆలస్యం చేస్తున్నారు'' అంటూ భారత కెప్టెన్ శుబ్ మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. బుధవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో గిల్ మాట్లాడాడు.
లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టు మూడో రోజు చివర్లో భారత ఇన్నింగ్స్ ముగిశాక ఇంగ్లండ్ ఓపెనర్లు బ్యాటింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిసేపే బ్యాటింగ్ చేసినా.. ఆ కాస్త సమయంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారత స్టార్ పేసర్ బుమ్రా ధాటిని తట్టుకోలేక.. ఇంగ్లండ్ ఓపెనర్లు నాటకాలు ఆడినట్లు కనిపించింది. మరీ ముఖ్యంగా జాక్ క్రాలీ అయితే.. బంతి చేతికి తగిలి నొప్పి పుడుతున్నట్లు నటించాడు. చివరకు ఆ రోజును ముందుగానే ముగించారు. అయితే, వారు 90 సెకన్లు ఆలస్యంగా గ్రౌండ్ లోకి దిగారని గిల్ అంటున్నాడు. కావాలనే టైమ్ వేస్ట్ చేశారని చెప్పాడు. వాస్తవానికి ఆ రోజులో కేవలం ఏడు నిమిషాల ఆటనే మిగిలింది. అయినా ఇంగ్లండ్ ఓపెనర్లు టైం వేస్ట్ చేశారని గిల్ ఆరోపించాడు. ఇది క్రీడా స్ఫూర్తి కాదన్నాడు. దీంతో తనకు కోపం వచ్చిందని గిల్ తెలిపాడు. అయితే, క్రాలీ విషయంలో టీమ్ ఇండియా ఆటగాళ్ల తీరును ఇంగ్లిష్ మీడియా వెక్కిరించింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్, భారతీయ మూలాలున్న మార్క్ రాం ప్రకాశ్ కూడా టీమ్ ఇండియాకు మద్దతుగా నిలవడం గమనార్హం. క్రాలీ తీరునే తప్పుబట్టాడు. అంపైర్లు కూడా ఉదాసీనంగా ఉన్నారని అన్నాడు.
లార్డ్స్ టెస్టులో భారత్ చివరి వరకు పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి మాంచెస్టర్ లో నాలుగో టెస్టు జరగనుంది. టీమ్ ఇండియా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుంది..? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పేసర్లు ఆకాశ్ దీప్, అర్షదీప్ దూరం కావడంతో పాటు బుమ్రాను కచ్చితంగా ఆడించాల్సి వస్తోంది. తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో సాయిసుదర్శన్ కు అవకాశం దక్కనుంది. కొత్త కుర్రాడు పేసర్ అన్షుల్ కాంబోజ్ ను ఆకాశ్ స్థానంలో ఆడిస్తారని తెలుస్తోంది.
