Begin typing your search above and press return to search.

ముంబై వర్సెస్ ఢిల్లీ... హార్దిక్ కి ఉపశమనం ఇచ్చిన షెఫర్డ్ దంచుడు!

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ లో 32 పరుగులు రాబట్టింది ముంబై ఇండియన్స్. ఇందులో భాగంగా... రొమారియో షెఫెర్డ్‌ వీర బాదుడు బాదాడు.

By:  Tupaki Desk   |   8 April 2024 3:47 AM GMT
ముంబై వర్సెస్  ఢిల్లీ... హార్దిక్  కి ఉపశమనం ఇచ్చిన షెఫర్డ్  దంచుడు!
X

ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా... ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పరుగుల ప్రవాహం తెరపైకి వచ్చింది. రెండు టీం లూ రెండు వందల పరుగులకు పైగా చేశాయి. ఈ నేపథ్యంలో... ఇంత రసవత్తరమైన మ్యాచ్ ఆద్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!

బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై!:

ఢిల్లీ కెప్టెన్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్ కి దిగింది. ఇందులో భాగంగా... రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్ క్రీజ్ లోకి వచ్చారు. ఈ సమయంలో.. ఖలీల్ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్‌ లో ఏడు పరుగులు రాగా.. ఇషాంత్ వేసిన రెండో ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి. తర్వాత ఖలీల్‌ వేసిన 3వ ఓవర్‌ లో 12 పరుగులు రాగా.. జే రిచర్డ్‌ సన్ వేసిన నాలుగో ఓవర్‌ లో రోహిత్ శర్మ రెండు సిక్స్ లు బాదడంతో.. 13 పరుగులు వచ్చాయి.

అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్‌ లో రోహిత్ శర్మ సిక్స్, ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్ లోనూ 14 పరుగులు రాగా... లలిత్ యాదవ్ వేసిన ఆరో ఓవర్ లో 15 పరుగులు వచ్చాయి. దీంతో.. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్లెమీ నష్టపోకుండా 75.

ముంబై ఇండియన్స్ ఫస్ట్ వికెట్!:

అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి రోహిత్‌ శర్మ (49: 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ లు) ఔటయ్యాడు. దీంతో... తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యింది.

ముంబై కి మరో షాక్!:

చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యాడు. నోకియా బౌలింగ్‌ లో ఫ్రేజర్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ కు చేరాడు. దీంతో... 8 ఓవర్లు ముగిసేసరికి ముంబయి స్కోరు రెండు వికెట్ల నష్టానికి 84.

ముంబై మూడో వికెట్ డౌన్!:

అక్షర్ పటేల్ వేసిన 11 ఓవర్ రెండో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ఇషాన్ (42) ఔటయ్యాడు. దీంతో... 11 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు.

నాలుగో వికెట్‌ డౌన్!:

ముంబయి 121 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ ను నష్టపోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన పదమూడో ఓవర్ నాలుగో బంతికి తిలక్‌ వర్మ (6) ఔటయ్యాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 123.

ముంబై ఐదో వికెట్ పడింది అలా!:

హార్దిక్‌ పాండ్య, టిమ్‌ డేవిడ్‌ లు దూకుడుగా ఆడుతున్న సమయంలో... ముంబయి 181 పరుగుల వద్ద ఐదో వికెట్‌ ను కోల్పోయింది. ఈ సమయంలో 18 ఓవర్ చివరి బంతికి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (39) ఔటయ్యాడు. దీంతో.. 18 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 5 వికెట్ల నష్టానికి 183.

200 దాటిన ముంబయి స్కోరు!:

ఇషాంత్‌ వేసిన 19వ ఓవర్‌ లో 19 పరుగులు వచ్చాయి. దీంతో... 19 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 202.

చివరి ఓవర్లో షెఫెర్డ్‌ బాదుడు!:

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ లో 32 పరుగులు రాబట్టింది ముంబై ఇండియన్స్. ఇందులో భాగంగా... రొమారియో షెఫెర్డ్‌ వీర బాదుడు బాదాడు. వరుసగా.. 4, 6, 6, 6, 4, 6 తో ముంబయికి సంచలన ముగింపునిచ్చాడు. ఫలితంగా... నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 234కి చేరింది.

రొమారియో షెఫెర్డ్‌ (39*: 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ లు).. రోహిత్ శర్మ (49: 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ లు).. టిమ్‌ డేవిడ్‌ (45*: 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ లు).. ఇషాన్‌ కిషన్ (42: 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ లు).. హార్దిక్‌ పాండ్య (39: 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) అదరగొట్టారు.

