Begin typing your search above and press return to search.

పాక్ ను ఓడించిన అమెరికన్ ఇండియన్.. ఎవరీ సౌరభ్ నేత్రవల్కర్

కాగా, గురువారం మ్యాచ్ లో నేత్రావల్కర్‌ పాక్‌ పై నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. తొలి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 9:38 AM GMT
పాక్ ను ఓడించిన అమెరికన్ ఇండియన్.. ఎవరీ సౌరభ్ నేత్రవల్కర్
X

''ప్రపంచ కప్ లో పెను సంచలనం..'' ఈ మాట ప్రతి ప్రపంచ కప్ సందర్భంగా వినేదే.. కానీ, అసలైన పెను సంచలనం అంటే ఏమిటో గురువారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) తెలిసింది. తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న ఒక జట్టు.. మాజీ చాంపియన్ ను.. అందులోనూ 145 కిలోమీటర్లపైగా వేగంతో బంతులేసే పేసర్లున్న జట్టును ఓడించడం పెను సంచలనం కాక మరేమిటి? అయితే ఇందులో భారతీయుడి ప్రధాన పాత్ర ఉండడమే ఇంకా విశేషం.

అప్పట్లో.. పాక్ పైన ఇప్పుడు టీమిండియా సభ్యుడైన కేఎల్ రాహుల్ తదితరులతో కలిసి అండర్ 19 ప్రపంచ కప్ ఆడాడు సౌరభ్‌ నేత్రావల్కర్‌. 2010లో జరిగిన ఆ కప్ లో వీరిద్దరికీ తోడు జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, సందీప్ శర్మ తదితరులు సభ్యులు. రాహుల్ కెప్టెన్. అయితే, ఈ జట్టు ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఇక సౌరభ్ నరేశ్‌ నేత్రావల్కర్‌ 1991 అక్టోబరు 16న ముంబైలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి. 2010 టి20 ప్రపంచ కప్ అనంతరం ముంబై రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడినుంచి ముందుకెళ్లలేక పోయాడు. తీవ్రమైన పోటీ కారణంగా టీమిండియాకు ఎంపిక కాలేకపోయాడు.

ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన సౌరభ్ నేత్ర వాల్కర్.. క్రికెట్ కెరీర్ ముందుకు సాగని నేపథ్యంలో మళ్లీ చదువుపై దృష్టిసారించాడు. 2103లో 23 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి.. 2014లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ పీజీ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాడు. అయితే, క్రికెట్ పై ఉన్న అంతులేని ఇష్టం అతడిని ఉద్యోగం చేసుకోనివ్వలేదు. అమెరికాలో ఆడుతూ పోయిన అతడు.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. యూఏఈ పై తొలి మ్యాచ్‌ ఆడాడు. అమెరికా జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. మొత్తం 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

టీ20ల్లో అంతర్జాతీయ స్థాయి పాకిస్థాన్‌తో అమెరికా తలపడటం ఇదే తొలిసారి. నేత్రావల్కర్‌ మాత్రం 2010 అండర్‌-19 ప్రపంచకప్‌ లోనే పాకిస్థాన్ పై ఆడాడు. అప్పట్లో 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. కాగా, గురువారం మ్యాచ్ లో నేత్రావల్కర్‌ పాక్‌ పై నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. తొలి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చాడు. అందుకే అతడినే సూపర్ ఓవర్ వేయించారు. కాస్త తడబడినా.. తెలివిగానే బౌలింగ్ చేసి అమెరికాకు అద్భుత విజయం అందించాడు. కాగా.. ఓ దశలో ఏమీ తోచక.. బ్యాగ్ సర్దుకుని అమెరికా వచ్చేశానని.. మళ్లీ క్రికెట్‌ ఆడతానని కలలో కూడా ఊహించలేదని నేత్రవాల్కర్ చెప్పారు. కనీసం షూ కూడా తెచ్చుకోలేదని తెలిపాడు.

నేత్రవాల్కర్ ప్రస్తుతం అమెరికా హీరో. అసలు అమెరికా జట్టు కెప్టెన్ మన గుజరాత్ మూలాలున్న వికెట్ కీపర్ మోనాక్ పటేల్. ఈ జట్టులో ఆరుగురు భారతీయ సంతతి వారే. కాగా, మోనాక్ పటేల్ ప్రస్తుతం ఒరాకిల్‌ లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.జ