వచ్చాడు.. నడిపించాడు.. పదేళ్ల చెత్త దులిపేశాడు.. కప్ అందిస్తాడా?
ఐపీఎల్ లో ఢిల్లీ, బెంగళూరు కంటే మరీ పేలవమైన జట్టు పంజాబ్ కింగ్స్ అని చెప్పొచ్చు. 2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు 2021లో పంజాబ్ కింగ్స్ గా మారింది.
By: Tupaki Desk | 6 May 2025 8:00 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొదటి సీజన్ నుంచి ఉంటూ ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్లు ఏవంటే.. మొదటగా చెప్పుకొనే పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్. వీటికంటే ఎంతో వెనుక వచ్చిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే చాంపియన్ గా నిలిచింది. మరుసటి సీజన్ లో త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది.
ఐపీఎల్ లో ఢిల్లీ, బెంగళూరు కంటే మరీ పేలవమైన జట్టు పంజాబ్ కింగ్స్ అని చెప్పొచ్చు. 2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు 2021లో పంజాబ్ కింగ్స్ గా మారింది. 2014లో మాత్రమే రన్నరప్ గా నిలిచింది.
ఏదో పాల్గొన్నామంటే పాల్గొన్నాం.. ఆడాం అంటే ఆడాం అన్నట్లు పంజాబ్ కింగ్స్ ఉండేది. అలాంటి జట్టు ఈ సీజన్ లో దుమ్మురేపుతోంది. కేవలం 11 మ్యాచ్ లలోనే 15 పాయింట్లు సాధించింది. 2015 నుంచి కూడా ఆ జట్టు ఏ సీజన్ లోనూ 14 పాయింట్లను దాటలేదు. ఈ సారి మాత్రం ఇంకా మూడు మ్యాచ్ లు ఉండగానే 15 పాయింట్లకు చేరుకుంది. కనీసం ఒకటీ, రెండు మ్యాచ్ లలో విజయాలు సాధించినా ప్లేఆఫ్స్ చేరడం ఖాయం.
వచ్చాడు.. రాత మార్చాడు
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో దుమ్ము రేపుతుండడం వెనుక ఉన్న శక్తి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలిచిప అయ్యర్.. ప్రస్తుతం పంజాబ్ నూ ఆ దిశగా నడిపిస్తున్నాడు. స్వయంగా బ్యాట్ తో రాణిస్తూ వస్తున్నాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గెలవడం ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది.
గత ఏడాది చాంపియన్ గా నిలిపినప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయ్యర్ ను రిటైన్ చేసుకోలేదు. ఎక్కువ డబ్బులు అడగడమే దీనికి కారణం అని తెలిసింది. అదే పంజాబ్ వేలంలో రూ.26.75 కోట్ల రెండో అత్యధిక ధరతో అయ్యర్ ను తీసుకుని కెప్టెన్ చేసింది.
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, విల్ జాక్స్, శ్రేయస్ అయ్యర్.. ఇదీ పంజాబ్ బ్యాటింగ్ లైనప్. ఆదివారం నాటి మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ జట్టులో 9 మంది బ్యాటింగ్ చేయగల వారు ఉండడం విశేషం. బౌలింగ్ లో పేసర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ చాహల్ పంజాబ్ కు పెద్ద బలం.
మరి ఇంత మంచి జట్టు ఉన్న పంజాబ్ ను 18 ఏళ్లలో తొలిసారిగా చాంపియన్ గా నిలుపుతాడా శ్రేయస్ అయ్యర్...?
