95-17= 78 కిలోలు... 2 నెలల్లోనే సూపర్ 'స్లిమ్' సర్ఫరాజ్
27 ఏళ్ల సర్ఫరాజ్ నిరుడు ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు.
By: Tupaki Desk | 22 July 2025 5:00 AM ISTనిరుడు సొంతగడ్డపై న్యూజిలాండ్ మీద 150 పరుగుల భారీ సెంచరీ చేసినా.. ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆడే అవకాశం దక్కలేదు మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కు. ఆ తర్వాత ఏకంగా ఇంగ్లండ్ టూర్ లో చోటే లభించలేదు. ఇండియా ఏ జట్టు తరఫున ఇంగ్లండ్ వెళ్లినా.. సర్ఫరాజ్ ను జాతీయ జట్టు నుంచి తప్పించారు. అయితే, అతడి ఆట కంటే శరీర బరువు కారణంగా టెస్టు జట్టులో కొనసాగించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. వాస్తవానికి సర్ఫరాజ్ శరీర తత్వమే అంత. పైనుంచి కింది వరకు ఒకే తరహా శరీర నిర్మాణం అతడిది.
కానీ, బరువుపై ఎక్కువ విమర్శలు రావడంతో అతడికి మరో అవకాశం ఇవ్వలేదు. ఈలోగా యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్, మిడిలార్డర్ లో అనుభవం ఉన్న కరుణ్ నాయర్ భారీగా స్కోర్లు సాధించడంతో సర్ఫరాజ్ కు దారులు మూసుకుపోయాయి.
కానీ, తనకు దొరికిన ఈ టైమ్ ను అతడు బరువు తగ్గడంపై పెట్టాడు. దాదాపు మే నెల చివర్లో ఇండియా ఏ జట్టు తరఫున ఇంగ్లండ్ వెళ్లాడు సర్ఫరాజ్. అంటే రెండు నెలలు కిందట. కానీ, అప్పుడు 95 కిలోలు ఉన్న అతడు ఇప్పుడు 78 కిలోలకు తగ్గాడు. ఈ మేరకు స్లిమ్ గా మారిన ఫొటోలను సర్ఫరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తిరిగి టీమ్ ఇండియాలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న అతడు.. శక్తిమేర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందులో భాగంగా ఉడకబెట్టిన కూరగాయలు, చికెన్ తీసుకుంటూ బరువు తగ్గాడు.
దాంతో నెలకు 8 కిలోల చొప్పున రెండు నెలల్లోనే 17 కిలోల బరువు తగ్గాడు. దానికి సంబధించిన ఫొటోలను సర్ఫరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనికి వావ్.. ఇంత సన్నగా ఎలా అయ్యావ్? అద్భుతం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
27 ఏళ్ల సర్ఫరాజ్ నిరుడు ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు. ఆరు టెస్టుల్లో ఒక సెంచరీ సహా 371 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక కాలేదు. ఏమో..? పంత్ గాయం కారణంగా, మిగతా రెండు టెస్టులకు మిడిలార్డర్ లో ఓ బ్యాకప్ బ్యాటర్ అవసరం అనుకుంటే పిలుపు రావొచ్చేమో?
