Begin typing your search above and press return to search.

3 పెళ్లిళ్లు.. 3 నోబ్ లు.. మ్యాచ్ ఫిక్సింగ్ కా ‘‘మాలిక్’’

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నుంచి విడాకులు తీసుకుని ఇటీవల వార్తలకెక్కాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్.

By:  Tupaki Desk   |   26 Jan 2024 10:53 AM GMT
3 పెళ్లిళ్లు.. 3 నోబ్ లు.. మ్యాచ్ ఫిక్సింగ్ కా ‘‘మాలిక్’’
X

పాకిస్థాన్ క్రికెట్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్ కు మూల కేంద్రం.. అది లీగ్ మ్యాచ్ అయినా.. అంతర్జాతీయ టోర్నీ అయినా.. సహజత్వానికి భిన్నంగా ఏమైనా జరిగిందంటే అనుమానించాల్సిందే.. ఇప్పుడలాంటి సంఘటనే జరిగింది. అది కూడా ఓ ప్రముఖ క్రికెటర్ విషయంలో.. భారత్ తో సంబంధాలున్న అతడు మ్యాచ్ లో అనుమానాస్పద రీతిలో బౌలింగ్ చేశాడు. దీంతో అతడిని ఫ్రాంచైజీ జట్టు ఒప్పందం నుంచి తప్పించింది.

అసలేం జరిగింది..?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నుంచి విడాకులు తీసుకుని ఇటీవల వార్తలకెక్కాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్. వీరిద్దరూ 2010లో హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, 2002లోనే పాకిస్థానీ యువతితో మాలిక్ కు పెళ్లయింది. ఆ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తిపలికి మాలిక్ సానియాను వివాహమాడాడు. 14 ఏళ్ల బంధం, ఒక కుమారుడు పుట్టిన తర్వాత రెండు నెలల కిందట సానియాతోనూ తెగదెంపులు చేసుకున్నాడు. మరోవైపు సానియానే మాలిక్ వివాహేతర సంబంధాలతో విసుగెత్తి అతడికి ‘ఖులా’ ఇచ్చిందని తేలింది. అనంతరం మాలిక్.. పాక్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ లో కనిపించాడు. ఫార్చూన్ బరిషల్ తరపున ఆడుతున్నాడు. అయితే, మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డాడని, అతడిని జట్టు నుంచి తప్పించినట్లు బంగ్లా మీడియా పేర్కొంది.

గొప్పోడు అనుకుంటే...?

మాలిక్ అంతర్జాతీయ క్రీడా జీవితం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. 1999లో కెరీర్ మొదలుపెట్టిన అతడు ఇప్పటికీ పాక్ టి20 జట్టుకు ఆడే ఉద్దేశంలో రిటైర్ మెంట్ ఇవ్వలేదు. ఓ దశలో కెప్టెన్ గానూ వ్యవహరించిన అతడు స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఫామ్ లేమితో జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు లీగ్ క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ నెల 22వ తేదీన బరిసాల్ వర్సెస్ ఖుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ లో మాలిక్‌ ఒక్క ఓవర్‌ వేసి 18 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్ లోనే మాలిక్ 3 నో బాల్స్ విసిరాడు. రనప్ తో వచ్చే పేస్ బౌలర్లు నో బాల్స్ వేయడం సహజమే. కానీ స్పిన్నర్ అయి ఉండి.. ఒకే ఓవర్ లో మూడు నో బాల్స్ వేయడం అంటే.. అనుమానం వచ్చింది. అతడు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీ యాజమాన్యం మాలిక్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. మాలిక్ కూడా జట్టు నుంచి బయటకు వచ్చాడు. ఆ వెంటనే దుబాయ్ కి వెళ్లిపోయాడు.

అప్పట్లో స్పాట్ ఫిక్సింగ్..

చిత్రంగా.. సానియాను షోయబ్ వివాహమాడిన ఏడాదే (2010).. అంతర్జాతీయ క్రికెట్ ను స్పాట్ ఫిక్సింగ్ వివాదం కమ్మేసింది. పాక్- ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌ లో పాక్ బౌలర్లు మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ నో బాల్స్ వేశారు. విచారణలో దోషులుగా తేలారు. ఇప్పుడు మాలిక్ విషయంలోనూ అదే సందేహం కలుగుతోంది. అతడు స్పాట్ ఫిక్సింగ్ తోనే నో బాల్స్ వేశాడా? అనేదానిపై విచారణ జరగనుంది.

కొసమెరుపు: సానియాను కాదనుకుని మూడో వివాహం ఆడిన మాలిక్.. మూడో నోబ్ లు వేయడంపై నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు.. మూడు పెళ్లిళ్లు.. మూడు నోబ్ లు అంటూ ఎద్దేశా చేశారు. ఇప్పుడు ఏకంగా ఫిక్సర్ అని తేలితే ఏం చేస్తారో?