స్టార్ క్రికెటర్ రీఎంట్రీ.. తెలుగోడే కీలకం.. ఏ దేశం తరఫున అంటే?
112 టెస్టుల్లో 7,683 పరుగులు.. 236 వన్డేల్లో 8,607 పరుగులు... 102 టి20ల్లో 1,909 పరుగులు... ఒక మంచి మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కు ఉండాల్సిన గణాంకాలు ఇవి
By: Tupaki Desk | 5 Sept 2025 3:13 PM IST112 టెస్టుల్లో 7,683 పరుగులు.. 236 వన్డేల్లో 8,607 పరుగులు... 102 టి20ల్లో 1,909 పరుగులు... ఒక మంచి మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కు ఉండాల్సిన గణాంకాలు ఇవి. దీన్నిబట్టే అతడు ప్రపంచ స్థాయి ఆటగాడని చెప్పొచ్చు..! సొంత దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో రాణించిన అతడు గొప్ప బ్యాట్స్ మన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వంటి ప్రముఖ జట్ల తరఫున ఆడాడు. మూడున్నరేళ్ల కిందట రిటైరైన అతడు ఇప్పుడు తెలుగు క్రికెటర్ కారణంగా రీఎంట్రీ ఇస్తున్నాడు.
మిడిలార్డర్ వెన్నెముక
న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ మంచి మిడిలార్డర్ బ్యాట్స్ మన్. కెప్టెన్ గానూ వ్యవహరించాడు. మరో క్లాస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తో కలిసి ఎన్నో విజయాలు అందించాడు. 2021 డిసెంబరులో రిటైరైన అతడు ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. న్యూజిలాండ్ మేటి క్రికెటర్లలో ఒకడైన అతడు 2021 టెస్టు చాంపియన్ షిప్ గెలిచిన జట్టు సభ్యుడు. ఇతడి తల్లి సమోవా సంతతికి చెందినవారు. ఈ వారసత్వం కారణంగా సమోవా దేశం నుంచి ఆడేందుకు రాస్ టేలర్ అర్హత సాధించాడు. అంటే, సమోవా నుంచి తొలి అంతర్జాతీయ క్రికెటర్ కానున్నాడు.
సమోవా పాస్ పోర్టుతో
41 ఏళ్ల రాస్ టేలర్ కు సమోవా పాస్ పోర్టు కూడా ఉంది. అతడి తల్లి మూలాలు ఈ దేశంలోనే ఉన్నాయి. కాగా, ఒక దేశానికి ఆడి మరో దేశానికి మారేందుకు మూడేళ్ల గ్యాప్ (స్టాండ్ఔట్) వ్యవధి ఉండాలి. ఇది పూర్తికావడంతో రాస్ టేలర్ కు సమోవా తరఫున ఆడేందుకు అవకాశం లభించింది. తాను ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నట్లు రాస్ టేలర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆటపై ఇష్టమే నా పునరాగమనానికి పునాది. నా వారసత్వం (సమోవా రూట్స్) తరఫున ఆడబోతుండడం గౌరవంగా భావిస్తున్నా.. అని రాస్ టేలర్ ప్రకటించాడు.
ఇటలీతో పాటు సమోవా...?
పసిఫిక్ మహా సముద్రంలో ఉండే ద్వీప దేశం సమోవా. అటు న్యూజిలాండ్, ఇటు ఆస్ట్రేలియా దేశాలకు దగ్గర.
వచ్చే ఏడాది భారత్ లో టి20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికి ఇప్పటికే యూరప్ నుంచి తొలిసారి ఇటలీ జట్టు అర్హత సాధించింది. సమోవా కూడా క్వాలిఫై అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఆసియా-ఈస్ట్ఆసియా-పసిఫిక్ రీజియన్ లో క్వాలిఫయర్ లో మంచి ఫలితాలు సాధిస్తే అవకాశం ఉంటుంది. ఒమన్ లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.
తెలుగోడిదే కీలకపాత్ర
సమోవా జట్టుకు కోచ్ గా ఉన్నాడు తెలుగు క్రికెటర్ సాయిరాం నేతుల. హైదరాబాద్ లో పుట్టిన ఇతడు రంజీలు ఆడాడు. 2012లో న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు. సమోవా జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాను న్యూజిలాండ్ కు ఆడుతున్నప్పుడే కోచ్ గా సమోవాకు సాయం చేయాలని భావించానని, కానీ, ఆటగాడిగా భాగం అవుతానని ఊహించలేదని రాస్ టేలర్ తెలిపాడు.
