కొడుకు 3 వన్డే డబుల్,5 టి20 సెంచరీల వీరుడు..తండ్రికి టెస్టులే ఇష‍్టం
ఆ కాలం వారు అంతే.. ఇప్పుడు 60 ఏళ్లు ఉన్నవారు.. వారు యుక్త వయసులో ఉన్నప్పుడు చూసింది టెస్టు క్రికెట్ మాత్రమే. వన్డేలు అప్పటికి పూరి స్థాయిలో రాలేదు.
By: Tupaki Desk | 7 Jun 2025 9:29 AM ISTఆ కాలం వారు అంతే.. ఇప్పుడు 60 ఏళ్లు ఉన్నవారు.. వారు యుక్త వయసులో ఉన్నప్పుడు చూసింది టెస్టు క్రికెట్ మాత్రమే. వన్డేలు అప్పటికి పూరి స్థాయిలో రాలేదు. అందుకే టెస్టు క్రికెట్లోని మజాను ఆస్వాదించారు. వాస్తవానికి ఎప్పటికీ టెస్టు క్రికెట్ ఉత్తమం. కానీ, వన్డేలు, మరీ ముఖ్యంగా టి20లు వచ్చాక సంప్రదాయ ఫార్మాట్ కళ తప్పింది. తాజాగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తండ్రికి కూడా టెస్టు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో బయటపడింది. ‘‘మా నాన్నకు టెస్టులు ఇష్టం.. నా రిటైర్మెంట్ ఇష్టం లేదు..’’ అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే, ఇటీవల ఐపీఎల్ జరుగుతుండగా రోహిత్ టెస్టులకు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ఇంగ్లండ్ టూర్‌కు తాను అందుబాటులో ఉంటానని చెప్పి మరీ రిటైర్ అయ్యాడు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, దీనికి కారణాలు ఉన్నాయి. రోహిత్ సారథ్యంలోని టీమ్ ఇండియా స్వదేశంలో ఎన్నడూ లేని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 0-3 వైట్ వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. ఆ సిరీస్‌లో సరిగా రాణించని నేపథ్యంలోనే రోహిత్‌పై చివరి టెస్టుకు వేటుపడింది. ఓ కెప్టెన్‌గా ఉంటూ జట్టు నుంచి బలవంతంగా తప్పించిన భారత క్రికెటర్ గత 20 ఏళ్లలో రోహిత్ మాత్రమే కావడం గమనార్హం. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓటమితో టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత కోల్పోయింది. ఐపీఎల్‌లోనూ రోహిత్ ఫామ్ గొప్పగా ఏమీ లేదు. ముంబై ఇండియన్స్ జట్టులోంచి తీసేయలేక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాల్సి వచ్చింది. ఇవన్నీగమనించిన రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. బీసీసీఐ ఆదేశాల ప్రకారం దేశవాళీలు ఆడి.. ఇంగ్లండ్ సిరీస్‌కూ వెళ్తానని చెప్పిన రోహిత్ ఇలా ఎందుకు చేశాడు? అని అభిమానులు ఆవేదన చెందారు. వీరేకాదు రోహిత్ తండ్రి కూడానట. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, నయా వాల్‌గా పేరుగాంచిన పుజారా భార్య పూజ రాసిన ‘ది డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్’ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ హాజరయ్యాడు. తన తండ్రి టెస్ట్ క్రికెట్‌ను బాగా ప్రేమిస్తారని వెల్లడించాడు. అందుకే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించలేదని వివరించాడు.
నాన్న త్యాగమే.. నా భవిష్యత్..
రోహిత్‌కు తెలుగు మూలాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అమ్మమ్మ వాళ్లది విశాఖపట్నం. అయితే, వీరి కుటుంబం ముంబైలో స్థిరపడింది. రోహిత్ తండ్రి గరునాథ్ శర్మ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగి. రోహిత్ కెరీర్ కోసం ఆయన చాలా త్యాగాలు చేశారు. దీనిని తాజాగా రోహిత్ గుర్తుచేశాడు. టెస్ట్ క్రికెట్ అంటేనే తన తండ్రికి ఇష్టం అని.. తాను వన్డేలో శ్రీలంకపై 264 పరుగులు చేసిన రోజున కూడా తండ్రి నుంచి ప్రశంసలు రాలేదని తెలిపాడు. అదే టెస్టుల్లో 30, 40, 50, 60 పరుగులు చేసినా వాటి గురించి బాగా వివరంగా మాట్లాడేవారని పేర్కొన్నాడు. అందుకే తాను టెస్టుల నుంచి రిటైర్ కావడం తండ్రికి నచ్చలేదని తెలిపాడు. తర్వాత ఆయన తన నిర్ణయాన్ని అంగీకరించారని వివరించాడు. రోహిత్ టి20ల్లో రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.