Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు టీమిండియా దిగ్గజాలు మళ్లీ టి20ల్లోకి..?

అన్నీ సవ్యంగా జరిగి ఉంటే.. వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఘనత వారి ఖాతాలో పడి ఉండేది. భారత క్రిట్ చరిత్రలో దిగ్గజాల సరసన నిలిచేవారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:57 AM GMT
ఆ ఇద్దరు టీమిండియా దిగ్గజాలు మళ్లీ టి20ల్లోకి..?
X

అన్నీ సవ్యంగా జరిగి ఉంటే.. వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఘనత వారి ఖాతాలో పడి ఉండేది. భారత క్రిట్ చరిత్రలో దిగ్గజాల సరసన నిలిచేవారు. కానీ, అనూహ్యంగా ఫైనల్లో బోల్తాకొట్టడంతో జట్టుకు కప్ అందలేదు. దేశంలోని కోట్లాది అభిమానుల కల నెరవేరలేదు. ఇప్పుడు ప్రపంచ కప్ అయిపోయింది. గతం గతం అనుకుని ముందడుగు వేయకతప్పదు. రెండు రోజుల్లోనే టి20 సిరీస్ మొదలుకానుంది. మరో ఏడాది లోపల టి20 ప్రపంచ కప్ కూడా ఉంది. భవిష్యత్ పై చూపు సారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు దిగ్గజాల భవితవ్యం ఏమిటనే ప్రశ్న వస్తోంది.

ఆ మేటి ఆటగాళ్లకు ఓ లోటు

వన్డే క్రికెట్ చరిత్రలో మేటి ఆటగాళ్ల జాబితా బయటకు తీస్తే కచ్చితంగా ఉండే పేర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. ప్రపంచ కప్ అయిపోయినందున 36 ఏళ్లు పైబడిన రోహిత్, 36వ ఏట అడుగుపెట్టిన కోహ్లి మున్ముందు ఏం చేస్తారన్న ప్రశ్న వస్తోంది. మరో నాలుగేళ్లకు ప్రపంచ కప్ జరిగే సమయానికి వీరిద్దరూ వయసు పైబడిన ఆటగాళ్లవుతారు. ఇప్పటికే చివరి కప్ ఆడేశారన్న భావన ఉంది. వాస్తవానికి 2011లో కప్ గెలిచిన జట్టులో కోహ్లి సభ్యుడు. సచిన్, సెహ్వాగ్, ధోనీ, గంభీర్, యువరాజ్ వంటి వారి మధ్యన అతడో జూనియర్. సూపర్‌ స్టార్‌ అయ్యాక.. కోహ్లి దేశానికి కప్ అందించలేకపోయాడు. తాజా కప్ లో 3 శతకాలు సహా 765 పరుగులు చేసి తన శక్తిమేర కష్టపడ్డాడు. రోహిత్ ది ఇంకాస్త భిన్నమైన కథ. కోహ్లి కంటే ముందే 2007లోనే టీమిండియాలోకి వచ్చినా.. 2011 నాటి కప్ గెలిచిన జట్టులో లేడు. అయితే, ఈసారి కెప్టెన్‌ గా జట్టును నడిపించే అవకాశం వచ్చింది. బ్యాట్ తో 11 మ్యాచ్‌ లలో 597 పరుగులు చేశాడు. సారథ్యంలోనూ ఆకట్టుకున్నాడు. అయితే, ఇద్దరూ ప్రపంచ కప్ ను అందుకోలేకపోవడం అభిమానులకు తీవ్ర వేదన కలిగించింది.

వచ్చే కప్ ఆడరు..?

రోహిత్‌ కు వచ్చే ప్రపంచ కప్ నకు 40 ఏళ్లు వస్తాయి. అతడి కంటే కోహ్లి ఏడాడి చిన్న. ఓ విధంగా వీరిద్దరూ కెరీర్‌ చరమాంకంలో ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడటం కష్టమే. అందులోనూ.. ఇప్పుడు వన్డేలకు ప్రాధాన్యం లేదు. కేవలం ప్రపంచకప్‌ నకు ఒకటి రెండేళ్ల ముంగిట మాత్రమే వన్డే లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో భారత్‌ సహా అన్ని జట్ల చూపూ దానిపైనే ఉంటుంది. ఆ తర్వాత మరో రెండేళ్లు ఎన్ని వన్డేలు ఆడతారో తెలియదు. ఇంతలో జట్టు కూర్పు ఆలోచన మారిపోవచ్చు. 2027 ప్రపంచ కప్‌ కోసం కొత్త జట్టు గురించి బోర్డు, సెలక్టర్లు భావించవచ్చు. అన్నిటికి మించి వన్డేలంటే.. 100 ఓవర్ల ఆట. శారీరకంగా, మానసికంగా సవాల్‌. అందుకని రోహిత్‌, కోహ్లి ఒకటి, రెండేళ్లు ఆడి ఈ ఫార్మాట్‌ కు గుడ్‌ బై చెప్పే అవకాశాలున్నాయి.

టీ20ల్లో మళ్లీ?

మొన్ననే ప్రపంచ కప్ ముగిసింది కాబట్టి ఏడాది కాలంలో వన్డేలు తక్కువే. టెస్టులు చాంపియన్ షిప్ లో భాగంగానే ఉంటాయి. దీంతో కోహ్లి, రోహిత్‌ చాలావరకు ఖాళీ అన్నట్లే. మరోవైపు వన్డే ప్రపంచ కప్ కోసమని.. నిరుటి టీ20 ప్రపంచ కప్‌ తర్వాత వీరు ఈ ఫార్మాట్లో ఆడలేదు. ఇప్పటికైతే టీ20లకు గుడ్‌ బై చెప్పలేదు. కానీ, గురువారం నుంచి జరిగే ఆస్ట్రేలియా టి20 సిరీస్ సహా వరుసగా సిరీస్‌ లలో ఆడడం లేదు. కానీ, వన్డే ప్రపంచ కప్‌లో వీరి దూకుడు చూశాక.. టీ20 ప్రపంచ కప్‌ ఆడితే బాగుండనే భావన వస్తోంది. విశేషం ఏమంటే.. ప్రపంచ కప్ లో అందరికంటే దూకుడుగా ఆడిన బ్యాట్స్ మన్ రోహిత్. అందరికంటే నిలకడగా ఆడినది కోహ్లి. దీనికితోడు టి20 లీగ్ ఐపీఎల్‌ ఆడుతున్నారు. అక్కడా ఇలాగే ఆడితే కోహ్లి, రోహిత్‌ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలన్న డిమాండ్‌ పెరగొచ్చు. స్థాయి, ఫామ్, క్లాస్ ప్రకారం ఇద్దరూ జట్టుకు బలమే తప్ప బలహీనతగా మారరు. అందుకని మళ్లీ కొన్ని రోజులకు టి20 జట్టులో చూసే అవకాశం లేకపోలేదు.