శుభ మంగళం గిల్.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే ’పెళ్లి కొడుకు’
టీమ్ ఇండియాలో టాలెంటెడ్ బ్యాట్స్ మనే కాదు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శుబ్ మన్ గిల్.
By: Tupaki Desk | 22 April 2025 9:23 AMటీమ్ ఇండియాలో టాలెంటెడ్ బ్యాట్స్ మనే కాదు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శుబ్ మన్ గిల్. ఐదేళ్ల కిందట అరంగేట్రం చేసినప్పటి నుంచి గిల్ వెనక్కుచూసుకున్నది లేదు. ఇప్పుడు మూడు ఫార్మాట్లకు అతడు భవిష్యత్ కెప్టెన్ రేసులోనూ ఉన్నాడు.
మధ్యలో గత ఏడాది కాస్త వెనుకబడినా ఇప్పుడు మాత్రం మాంచి టచ్ లో ఉన్నాడు గిల్. గత నెలలో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టులోనూ కీలక సభ్యుడైన అతడు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు.
8 మ్యాచ్ లలో ఆరు విజయాలు సాధించిన గుజరాత్ ప్రస్తుతం టేబుల్ టాపర్. వాస్తవానికి ఈ సీజన్ కు గుజరాత్ తమ పేసర్ షమీని వదులుకుని బెంగళూరు నుంచి హైదరాబాదీ సిరాజ్ ను తెచ్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ వదిలేసిన బట్లర్ ను గుజరాత్ తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలు ఆ జట్టుకు ఎంత బలం అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక షారూఖ్ ఖాన్ వంటి హిట్టర్ ను కూడా తీసుకోవడం, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్ రౌండర్ ను ఎంచుకోవడం గుజరాత్ కు బాగా ప్లస్ అయింది. వీటన్నిటితో గిల్ మహర్దశ నడుస్తోంది అనిపిస్తోంది.
తాజాగా సోమవారం గుజరాత్ టైటాన్స్ తమ 8వ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై అలవోకగా గెలిచింది. ఓపెనర్, కెప్టెన్ గిల్ (55 బంతుల్లో 90, 10 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుతంగా ఆడాడు. ఆపై బౌలర్లు చెలరేగడంతో కోల్ కతాకు సొంతగడ్డపై పరాభవం తప్పలేదు. అయితే, ఈ మ్యాచ్ కు ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
టాస్ సందర్భంగా సహజంగా పిచ్ పరిస్థితులు, తుది జట్టు కూర్పు, మార్పు చేర్పులు, వ్యూహాల గురించి అడుగుతుంటారు. కానీ, కామెంటేటర్ డానీ మోరిసన్ మాత్రం.. ’’గిల్ నువ్వు చూసేందుకు చాలా బాగున్నావ్. మరి పెళ్లెప్పుడు..? అని అడిగాడు. ఊహించని ఈ ప్రశ్నకు గిల్ సిగ్గుల మొగ్గే అయ్యాడు. షాక్ నుంచి తేరుకుని నవ్వుతూనే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంటూ గిల్ బదులిచ్చాడు.
కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో శుబ్ మన్ గిల్ డేటింగ్ లో ఉన్నట్లు చాన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఫాలో చేసుకోవడం కూడా ఊహాగానాలకు బలం చేకూర్చింది. గిల్ ఆడుతున్న మ్యాచ్ లకు సారా రావడంతో మరింత బలం వచ్చింది. చూద్దాం.. మున్ముందు ఏం జరుగుతుందో?