ఒక్క బంతికే 22 రన్స్.. విచిత్రం.. అయినా ఆ జట్టు ఓడింది
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హవా నడుస్తోంది.
By: Tupaki Desk | 27 Aug 2025 11:47 PM ISTఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హవా నడుస్తోంది. 17 ఏళ్లలో 18వ సీజన్ లో ఆ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. కొత్త కెప్టెన్, కొత్త కూర్పుతో ఒక పరిపూర్ణ జట్టుగా కనిపిచింది. దీనికి నిదర్శనం.. లోయరార్డర్ లో ఫినిషర్ లు ఉండడం. అలాంటి ఒక ఫినిషర్ ఇప్పుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో చెలరేగుతున్నాడు.
అతడు ఆర్సీబీకి బలం...
భారీ హిట్టింగ్, పేస్ బౌలింగ్ తో ఈ ఏడాది ఆర్సీబీ విజయంలో కీలకంగా నిలిచాడు వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్. సీపీఎల్ లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్నాడు. ఆదివారం సెయింట్ లూసియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో రొమారియో చెలరేగాడు. ఒక్క బంతికే 22 పరుగులు చేశాడు. సెయింట్ లూసియా బౌలర్ థామస్ వేసిన 15వ ఓవర్లో.. మూడో బంతికి నోబాల్ (పరుగులు రాలేదు) కాగా, ఫ్రీ హిట్ వైడ్ అయింది. తర్వాతి ఫ్రీ హిట్ ను షెఫర్డ్ సిక్స్ కొట్టాడు. కానీ, థామస్ మళ్లీ నోబాల్ వేశాడు. మరుసటి బంతినీ సిక్స్ కొట్టగా అదీ నోబాల్ అయింది. మూడో ఫ్రీ హిట్ నూ షెఫర్డ్ సిక్స్ కు తరలించడంతో ఒక్క బంతికే 22 పరుగులు వచ్చినట్లయింది. ఇక ఏడో నంబరులో బ్యాటింగ్ కు దిగిన షెఫర్డ్ 34 బంతుల్లో ఏడు సిక్స్ లతో 73 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ లో ఇతడే టాప్ స్కోరర్.
అయినా జట్టు ఓడింది...
షెఫర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్ తో గయానా వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అయితే, అకీమ్ ఆగస్టె (35 బంతుల్లో 73, 6 ఫోర్లు, 4 సిక్సులు) విధ్వంసంతో 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సెయింట్ లూసియా లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, రొమారియో షెఫర్డ్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇది లీగ్ లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 13 బంతుల్లో చేసిన హాఫ్ సెంచరీ ఫాస్టెస్ట్ గా రికార్డుల్లో ఉంది.
