టీమ్ ఇండియాపై ’తుపాకీ’ అనాలసిస్: అయ్యో అయ్యర్..చేజేతులా ఔట్ అయ్యాడే
ఇక తెలుగు కుర్రాడు, ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి మరో అవకాశం దక్కింది. వెటరన్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు మళ్లీ పిలుపొచ్చింది.
By: Tupaki Desk | 24 May 2025 3:51 PM ISTఐపీఎల్ లో కెప్టెన్ గా కప్ కొట్టినా జట్టు రిటైన్ చేసుకోలేదు.. ఈసారి కెప్టెన్ గా జట్టును ప్లేఆఫ్స్ చేర్చినా ఫలితం దక్కలేదు.. సరిగ్గా రెండేళ్ల కిందట అతడు టెస్టు జట్టులో కుదురుకున్నట్లు భావించారు. తీరా ఇప్పుడు చూస్తే అసలు చోటే లేదు. వాస్తవానికి దిగ్గజ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ అయిన నేపథ్యంలో ఆ ఆటగాడే కెప్టెన్ కావాల్సింది. కానీ, ఇప్పుడు జట్టులోనే లేడు. ఇదీ టీమ్ ఇండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి. 2023 అక్టోబరు-నవంబరులో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ అనంతరం క్రమంగా వివాదాలకు దగ్గరై జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీల్లో ఆడకపోవడం, గాయాలను సాకుగా చూపడం, గత ఏడాది ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను గెలిపించినా.. ఇంకా ఎక్కువ డబ్బు అడగడం వంటి వార్తలు అతడి చుట్టూ చేరాయి. బీసీసీఐ ఆగ్రహంతో మధ్యలో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. నిరుటి ఐపీఎల్ లో రానించి మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ను విజయపథంలో నడిపిస్తున్నాడు. ఇక టెస్టు జట్టులోకి రావడమే తరువాయి అనుకున్నారు. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తో అయ్యర్ కే చాన్స్ అని భావించారు. కానీ, సెలక్టర్లు అతడికి సమయం చూసి షాక్ ఇచ్చారు. ఇంగ్లండ్ తో సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ ను పరిగణనలోకి తీసుకోలేదు.
దేశవాళీల్లో అదరగొట్టిన కరుణ్ నాయర్ ను అయ్యర్ కు ప్రత్యామ్నాయంగా భావించారు. ఐపీఎల్ లో దుమ్మురేపుతున్న కుర్రాడు సాయి సుదర్శన్ కు, మంచి ఓపెనర్ గా పేరున్న బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ కు చాన్స్ ఇచ్చినా అయ్యర్ ను పట్టించుకోలేదు.
ఇక తెలుగు కుర్రాడు, ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి మరో అవకాశం దక్కింది. వెటరన్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు మళ్లీ పిలుపొచ్చింది.
మేటి పేసర్ బుమ్రాను గాయాల కారణంగా కెప్టెన్సీకి పరిగణించలేదు. అంతేగాక అతడు ఇంగ్లండ్ లో మొత్తం ఐదు టెస్టులు ఆడబోడని చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపాడు. గాయాల బెడద, ఫామ్ లేమితో ఉన్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీని ఎంపిక చేయలేదు. దీంతో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ పై బాధ్యత పెరిగింది. బుమ్రా లేని మ్యాచ్ లలో అర్షదీప్, ఆకాశ్ దీప్, ప్రిసిద్ధ్ క్రిష్ణలతో పేస్ దళాన్ని సిరాజ్ నడిపించాల్సి ఉంటుంది.
స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, సుందర్ లకు తోడు చైనామన్ కుల్దీప్ ను తీసుకున్నారు. వన్డేలు, టి20ల్లో బాగా రాణిస్తున్న స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను తీసుకోలేదు.
బ్యాటింగ్ లో చూస్తే న్యూజిలాండ్ తో సిరీస్ లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ను పక్కనపెట్టారు. ఇక రోహిత్, కోహ్లి స్థానాలు ఎవరితో భర్తీ చేస్తారు అనేది ప్రశ్న. సుదర్శన్, గిల్, జైశ్వాల్, రాహుల్, పంత్, కరుణ్ నాయర్.. ఇదీ టాప్-6 బ్యాటింగ్ ఆర్డర్ అని భావించవచ్చు. జడేజా, నితీశ్/శార్దూల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ తుది జట్టులో ఉండే మిగతా సభ్యులు.
