మళ్లీ ‘రచ్చ’గొట్టుడు.. మహిళల ప్రపంచ కప్ లో ఆజాద్ కశ్మీర్
పాకిస్థాన్ ప్రభుత్వాలే కాదు.. వాళ్ల ఆటగాళ్ల బుద్ధి కూడా ఎప్పటికీ మారదు..! మొన్నటి ఆసియా కప్ ఆసాంతం పురుషుల జట్టు ప్రవర్తించిన తీరును అందరూ చూశారు
By: Tupaki Desk | 3 Oct 2025 1:01 PM ISTపాకిస్థాన్ ప్రభుత్వాలే కాదు.. వాళ్ల ఆటగాళ్ల బుద్ధి కూడా ఎప్పటికీ మారదు..! మొన్నటి ఆసియా కప్ ఆసాంతం పురుషుల జట్టు ప్రవర్తించిన తీరును అందరూ చూశారు. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ లు కూడా ఇవ్వకుండానే మూడు మ్యాచ్ లు ఆడి మూడింట్లోనూ వారిని ఓడించింది టీమ్ ఇండియా. దీంతో పిచ్చెక్కిపోయిన పాక్ ఆటగాళ్లు.. మ్యాచ్ రిఫరీ ఆండీ పై క్రాఫ్ట్ ను తొలగించాలని, మ్యాచ్ లో అభ్యంతరకర రీతిలో ప్రవర్తిస్తూ అతి చేశారు. చివరకు టీమ్ ఇండియా ఆసియా కప్ గెలిచాక.. పాకిస్థాన్ కు చెందిన మొహిసిన్ నఖ్వీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్) చేతుల మీదగా ట్రోఫీ తీసుకోవడానికి టీమ్ ఇండియా నిరాకరించింది. ఇంతవరకు కప్ మన దేశానికి చేరలేదు. ఈ వివాదం కొనసాగతుండగానే పాక్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ మరో వివాదం రేపింది.
సనా మిర్ పొలిటికల్ కామెంట్రీ..
భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్ జరుగుతోంది. కానీ, పాక్ జట్టుకు భారత్ వచ్చేందుకు చాన్స ్లేదు. అందుకే ఆ జట్టు బంగ్లాదేశ్ తో లంక రాజధాని కొలంబోలో ఆడింది. ఈ మ్యాచ్ కు పాక్ మాజీ కెప్టెన్ సనా మిర్ కామెంటేటర్ గా చేసింది. పాక్ జట్టులో నటాలియా పర్వేజ్ అనే క్రీడాకారిణిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయం అయ్యాయి. నటాలియా ఆజాద్ కశ్మీర్ క్రీడాకారిణి. అక్కడినుంచి లాహోర్ కు వచ్చి క్రికెట్ లో ఎదిగింది.. అని సనా మిర్ వ్యాఖ్యానించింది.
స్వాతంత్ర్యం వచ్చాక పాక్.. కశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించింది. దానిని మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అని పిలుస్తుంటాం. పాక్ మాత్రం ఆజాదీ కశ్మీర్ అంటుంది. 29 ఏళ్ల నటాలియా పర్వేజ్ స్వస్థలం పీవోకేలోని భీంబర్ జిల్లా. పీవోకేను సనా మిర్ ఆజాదీ కశ్మీర్ అనడంతో భారత నెటిజన్లు చెలరేగారు. ఆజాద్ కశ్మీర్ అనే మాటలు మాట్లాడే సనా మిర్ లాంటి వాళ్లా? రాజకీయాలు, క్రీడలను దూరంగా ఉంచాలని నీతులు చెప్పేది? అంటూ మండిపడ్డారు.
పొరపాటే.. కానీ, నో సారీ
సనా మిర్.. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో పొరపాటు జరిగిందని గ్రహించింది. కానీ, క్షమాపణ మాత్రం చెప్పలేదు. అయితే, ఆదివారం భారత మహిళల జట్టు పాకిస్థాన్ తో కొలంబోలోనే ప్రపంచ కప్ ఆడనుంది. దీనికి ముందు రెచ్చగొట్టి రచ్చ లేపేందుకే ఇలా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
