Begin typing your search above and press return to search.

హద్దు మీరిన 'ఫుట్ బాల్ ముద్దు'.. దేశప్రధాని ఆగ్రహం!

స్టార్‌ ప్లేయర్ జెన్నిఫర్ హెర్మోసో పెదవులను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:04 AM GMT
హద్దు మీరిన ఫుట్ బాల్ ముద్దు.. దేశప్రధాని ఆగ్రహం!
X

యూరప్ ఫుట్ బాల్ లో స్పెయిన్ ప్రత్యేకతే వేరు.. ఆ జట్టు ప్రపంచ కప్ ను ఒక్కసారే గెలిచి ఉండొచ్చు.. కానీ, దాదాపు వందేళ్ల క్రితమే ఆ దేశంలో లా లీగా క్లబ్ పుట్టింది.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఫుట్ బాల్ లీగ్ ఇది. అత్యున్నత జట్లు పోటీ పడే ఈ లీగ్ కు ఉండే ఆదరణే వేరు. ఇక లా లీగా అంటే గుర్తొచ్చే పేరు "రియల్ మాడ్రిడ్". స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ పేరిట ఏర్పడిన ఈ క్లబ్ లా లీగా టైటిల్ ను రికార్డు స్థాయిలో 35 సార్లు గెలిచింది. ఇదంతా పక్కనపెట్టి అసలు విషయానికి వద్దాం.

మహిళల కొప్పులో ప్రపంచ కప్పు

ఇటీవల ఫిఫా మహిళల ప్రపంచ కప్‌- 2023 జరిగింది. దీనిలో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీ ఫైనల్ సిడ్నీలో జరిగింది. 1-0 తేడాతో ఇంగ్లండ్ ను స్పెయిన్ ఓడించింది. ఫిఫా మహిళ ప్రపంచ కప్ టైటిల్‌ ను స్పెయిన్ నెగ్గడం ఇదే తొలిసారి. అంటే.. వారి పురుషుల జట్టు 2010లో తొలిసారి ప్రపంచ కప్ నెగ్గినట్లే మహిళల జట్టు 2023లో మొదటిసారి విజేతగా ఆవిర్భవించింది. ఇది ఎంతైనా ప్రత్యేక సందర్భమే. 1991లో మహిళల ప్రపంచ కప్ మొదలైతే ఇప్పటివరకు అమెరికా రికార్డు స్థాయిలో నాలుగు సార్లు, జర్మనీ రెండుసార్లు, జపాన్, నార్వే ఓసారి విజేతగా నిలిచాయి.

13 ఏళ్ల తర్వాత చాంపియన్ గా..

2010 ఫిఫా పురుషుల ప్రపంచ కప్ తర్వాత స్పెయిన్ మరెన్నడూ విజేతగా నిలవలేదు. అందులోనూ తొలిసారిగా మహిళల కప్ నెగ్గింది. ఈ సందర్భంగా సంబరాల్లో భాగంగా స్పెయిన్ ఫుట్‌ బాల్‌ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ప్రవర్తించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది. ఎంతగా అంటే.. పాశ్చాత్య కల్చర్ లో ఓ స్థాయి వరకు హద్దు మీరినా సహిస్తారు. దానిని కూడా దాటి ఫెడరేషన్ చీఫ్ వ్యవహరించాడు. ఇంతకూ అతడు ఏం చేశాడంటే.. ప్రపంచ కప్ గెలిచిన క్రీడాకారుణులకు ముద్దులు పెట్టాడు. రుబియాలెస్ క్షమాపణలు చెప్పినా.. ఆరోపణలు ఆగడం లేదు. ఏకంగా స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ కల్పించుకున్నారు. రుబియాలెస్ క్షమాపణ ఏమాత్రం సరిపోదన్నారు.

చెంపలు.. పెదాలను ముద్దాడుతూ..

మెడల్స్ ప్రదానం సందర్భంగా రుబియాలెస్.. అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారు. స్టార్‌ ప్లేయర్ జెన్నిఫర్ హెర్మోసో పెదవులను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. పాశ్చాత్య కల్చర్ కు పేరుగాంచిన స్పెయిన్ లోనే వీటిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. విషయం ప్రధాని పెడ్రో వరకు వెళ్లింది. దీంతో 'రుబియాలెస్ చెప్పిన క్షమాపణలు సరిపోవు. ఆ అభ్యంతరకర ప్రవర్తనపై మరింత స్పష్టత ఇవ్వాలి' అని స్పష్టం చేశారు. కాగా, ఫుట్ బాల్ ఫెడరేషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. అధ్యక్షుడిని నియమించే, తొలగించే అధికారం స్పెయిన్ ప్రభుత్వానికి ఉండదు.

రుబియాలెస్ లెంపకాయలు..

తన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు రావడంతో రుబియాలెస్ ఇప్పటికే సారీ చెప్పారు. "ఏది ఏమైనా చేసింది తప్ప. అత్యంత సంతోషకర సందర్భంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా అలా చేశా" అని చెప్పుకొచ్చారు. కాగా, రుబియాలెస్ రాజీనామాకు డిమాండ్లు వెల్లువలా వస్తున్నాయి. వీటి తాకిడితో శుక్రవారం స్పెయిన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది.