ఏ 'గిల్' మాంగే మోర్.. టీమ్‌ఇండియా కెప్టెన్ సూపర్ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్‌తో గత వారం లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేశాడు. తద్వారా కెప్టెన్‌గా తొలి టెస్టులోనే అదీ విదేశంలో సెంచరీ కొట్టిన ఘనత అందుకున్నాడు.
By: Tupaki Desk | 3 July 2025 7:27 PM ISTటెస్టు జట్టులో చోటే ఎక్కువ... ఏకంగా కెప్టెన్ కూడానా..? అతడి బ్యాటింగ్ సగటు చూడండి.. 35 కూడా లేదు.. విదేశాల్లో అయితే మరీ ఘోరం... ఇంగ్లండ్‌లో గత టూర్‌లో ప్రదర్శన దారుణం.. బ్యాట్‌్సమన్ గానే కొనసాగించడం మేలు.. కెప్టెన్సీ ఇచ్చి తప్పు చేశారు... ఇదీ టీమ్ ఇండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గురించి ఇటీవలి వరకు ఉన్న విమర్శలు. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడమే అనూహ్యం అనుకుంటే.. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, అదరగొడుతున్న యవ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌లలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వకుండా గిల్‌ను సారథి చేయడం ఏమిటనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ, వీటన్నిటికీ గిల్ తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో గత వారం లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేశాడు. తద్వారా కెప్టెన్‌గా తొలి టెస్టులోనే అదీ విదేశంలో సెంచరీ కొట్టిన ఘనత అందుకున్నాడు. తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ డబుల్ సెంచరీ చేశాడు.
ఇది ఎంత ప్రత్యేకం అంటే.. ఇంతవరకు ఆసియా దేశాలకు చెందిన కెప్టెన్ ఎవరూ సేన దేశాలు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ చేయలేదు. 37 మంది భారత కెప్టెన్లలో, 107 మంది ఆసియా కెప్టెన్లలో ఎవరికీ సాధ్యం కాలేదు. అందుకే గిల్ డబుల్ సెంచరీ సూపర్ స్పెషల్.
ఇక గిల్ తనపై విమర్శలకు ప్రధాన కారణమైన సగటును ఛేదించేశాడు. తొలి టెస్టులో సెంచరీ, ఇప్పుడు డబుల్ సెంచరీలతో అతడి టెస్టు బ్యాటింగ్ 40 దాటేసింది. తిరుగులేని ఆటతో టీమ్ ఇండియా కెప్టెన్ రికార్డులే రికార్డులు బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌లో ఓ భారత కెప్టెన్ అత్యధిక స్కోరు 179. 35 ఏళ్ల కిందట హైదరాబాదీ బ్యాట్స్‌మన్, కెప్టెన్ అజహరుద్దీన్ మాంచెస్టర్‌లో ఈ పరుగులు చేశాడు. గిల్ దానిని తాజాగా అధిగమించాడు. 25 ఏళ్ల గిల్..ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టాలని ఆశిద్దాం.