Begin typing your search above and press return to search.

మ్యాచ్‌ మధ్యలో పంజాబ్ కెప్టెన్ మార్పు.. అయ్యర్ స్థానంలో ఈ ఆటగాడికి పగ్గాలు

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు మ్యాచ్‌కు ఒకరోజు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో చూపుడు వేలికి తీవ్ర గాయమైంది.

By:  Tupaki Desk   |   19 May 2025 9:30 AM IST
మ్యాచ్‌ మధ్యలో పంజాబ్ కెప్టెన్ మార్పు.. అయ్యర్ స్థానంలో ఈ ఆటగాడికి పగ్గాలు
X

ఐపీఎల్ 2025 సీజన్‌లో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు మధ్యలో కెప్టెన్‌ను మార్చవలసి వచ్చింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఒక ఇంటర్నేషనల్ ఎక్స్ పీరియన్స్ లేని ఆటగాడికి పంజాబ్ కింగ్స్ పగ్గాలు అప్పగించారు. అంతేకాదు, ఆ ఆటగాడు కీలకమైన ఇన్నింగ్స్ కూడా ఆడటంతో పంజాబ్ జట్టు మొదటి బ్యాటింగ్‌లో 200+ పరుగులు చేయగలిగింది.

మధ్య మ్యాచ్‌లో మారిన పంజాబ్ కెప్టెన్

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు మ్యాచ్‌కు ఒకరోజు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో చూపుడు వేలికి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ, అతను రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.బ్యాటింగ్ కూడా చేశాడు. కానీ పంజాబ్ ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ స్థానంలో హర్‌ప్రీత్ బ్రార్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి దించారు. అంటే శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో అంతర్జాతీయ అనుభవం లేని ఆటగాడు శశాంక్ సింగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

శ్రేయాస్ అయ్యర్ టాస్ కోసం మైదానంలోకి దిగినప్పుడు అతని వేలికి పెద్ద కట్టు కట్టి ఉంది. ఆ తర్వాత అతను బ్యాటింగ్‌కు కూడా 5వ స్థానంలో దిగాడు. అతను 25 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అయ్యర్ ఈ పరుగులు 120 స్ట్రైక్ రేట్‌తో చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు శశాంక్ సింగ్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 30 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతను 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. శశాంక్ సింగ్ స్ట్రైక్ రేట్ కూడా 196.66గా ఉంది.

శశాంక్ సింగ్‌కు అద్భుతమైన సీజన్

శశాంక్ సింగ్ ఈ సీజన్‌లో జట్టు కోసం చాలా పరుగులు చేశాడు. అతను 12 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌ల్లో 273 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అతను ఈ పరుగులు 68.25 సగటుతో చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 151.66గా ఉంది. అతను ఐపీఎల్ 2024 నుంచి ఆరో స్థానంలో లేదా అంతకంటే దిగువన ఆడుతూ అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా. అతను 3 హాఫ్ సెంచరీలు చేశాడు.