Begin typing your search above and press return to search.

అంపైర్స్ కు ఎక్సర్ సైజ్... రో"హిట్" శర్మ 7 రికార్డులు!

రోహిత్ శర్మ 63 బంతుల్లో ఈ సెంచరీ పూర్తి చేశాడు. వన్డే ప్రపంచకప్‌ లో భారత్‌ తరఫున ఇదే వేగవంతమైన శతకం.

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:53 AM GMT
అంపైర్స్ కు ఎక్సర్ సైజ్... రోహిట్ శర్మ 7 రికార్డులు!
X

వన్ డే క్రికెట్ ప్రపంచకప్ - 2023 లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలిమ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తొలుత తడబడి, ఆపై కష్టపడి నెగ్గిన టీం ఇండియా.. రెండో మ్యాచ్‌ లో అఫ్గానిస్థాన్‌ ను అత్యంత సునాయాసంగా ఓడించింది. ఇక తొలి మ్యాచ్‌ లో నిరాశపరిచిన టాప్‌ ఆర్డర్‌ ఈ మ్యాచ్‌ లో చెలరేగిపోయింది. పాక్ మ్యాచ్ కు ముందు సూపర్ సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ రికార్డులు నెలకొల్పింది.

అవును... ఎంతపసికూన అయితే మాత్రం ఇంత దారుణంగా కొడతారా... ఎంత బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ అయితే మాత్రం ఇంతలా బాదుతారా... అన్నట్లుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. స్పిన్, సీం అనే తారతమ్యాలేమీ లేవు.. ఫుల్ లెగ్త్, షార్ట్ లెగ్త్, బౌన్సర్, యార్కర్ అనే ఆలోచన అసలే లేదు. వేసుడో కొట్టుడో.. వేసుడో కొట్టుడో.. అన్నట్లుగా సాగిపోయింది రో"హిట్" శర్మ ఉచకోత!

పసికూన బౌలర్లు విలవిల్లాడగా.. ఫీల్డర్లు ప్రేక్షకులైన వేళ.. మైదానం అంపైర్లకు వ్యాయామశాల అయ్యిందన్నా అతిశయోక్తి కాదేమో. కారణం... 84 బంతుల్లో 131 పరుగులు చేసిన హిట్ మ్యాన్... 16 ఫోర్లు, 5 సిక్స్ లు కొట్టాడు. అంటే 94 పరుగులు కేవలం బౌండరీల తోనే సాధించాడు. ఇంక ఫీల్డర్లకు పెద్ద పనేముందు.. ఎంఫైర్లకు ఎక్సర్ సైజ్ కాక మరేమిటయ్యింది.

ఇదే క్రమంలో... రోహిత్ శర్మ ఆ రేంజ్ లో కొడితే మరో ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (47: 47 బంతుల్లో 5×4, 2×6) రాణించాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కోహ్లి (55 నాటౌట్‌: 56 బంతుల్లో 6×4) జోరు కొనసాగించగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (25 నాటౌట్‌: 23 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి పని పూర్తి చేశాడు.

మొత్తం భారత్ ఈ ఇన్నింగ్స్ లో 273 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బాదిన బౌడరీల సంఖ్య... 28 ఫోర్లు, 8 సిక్స్ లు. అంటే... 160 పరుగులు బౌండరీలతోనే రాబట్టారన్నమాట! బౌలింగ్ విభాగానికొస్తే... బుమ్రా - 4 వికెట్లు తీయగా... హార్థిక్ - 2.. శార్దూల్‌, కుల్ దీప్ లు చెరొక వికెట్ తీసుకున్నారు.

రోహిత్ శర్మ రికార్డులే రికార్డులు:

రోహిత్ శర్మ 63 బంతుల్లో ఈ సెంచరీ పూర్తి చేశాడు. వన్డే ప్రపంచకప్‌ లో భారత్‌ తరఫున ఇదే వేగవంతమైన శతకం. 1983లో జింబాబ్వేపై కపిల్‌ దేవ్‌ 72 బంతులతో నెలకొల్పిన రికార్డును రోహిత్‌ అదిగమించాడు.

తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన సెంచరీతో వన్డేల్లో రోహిత్‌ సెంచరీల సంఖ్య 31కి చేరింది. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లోనూ సచిన్‌ (49), కోహ్లి (47) కొనసాగుతున్నారు.

ప్రపంచకప్‌ లో రోహిత్‌ సెంచరీల సంఖ్య ఇప్పుడు 7కి చేరింది. దీంతో టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డు అతడిదే అయ్యింది. అంతకముందు ఈ రికార్డ్ సచిన్‌ (6) పేరిట ఉండేది. అయితే సచిన్‌ ప్రపంచకప్‌ లో 44 మ్యాచ్‌ లాడగా.. రోహిత్‌ కిది 19వ మ్యాచ్‌ మాత్రమే కావడం గమనార్హం.

వన్డే ప్రపంచకప్‌ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌ గా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్‌ (19 మ్యాచ్‌ ల్లో) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ సమంచేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు (556) కొట్టిన బ్యాటర్‌ గా రోహిత్‌ శర్మ రికార్డు నెలకొల్పాడు. 473 మ్యాచ్‌ లలో ఈ ఫీట్ సాధించాడు. అంతకముందు ఈ రికార్డ్ వెస్టిండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (553) పేరున ఉండేది. గేల్‌ 551 మ్యాచ్‌ లలో ఈ రికార్డ్ సృష్టించాడు.

ఇదే సమయంలో... ఈ మ్యాచ్‌ లో రోహిత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ ఏకంగా 93 మీటర్లు ప్రయాణించింది. ఈ ప్రపంచకప్‌ లో ఇప్పటివరకూ ఇదే అత్యంత భారీ సిక్సర్‌.

ఇక "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డుల విషయానికొస్తే... ప్రపంచ కప్ లో రోహిత్ కి ఇది ఆరో అవార్డు. కాగా... ఇతనికంటే ముందు సచిన్‌ (9) ఉన్నాడు.