నిజమైన వారియర్.. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్
2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ చరిత్ర తిరగరాసింది. సుదీర్ఘంగా పదకొండేళ్ల నిరీక్షణ తర్వాత వారు మళ్లీ ఫైనల్ బరిలో అడుగుపెట్టారు.
By: Tupaki Desk | 2 Jun 2025 11:00 AM IST2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ చరిత్ర తిరగరాసింది. సుదీర్ఘంగా పదకొండేళ్ల నిరీక్షణ తర్వాత వారు మళ్లీ ఫైనల్ బరిలో అడుగుపెట్టారు. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ తమ విజయయాత్రను కొనసాగించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును నెగ్గించాడు. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన ఘనతను ఆయన సాధించాడు. శ్రేయస్ అయ్యర్.. మూడు జట్లను ఫైనల్‌కు చేర్చిన ఏకైక సారథిగా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరుగాంచాడు.
ఈ సీజన్ ప్రారంభంలో ఓటములతో సరిపెట్టుకున్న ముంబై జట్టు, ఆ తరువాత చెలరేగిపోయింది. వరుస విజయాలతో ఆటలో పట్టును సంపాదించింది. బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులపై ఆగని దాడికి దిగింది. ఇదే దూకుడు పంజాబ్ జట్టు మీద ప్రయోగించినా క్వాలిఫైయర్ 2లో ఫలితం మరోలా తేలింది. పంజాబ్ జట్టు ఎదురుదాడితో అడ్డుకట్ట వేసింది. ప్రతిసారీ ముంబైకి ఎదురైన జట్లు ఒత్తిడిలో పడినప్పటికీ, ఈసారి అలా జరగలేదు. పంజాబ్ కెప్టెన్ అయ్యర్ తన ఆత్మవిశ్వాసంతో జట్టును నడిపించాడు. ఆరంభం నుంచే స్థిరంగా నిలబడి, దూకుడుగా ఆడి పరుగుల వరద పారించాడు. లక్ష్యాన్ని ఎంత పెద్దది అయినా దగ్గర చేసుకుంటూ తన ఆటలో స్థిరత్వాన్ని కొనసాగించాడు. కొన్ని ఓవర్లు నెమ్మదిగా సాగినా, పోరాటాన్ని మాత్రం ఎక్కడా తగ్గించలేదు. ఇదే కాదు ఇటీవల క్వాలిఫైయర్ -1లో కన్నడ జట్టు చేతిలో చేదు ఓటమి ఎదురైన తర్వాత కూడా అయ్యర్ మానసికంగా కృంగిపోకుండా తన అసలైన లక్ష్యాన్ని స్పష్టంగా తెలిపాడు. “మేము మ్యాచ్ మాత్రమే కోల్పోయాం, యుద్ధం కాదు… మా పోరాటం ఇంకా మిగిలే ఉంది.” అని అన్నారు.
ఈ మాటల్ని ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా నిజం చేశాడు అయ్యర్. ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. గెలుపు మీద దృష్టి సారించి తన పాత్రను నిఖార్సైన విధంగా పోషించాడు. సహచర ఆటగాళ్లు ఔట్ అయినప్పటికీ, భావోద్వేగానికి లోనవకుండా జట్టు కోసం పోరాడాడు. ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆట చివరికి, ముంబై జట్టు యజమానులు అనంత్ అంబానీ, నీతా అంబానీ ఆ మ్యాచ్ చూసి నిరాశతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అయ్యర్ ప్రదర్శన ముంబై జట్టుకు సవాల్‌గా మారి, వారికీ నిద్రలేని రాత్రిని పరిచయం చేసింది.ఓటముల నుంచి విజయాలవైపు ప్రయాణంలో పంజాబ్ సారథి అయ్యర్ చూపిన జ్ఞానాన్ని, శాంతాన్ని, సంకల్పాన్ని ఈ మ్యాచ్ మరిచిపోలేని మలుపుగా మలిచింది.
- ఐపీఎల్ లో మూడు జట్లను ప్లేఆఫ్స్ చేర్చిన ఏకైక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రమే..
* 2020లో ఢిల్లీ క్యాపిటల్స్
*2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్
* 2025లో పంజాబ్ కింగ్స్
ఇది సాధించడమే గాక పంజాబ్ కింగ్స్ తరఫున భారీ ధరకు శ్రేయాస్ కొనుగోల చేయబడ్డాడు. మెగా వేలంలో రూ. 26.75 కోట్లకు ఆయన్ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఇచ్చినట్లయ్యింది.
శ్రేయస్ మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ "ఇలాంటి భారీ మ్యాచ్‌లు నన్ను ఉత్సాహపరుస్తాయి. క్రీజ్‌లో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నా, నా జట్టులోని ఇతరులు అద్భుతంగా ఆడారు. మేం ఫస్ట్ క్వాలిఫయర్‌లో ఓడిన తర్వాత కూడా మా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒక్క మ్యాచ్ ఆధారంగా జట్టును తేల్చలేం." అని తెలిపారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన ముంబయి ఇండియన్స్‌కు ఇది ఊహించని ఓటమి. ఐపీఎల్ చరిత్రలో ముంబయి 200+ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన మొట్టమొదటి సందర్భం ఇది. 19 మ్యాచ్‌ల్లో 200+ స్కోరు చేసిన ముంబయి, 18 విజయాలు సాధించగా, ఇది తొలిసారి ఓడింది. అహ్మదాబాద్‌లో ముంబయికి ఇది వరుసగా ఆరో ఓటమి. చివరిసారి ఇక్కడ 2014లోనే గెలిచింది.
- పంజాబ్ కింగ్స్ రికార్డు ఛేదన
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో ఇది ఎనిమిదోసారి 200+ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించింది. ముంబయిపై ఎవరూ చేయలేని విధంగా 200+ లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్/నాకౌట్ స్టేజ్‌లో 204 పరుగుల ఛేదన అత్యధికం కావడం విశేషం.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు అడుగుపెట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత నాయకత్వంతో జట్టుకు నూతన శక్తిని చేకూర్చాడు. ఇప్పుడు పంజాబ్ అభిమానుల దృష్టి టైటిల్‌పై నిలిచింది. పండుగకు సిద్ధమవుతోంది పంజాబ్!