Begin typing your search above and press return to search.

ఆ 'డబుల్‌ సెంచరీ'తో నా ఖేల్‌ ఖతం.. టీమిండియాలో ప్లేస్‌పై ధావన్‌

కిషన్ (210) బంగ్లాపై 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. ఎడమ చేతివాటం బ్యాటర్‌ అయిన కిషన్‌.. ధావన్‌కు దారులు మూసేలా చేశాడు.

By:  Tupaki Desk   |   3 July 2025 3:00 AM IST
ఆ డబుల్‌ సెంచరీతో నా ఖేల్‌ ఖతం.. టీమిండియాలో ప్లేస్‌పై ధావన్‌
X

అడుతున్న తొలి టెస్టులోనే.. ఆస్ట్రేలియా వంటి టాప్‌ జట్టు బౌలర్లను ఎదుర్కొంటూనే త్రుటిలో డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌. 2010లోనే జట్టులోకి వచ్చినా 2013 వరకు అతడికి స్థిరమైన స్థానం దక్కలేదు. ఆ సమయంలో ఢిల్లీకే చెందిన సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఫామ్‌ లేమి, గాయంతో దూరంకావడంతో ధావన్‌కు పిలుపొచ్చింది. దీనిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్టులో ఆసీస్‌పై 187 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే అత్యంత వేగంగా (85 బంతుల్లో) సెంచరీ చేసిన బ్యాటర్‌ రికార్డు ధావన్‌ పేరిటే ఉంది.

అలాంటి ధావన్‌ 2023 సీజన్‌లో అనూహ్యంగా రిటైర్మెంట్‌ ఇచ్చాడు. దానికిముందు శ్రీలంక సిరీస్‌లో ధావన్‌ టీమిండియా కెప్టెన్‌ కావడం గమనార్హం. అయితే, రిటైర్మెంట్‌ ప్రకటించే సమయానికి ధావన్‌ గొప్ప ఫామ్‌లో లేడు. కానీ, ఓ సంఘటన తనను రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పాడు. అదేమంటే 2022 చివర్లో బంగ్లాదేశ్‌పై వన్డేలో యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ చేయడమే. కిషన్ (210) బంగ్లాపై 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. ఎడమ చేతివాటం బ్యాటర్‌ అయిన కిషన్‌.. ధావన్‌కు దారులు మూసేలా చేశాడు. ఇదే విషయాన్ని తన ఆత్మకథ ‘ది వన్‌’ ప్రకటన సందర్భంగా ధావన్‌ వెల్లడించాడు.

మన విశాఖ వన్డేతోనే...

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలోనే.. అదీ మన విశాఖపట్టణంలో 2010 అక్టోబరులో జరిగిన వన్డేతోనే ధావన్‌ అంతర్జాతీయ కెరీర్‌ మొదలైంది. టెస్టుల్లో 2013లో మొహాలీలో ఆసీస్‌పై తొలి మ్యాచ్‌ ఆడాడు. ఈ ఫార్మాట్‌లో ధావన్‌ ఏడు సెంచరీలు, 5 అర్థసెంచరీలు సాధించాడు. టెస్టుల్లో గ్రాండ్‌ ఎంట్రీతో సెహ్వాగ్‌ వారసుడిగా ధావన్‌ పేరు తెచ్చుకున్నాడు. కానీ, 34 టెస్టుల్లోనే ఆడగలిగాడు. వీటిలో 2,315 పరుగులు చేశాడు. వన్డేల్లో మాత్రం టీమ్‌ ఇండియా బెస్ట్‌ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. 167 వన్డేల్లో 6,793 పరుగులు చేసిన ధావన్‌..44పైగా సగటుతో మంచి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు. 17 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు చేశాడు. ఇక 69 టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 92. సన్‌ రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లకు ఐపీఎల్‌లో ఆడాడు. మొత్తం 222 మ్యాచుల్లో 6,769 పరుగులు సాధించాడు.

జట్టు నుంచి తొలగించినప్పుడు తనను ఎవరూ కాంటాక్ట్‌ చేయలేదని..చోటు కోల్పోవడం సహజమేనని, తాను ఆ సమయంలో దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను సంప్రదించానని.. ప్రతి ఒక్కరూ వారి శైలిలో ముందుకెళ్లాల్సి ఉంటుంది అని అతడి నుంచి సమాధానం వచ్చిందని అభిమానులు గబ్బర్‌ అని ముద్దుగా పిలుచుకునే ధావన్‌ తెలిపాడు. హాఫ్‌ సెంచరీలను సెంచరీలుగా మలచలేకపోయానని.. భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు సాధించాలని కలలుగన్న తాను 70ల్లో చాలాసార్లు ఔటయ్యానని తెలిపాడు. ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీతోనే తన అంతర్మాత నీ ఖేల్‌ ఖతం అని చెప్పిందని వివరించాడు.