లక్ష్యం 235.. ఢిల్లీ ఛేజింగ్ స్టార్ట్!:

ముంబయి నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌ క్రీజ్‌ లోకి వచ్చారు. ఈ సమయంలో కొయిట్జీ వేసిన తొలి ఓవర్‌ లో ఏడు పరుగులు వచ్చాయి. రెండో ఓవర్‌ వేసిన బుమ్రా నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆకాశ్‌ మధ్వాల్ వేసిన మూడో ఓవర్‌ లో 4 పరుగులు రావడంతో.. మూడు ఓవర్లు పూరయ్యే సరికి ఢిల్లీ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 15 పరుగులకు చేరింది.

ఢిల్లీ ఫస్ట్ వికెట్ డౌన్!:

రొమారియో షెఫర్డ్ వేసిన నాలుగో ఓవర్‌ నాలుగో బంతికి డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. దీంతో.. నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు ఒక వికెట్ నష్టానికి 24 పరుగులకు చేరింది.

పవర్ ప్లే ముగిసే సరికి పరిస్థితి ఇది!:

ఢిల్లీ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. రొమారియో షెఫర్డ్ వేసిన ఆరో ఓవర్‌ లో 13 పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు.

పృథ్వీ షా ఆఫ్ సెంచరీ!:

దూకుడుగా ఆడుతున్న పృథ్వీ షా 31 బంతులలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. గెరాల్డ్ కొయెట్జీ వేసిన తొమ్మిదో ఓవర్‌ వరుసగా రెండు ఫోర్లు బాది హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో 9 ఓవర్లు పూరయ్యే సరికి ఢిల్లీ స్కోరు ఒక వికెట్ నష్టానికి 84.

బుమ్రా సూపర్‌ యార్కర్‌... ఢిల్లీ సెకండ్ వికెట్ డౌన్!:

ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 12 ఓవర్ ఐదో బంతిని సూపర్‌ యార్కర్‌ గా విసరడంతో.. దూకుడుగా ఆడుతున్న పృథ్వీ షా (66; 40 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో 12 ఓవర్లు పూరయ్యే సరికి ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు.

ఢిల్లీ మూడో వికెట్ డౌన్!:

బుమ్రా వేసిన 15 ఓవర్‌లో చివరి బంతికి అభిషేక్ పొరెల్ (41; 31 బంతుల్లో) ఔటయ్యాడు. ఐపీఎల్‌ లో బుమ్రాకిది 150వ వికెట్. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్కోరు 3 వికెట్ల నష్టానికి 144 పరుగులకు చేరింది.

రిషభ్ పంత్‌ (1) ఔట్!:

గెరాల్డ్ కొయెట్జీ వేసిన 16 ఓవర్‌ లో చివరి బంతికి హార్దిక్‌ పాండ్యకు క్యాచ్ ఇచ్చిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లు పూరయ్యే సరికి ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 153.

19 బంతుల్లో హాఫ్ సెంచరీ!:

ఆకాశ్‌ మధ్వాల్ వేసిన 17 ఓవర్‌ లో తొలి బంతికి ట్రిస్టబ్స్‌ ఫోర్, తర్వాతికి బంతికి (నో బాల్) సిక్స్‌, ఫ్రీ హిట్‌ కు బౌండరీ బాదడంతో... 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు స్టబ్స్.

దీంతో 17 ఓవర్లు పూరయ్యే సరికి ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 172.

12 బంతుల్లో 55 పరుగులు!

ఈ సమయంలో చివరి రెండు ఓవర్లలోనూ ఢిల్లీ విజయానికి 55 పరుగ్లు అవసరం కాగా... బుమ్రా వేసిన 18 ఓవర్‌ లో ఎనిమిది పరుగులు వచ్చాయి. రొమారియో షెఫర్డ్ వేసిన 19 ఓవర్‌ లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు స్టబ్స్. ఇదే ఓవర్ లో నాలుగో బంతికి అక్షర్ పటేల్ (8) రెండో రన్‌ కోసం పరుగెత్తి రనౌటయ్యాడు. దీంతో... 19 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు.

బోణీ కొట్టిన ముంబయి!:

ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ.. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో... ఐపీఎల్ 17 సీజన్‌ లో ముంబయి ఎట్టకేలకు బోణీ కొట్టింది. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్‌ స్టబ్స్ (71: 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌ లు) వీర ఉతుకుడు ఉతికినా ఫలితం దక్కలేదు! ముంబయి బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ నాలుగు, జస్‌ ప్రీత్ బుమ్రా 2, రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ పడగొట్టారు.