గంభీర్-కోహ్లి.. ఇద్దరు ఢిల్లీ వాసులు.. ఢీ అంటే ఢీ.. నిజమెంత?
సాధారణంగా భారత క్రికెట్ లో ఢిల్లీ ఆటగాళ్లకు కాస్త భిన్నమైన పేరు ఉంటుంది. వారు చాలా దూకుడుగా ఉంటారని అంటూ ఉంటారు.
By: Tupaki Entertainment Desk | 9 Feb 2026 11:00 PM ISTసాధారణంగా భారత క్రికెట్ లో ఢిల్లీ ఆటగాళ్లకు కాస్త భిన్నమైన పేరు ఉంటుంది. వారు చాలా దూకుడుగా ఉంటారని అంటూ ఉంటారు. ఇది ఆటలో అయినా, స్వభావంలో అయినా..! వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలను చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. మరి.. ఇద్దరు ఢిల్లీ వాసుల మధ్య నిప్పు రాజుకుంటే? ఇందులో నిజం ఎంతనో కానీ.. ఆ నిప్పుపై ఉప్పు వేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మధ్య విభేదాలు ఇదే కోవలో ఆ మధ్య బాగా ఫ్లేరప్ అయ్యాయి. పైగా.. గతంలో గంభీర్-కోహ్లిలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా మైదానంలోనే జరిగిన ఘర్షణ దీనికి నిదర్శనంగా చూపారు. ఇక గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక.. ఏడాదిలోపే కోహ్లి తనకు ఎంతో ఇష్టమైన టెస్టు ఫార్మాట్ నుంచి గుడ్ బై చెప్పాడు. అదికూడా ఎంతో కీలకమైన ఇంగ్లండ్ టూర్ కు ముందు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా ఏమంటున్నారు? అసలు ఆయన వాటిని ఎలా చూశారు..? అనే ప్రశ్నలకు ఓ పాడ్ కాస్ట్ లో సమాధానం ఇచ్చారు.
నిప్పులో ఉప్పు
2024లో టి20 ప్రపంచ కప్ గెలిచాక కోహ్లి ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. వన్డేల్లో, టెస్టుల్లో మరికొంత కాలం ఆడతాడని భావిస్తే.. 2025 వేసవిలో టెస్టులకు బైబై పలికాడు. దీనికి ముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో విఫలమయ్యాడు. ఇదే సమయంలో ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక కష్టం అని కూడా కథనాలు వచ్చాయి. దీంతో కోహ్లి టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. దీనికి కారణం.. గంభీర్ అనే అభిప్రాయం వచ్చింది. దేవజిత్ సైకియా మాత్రం అదేమీ లేదని.. ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నాడు. మైదానంలో, బయట ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారని చెప్పాడు.
అలాంటివాటిని నమ్మొద్దు..
గంభీర్-కోహ్లి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను నమ్మొద్దని సైకియా సూచిస్తున్నాడు. అసలు వారిద్దరూ కనీసం వాదించుకున్న సందర్భం కూడా తాను చూడలేదని తెలిపాడు. ఐపీఎల్ లో జరిగిన దానిని.. దేశం కోసం ఆడే సమయంలో చూడొద్దని పేర్కొన్నాడు.
-మరోవైపు కోహ్లి-గంభీర్ విభేదాలకు అంతర్జాతీయ టోర్నీలు లేని సమయంలో రంజీలు ఆడాలనే నిబంధన కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చారు. గంభీర్ ప్రమేయంతోనే ఈ నిబంధన పెట్టారనే వాదన వినిపించింది. కానీ, దీనిని కోహ్లి పాటించాడు. రంజీలు, విజయ్ హజారే ట్రోఫీలు ఆడాడు. అంతా సమసిపోయింది అనుకుంటుండగా.. కోహ్లి టెస్టులకు రిటైర్ కావడం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నేరుగా బీసీసీఐ కార్యదర్శే కల్పించుకుని చెప్పడంతో అంతా ప్రశాంతం అని తేలిపోయింది.
