Begin typing your search above and press return to search.

మార్మోగుతున్న 'షమార్'.. సెక్యూరిటీ గార్డు నుంచి సూపర్ పేసర్

వెస్టిండీస్ –ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్.. అదికూడా ఆస్ట్రేలియాలో.. అప్పటికే పాకిస్థాన్ ను 3-0తో చిత్తు చేసింది ఆస్ట్రేలియా.

By:  Tupaki Desk   |   30 Jan 2024 12:30 PM GMT
మార్మోగుతున్న షమార్.. సెక్యూరిటీ గార్డు నుంచి సూపర్ పేసర్
X

నిలకడగా గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగం.. చక్కటి లైన్ అండ్ లెంగ్త్.. కళ్లుచెదిరేలా యార్కర్ వేయగల సామర్థ్యం.. మొత్తమ్మీద అతడు బంతి పట్టుకుని వస్తుంటే ఓ పక్షి ఎగురుతూ వస్తున్నట్లే ఉంటుంది.. ఆడింది రెండు టెస్టులే..కానీ అతడి పేరు ఇప్పుడు ప్రపంచం అంతా మార్మోగుతోంది. ఎవరీ కుర్రాడు..? అని తెగ వెదుకుతోంది. సెక్యూరిటీ గార్డు నుంచి కొన్నేళ్లలోనే సూపర్ క్రికెటర్ గా అవతరించిన అతడి కథలో అనేక మలుపులు..

వెస్టిండీస్ –ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్.. అదికూడా ఆస్ట్రేలియాలో.. అప్పటికే పాకిస్థాన్ ను 3-0తో చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఇలాంటి సమయంలో వెస్టిండీస్ వెళ్లింది. మొత్తం 15 మంది జట్టు సభ్యుల్లో ఏడుగురు కొత్తవారే. దీంతో ఆస్ట్రేలియా చేతిలో వెస్టిండీస్ కు ఘోర పరాభవం తప్పదని అనుకున్నారు. దీనికితగ్గట్లే తొలి టెస్టులో వెస్టిండీస్ చిత్తుగా ఓడింది. ఇక రెండో టెస్టు గులాబీ బంతితో. ఇంకేం కరీబియన్ల కథ రెండు రోజుల్లోనే ముగుస్తుంది అనుకున్నారు. అయితే, అంతా తిరగబడింది. ఈ కథలో హీరో ఒక్కడే.. అతడే షమార్ జోసెఫ్.

27 ఏళ్ల తర్వాత 24 ఏళ్ల పేసర్ చేతిలో..

వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కాదు కదా..? టెస్టు మ్యాచ్ గెలిచి 27 ఏళ్లయింది. అప్పటికి షమార్ జోసెఫ్ పుట్టలేదు. ఇప్పుడు 24 ఏళ్ల షమార్.. కంగారూ గడ్డపై తమ జట్టుకు 27 ఏళ్ల తర్వాత విజయాన్ని అందించాడు. ఈ నెల 28న ముగిసిన పింక్ బాల్ టెస్టులో ఆసీస్ పూర్తిగా షమార్ చేతిలో ఓడిపోయిందనే చెప్పాలి. అందుకనే అతడి పేరు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతోంది.

కాలి వేలు విరిగినా..

కుడిచేతివాటం పేసర్ అయిన షమార్.. ఎడమచేతివాటం బ్యాట్స్ మన్. బ్యాటింగ్ చేస్తుండగా ఆసీస్ స్టార్ స్టార్క్ వేసిన బంతి కాలికి బలంగా తాకింది. బొటన వేలుకు గాయమైంది. ఓ పేసర్ కు అత్యంత ముఖ్యమైనది కాలు. అలాంటి భాగానికే దెబ్బతగలడంతో విలవిల్లాడాడు షమార్. మైదానాన్ని వీడాడు. తర్వాతి రోజు చూస్తే.. జట్టు కాస్త బాగా ఆడి ప్రత్యర్థికి మంచి టార్గెట్ (216 పరుగులు) నిర్దేశించింది. దీంతో షమార్ పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని మైదానంలోకి దిగాడు. ఏకబిగిన 11.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో షమార్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలే ప్రశంసలు. అతడి పోరాటాన్ని చూసి అందరూ ఔరా అంటున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా అయితే.. టెస్టు క్రికెట్‌ను కాపాడే రక్షకుల్లో ఒకడని షమార్ ను కీర్తించాడు.

గయానాలో మారుమూల దీవుల నుంచి..

గయానా దీవుల్లోని ఓ మారుమూల పల్లెటూరులో పేద ఇంట పుట్టాడు షమార్. వీరిది ఎంత పల్లెటూరు అంటే.. ప్రపంచమంతా సోషల్ మీడియాలో మునిగిన ఈ కాలంలోనూ 2018 వరకు వారి ఊరిలో ఫోన్, ఇంటర్నెట్‌ లేవు. దగ్గర్లోని పట్టణానికి పడవల్లోనే వెళ్లాలి. 24 ఏళ్ల షమార్ యుక్త వయసులో మొద్దులు నరికే పనికివెళ్లాడు. చిన్న వయసులోనే పెళ్లవడంతో.. కుటుంబాన్ని పోషించడానికి టౌన్ కు వెళ్లి నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా చేరాడు. సెక్యూరిటీ గార్డుగానూ పని చేశాడు. రెండేళ్ల ముందు వరకు అంటే.. 2022లోనూ అతడు సెక్యూరిటీ గార్డే. అయితే, చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న క్రికెట్ ను మాత్రం వదల్లేదు. కరీబియన్లకు సహజంగా వచ్చే జీన్స్.. వేగం తోడవడంతో పేస్ బౌలింగ్ లో నైపుణ్యం సంపాదించాడు. వెస్టిండీస్‌ కు ఆడిన మరో పేసర్ రొమారియో షెఫర్డ్‌ పరిచయడం షమార్ జీవితాన్ని మార్చింది. దీంతో గయానా జట్టు కోచ్‌ దృష్టిలో పడ్డాడు. సెక్యూరిటీ గార్డుగా ఉన్నప్పుడే సెలక్షన్ ట్రయల్స్ కు వెళ్లాడు. డివిజన్‌-1 క్రికెట్లో తొలి మ్యాచ్‌ లోనే 6 వికెట్లు తీశాడు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ లో నెట్‌ బౌలర్‌ అయ్యాడు. విండీస్ దిగ్గజ పేసర్ కర్ట్ లీ ఆంబ్రోస్‌ కంట పడ్డాడు. అప్పడు ఆంబ్రోస్ చెప్పిన మాట ఒక్కటే.

‘‘ఇంకో ఏడాదిలో నిన్ను గయానా జట్టులో చూడాలనుకుంటున్నా’’ అని. ఆ గడువులోపే షమార్‌.. నిరుడు ఫిబ్రవరిలో గయానా తరఫున ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు. కరీబియన్‌ లీగ్‌ లో నిలకడగా రాణించాడు. ఆస్ట్రేలియా టూర్ కు వెస్టిండీస్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే ఐదు వికెట్లు తీసి తానేంటో నిరూపించాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు.