Begin typing your search above and press return to search.

‘అయ్యారే’...! నీపై న‌మ్మ‌కం క‌లుగుతుండ‌గా ఇలాంటి విమ‌ర్శలెందుకు?

మూడేళ్ల కింద‌టే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు.. రెండేళ్ల క్రితం వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో 400పైగా ప‌రుగులు చేశాడు.

By:  Tupaki Desk   |   8 Sept 2025 4:44 PM IST
‘అయ్యారే’...! నీపై న‌మ్మ‌కం క‌లుగుతుండ‌గా ఇలాంటి విమ‌ర్శలెందుకు?
X

మూడేళ్ల కింద‌టే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు.. రెండేళ్ల క్రితం వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో 400పైగా ప‌రుగులు చేశాడు. ఈ ఏడాది చాంపియ‌న్స్ ట్రోఫీ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.. టి20ల్లోనూ దుమ్మురేపాడు.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్ గా, బ్యాట్స్ మ‌న్ గానూ స‌త్తా చాటాడు. కానీ, ఇప్ప‌టికే టెస్టు జ‌ట్టులో రెగ్యుల‌ర్ మెంబ‌ర్ గా లేడు.. అడ‌పాద‌డ‌పా జ‌రిగే వ‌న్డేల‌ను మిన‌హాయిస్తే, టి20 జ‌ట్టులో త‌న స్థానం ఏమిటో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌ధ్య‌లో బీసీసీఐ ఆదేశాలు ధిక్క‌రించి క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎదుర్కొన్నాడు.. ప్ర‌తిభావంతుడు కాబ‌ట్టి తిరిగి జ‌ట్టులోకి రాగ‌లిగాడు. ఇప్పుడు అత‌డి కెరీర్ బోర్డు క్ష‌మాభిక్ష‌. ఒక‌వేళ కాలం క‌లిసివ‌స్తే వ‌న్డే కెప్టెన్ కూడా కాగ‌ల‌డు. కానీ, దానిని చేజేతులా చెడ‌గొట్టుకుంటున్నాడు.

ఎంపిక చేయాలంటే.. కూర్పు చూడాలిగా...

త‌న చ‌ర్య‌లో, త‌న వ్యాఖ్య‌లో... టీమ్ ఇండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. తాజాగా ఆసియా క‌ప్ (టి20 ఫార్మాట్‌)కు అయ్య‌ర్ ను ఎంపిక చేయ‌లేదు. టెస్టు కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ ను తీసుకొచ్చి మ‌రీ వైస్ కెప్టెన్ చేశారు. దీంతోనే అయ్య‌ర్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడాడు. జ‌ట్టులో, తుది జ‌ట్టులో ఉండేందుకు అర్హుల‌మైనా మ‌న‌ల్ని ఎంపిక చేయ‌కుంటే అస‌హ‌నం క‌లుగుతుందని అన్నాడు. అయితే, అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, ఆడుతున్న జ‌ట్టును గెలిపించాల‌ని పేర్కొన్నాడు. ఎవ‌రికోస‌మో అన్న‌ట్లు కాకుండా మ‌న ప‌ని మ‌నం చేసుకుపోవాల‌ని తెలిపాడు.

త‌న ఎంపిక గురించేనా..?

అయ్య‌ర్ తాజా వ్యాఖ్య‌లు త‌నకు టి20 జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంపైనే అని ప‌రోక్షంగా తెలుస్తోంది. మ‌రోవైపు అత‌డు ఈ సంద‌ర్భంలో చేసి ఉండాల్సిన వ్యాఖ్య‌లు కాదు అనిపిస్తోంది. కెప్టెన్, బ్యాట్స్ మ‌న్ గా ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించినా అయ్య‌ర్ ను ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేయ‌లేదు. ఇప్పుడు టి20 జ‌ట్టులోనూ చోటు ద‌క్క‌లేదు. అయితే, ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుతో వ‌న్డే సిరీస్ కు మాత్రం తీసుకున్నారు. అత‌డికి ఇదొక అవ‌కాశ‌మే. ఇలాంటి స‌మ‌యంలో అయ్య‌ర్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయం అవుతున్నాయి. పైగా వైస్ కెప్టెన్ గా గిల్ రావ‌డంతో టి20 జ‌ట్టు కూర్పులో అయ్య‌ర్ కు చోటు లేక‌పోయింది. సాయి సుద‌ర్శ‌న్ వంటి కుర్రాడికే చాన్స్ లు ద‌క్క‌డం లేదు. కాబ్ట‌టి అయ్య‌ర్ త‌న ట‌ర్న్ వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయ‌డ‌మే మిగిలింది.