ధురంధర్-2 స్టయిల్ లో టీమిండియాపై పాక్ క్రికెటర్ పొగడ్తలు
మరికొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ధురంధర్ 2 సినిమా ట్రైలర్ దుమ్మురేపుతోంది.. ధైర్యం, శక్తి, ప్రతీకారం.. అంటూ ట్రైలర్ ముగింపులో సినిమాలో అజిత్ ధోబాల్ పాత్రధారి మాధవన్ చెబుతాడు.
By: Tupaki Political Desk | 9 March 2026 4:56 PM ISTమరికొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ధురంధర్ 2 సినిమా ట్రైలర్ దుమ్మురేపుతోంది.. ధైర్యం, శక్తి, ప్రతీకారం.. అంటూ ట్రైలర్ ముగింపులో సినిమాలో అజిత్ ధోబాల్ పాత్రధారి మాధవన్ చెబుతాడు. ఇప్పుడు ఇదే స్టయిల్ లో విధానం.. పద్ధతి.. ప్రతిభ అంటూ టీమ్ఇండియాపై పాక్ క్రికెటర్ పొగడ్తలు కురిపిస్తున్నాడు. బహు అరుదుగా మాత్రమే భారత్ ను పొగుడుతుంటారు పాక్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు. వారికి భిన్నంగా ఈ స్టార్ మాత్రం సమయం దొరికితే చాలు ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. ఇప్పుడు కూడా అంతే! తన మనసులోని మాటను చెప్పేశాడు. ఏమాత్రం భయపడకుండా.. అది కూడా ధురంధర్ -2 ట్రయిలర్ తరహాలో.
నాడు నిప్పులు.. నేడు ప్రశంసలు
టీమ్ఇండియా బ్యాట్స్ మెన్ పాలిట ఒకప్పుడు సింహస్వప్నంగా నిలిచాడు పాక్ మాజీ సూపర్ ఫాస్ట్ పేసర్ షోయబ్ అక్తర్. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు. మరీ ముఖ్యంగా 1999లో భారత పర్యటనకు వచ్చిన సమయంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ ను క్లీన్ బౌల్డ్ చేసి భారత జట్టును అవాక్కు చేశాడు. గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ వంటి వారి డిఫెన్స్ ను కూడా ఛేదించాయి అక్తర్ బంతులు. వారి దేశానికి ఆడే సమయంలో భారత క్రికెటర్లపై నిప్పులు చెరిగే బంతులు వేసిన అక్తర్.. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ విశ్లేషకుడిగా, కామెంటేటర్ గా మారాడు. కెరీర్ కొనసాగిన కాలంలోనూ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి భారత ఆటగాళ్లతో స్నేహంగా మెలిగాడు అక్తర్. ఏమైనా విరోధం ఉంటే మైదానంలో ఆట పరంగా మాత్రమే. అంత ప్రొఫెషనల్ గా వ్యవహరించిన అతడు ఇప్పుడు టీమ్ఇండియా ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగానూ అంతే ప్రొఫెషనల్ గా స్పందించాడు.
విధానం..పద్ధతి..ప్రతిభ..
పొట్టి ఫార్మాట్ ప్రపంచ కప్ లో టీమ్ఇండియా పాలసీ (విధానం).. సిస్టమ్ (పద్ధతి).. మెరిట్ (ప్రతిభ) విజయం సాధించాయంటూ అక్తర్ విశ్లేషించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను ప్రతిభ ప్రకారం ఎంపిక చేశాడని కొనియాడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలను పక్కనపెట్టారని విమర్శలు వచ్చినా, జట్టు ప్రపంచ కప్ గెలిచిందని గుర్తుచేశాడు. అంతేకాదు.. దిగ్గజాలను భారత్ తగు విధంగా గౌరవించిందని.. ప్రపంచ కప్ లు గెలిచిన ముగ్గురు కెప్టెన్ల (కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ)ను ఫైనల్ కు ఆహ్వానించి విజయోత్సవాన్ని అందరూ ఆస్వాదించేలా చేసిందని పొగుడుతూ అక్తర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
