Begin typing your search above and press return to search.

మరో రికార్డుపై హిట్‌ మ్యాన్‌ గురి!

హిట్‌ మ్యాన్‌ గా క్రికెట్‌ ప్రేమికులు ముద్దుగా పిలుచుకునే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డుకు చాలా చేరువలో ఉన్నాడు

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:30 PM GMT
మరో రికార్డుపై హిట్‌ మ్యాన్‌ గురి!
X

హిట్‌ మ్యాన్‌ గా క్రికెట్‌ ప్రేమికులు ముద్దుగా పిలుచుకునే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డుకు చాలా చేరువలో ఉన్నాడు. ఇప్పటికే ఎవరికీ సాధ్యం కాని రీతిలో వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు బాదిన రోహిత్‌ శర్మ ఇప్పుడు సిక్సర్ల రికార్డుకు గురిపెట్టాడు. ఈ వన్డే వరల్డ్‌ కప్‌ లోనే ఈ రికార్డు కూడా బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్ల రికార్డు వెస్టిండీస్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ పేరు మీద ఉంది. గేల్‌ వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్ని ఫార్మాట్లు కలిపి 553 సిక్సర్లు కొట్టాడు.

ఇక క్రిస్‌ గేల్‌ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టినవారి జాబితాలో ఆ తర్వాతి స్థానం భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మదే. రోహిత్‌ ఇప్పటివరకూ అన్ని ఫార్మాట్లలో 551 సిక్సర్లు బాదాడు. మరో మూడు కొడితే చాలు క్రిస్‌ గేల్‌ రికార్డు చరిత్ర పుటల్లో కలిసిపోవడం ఖాయం. ఇందుకు తాజాగా అక్టోబర్‌ 5 జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ వేదికవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

కాగా మూడు ఫార్మాట్లలో కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 550 సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్‌ శర్మ పేరుతోనే ఉండటం విశేషం. హిట్‌ మ్యాన్‌ కేవలం 471 ఇన్నింగ్స్‌లోనే 550 సిక్సర్లు బాదాడు. మరోవైపు 550 సిక్సర్లు కొట్టడానికి క్రిస్‌ గేల్‌ కు 548 ఇన్నింగ్సులు అవసరమయ్యాయి. దీన్ని బట్టి సిక్సర్ల శర్మగా రోహిత్‌ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్రికెట్‌ మ్యాచ్‌లో ఓ బ్యాటర్‌ సిక్సర్‌ కొట్టడం అంత సులువైన విషయం కాదు. ఒక్కసారి బంతిని తప్పుగా అంచనా వేశారంటే ఔట్‌ అయిపోయి పెవిలియన్‌ కు చేరాల్సిందే. సిక్సర్లు కొట్టే విషయంలో రోహిత్‌ ది భిన్నమైన శైలే. క్రికెట్‌ కెరీర్‌ మొదలెట్టిన తర్వాత గాల్లో షాట్లు ఆడాలంటే టైమింగ్‌ ముఖ్యమని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి కచ్చితమైన టైమింగ్‌తో బంతిని స్టాండ్స్‌ లోకి బాది పడేస్తున్నాడు. అందరి బ్యాటర్లకంటే బంతిని బాదేందుకు రోహిత్‌ కు 1.5 సెకన్ల సమయం ఎక్కువగా ఉంటుందని భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి పొగడటం హిట్‌ మ్యాన్‌ సామర్థ్యానికి నిదర్శనం.

ముఖ్యంగా అతి సులువుగా సిక్సర్లను కొట్టడంలో అతడు ఎక్కువగా ఆడే షాట్‌.. ఫుల్‌ షాట్‌. బౌలర్‌ బంతిని కాస్త ఎత్తులో వేశాడంటే ఇక అది స్టాండ్స్‌ లో ఉండాల్సిందే. ఆ రేంజులో ఆ బాల్‌ కు రోహిత్‌ బుద్ది చెబుతాడు. క్రీజులో బలంగా నిలబడి.. బంతిని అమాంతం బ్యాటుతో ఎత్తి స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బయటకు తరలిస్తాడు. ఇక బంతి కాళ్ల ముందు పడిందా.. క్రీజు వదిలి ముందుకొచ్చి బౌలర్‌ తలమీదుగా బౌండరీకి దారి చూపిస్తాడు. కేవలం పుల్‌ షాట్, స్క్వేర్‌ లెగ్‌ అని మాత్రమే కాకుండా మైదానంలో అన్ని వైపులా భారీ సిక్సర్లు కొట్టగలిగే అతి తక్కువ మంది బ్యాటర్లలో రోహిత్‌ ఒకడు.

వన్డేల్లో 250కి పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక ఓపెనర్‌ గా రికార్డు రోహిత్‌ పేరు మీదే ఉంది. ఇప్పటివరకూ టెస్టుల్లో 77, వన్డేల్లో 292, టీ20ల్లో 182 సిక్సర్లను రోహిత్‌ శర్మ బాదాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డూ అతడి పేరు మీదే ఉంది. ఇక వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టినవారి జాబితాలో షాహిద్‌ అఫ్రిది (351), క్రిస్‌ గేల్‌ (331) తర్వాత రోహిత్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మరికొద్ది రోజుల్లో రాబోయే వరల్డ్‌ కప్‌ లో హిట్‌ మ్యాన్‌ మరెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో వేచిచూడాల్సిందే.