రోహిత్ అనధికారిక రిటైర్..? ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కు కొత్త కెప్టెన్
కనీసం పరుగులు చేయలేని స్థితిలో ఆస్ట్రేలియాతో జనవరి మొదటి వారంలో జరిగిన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ కెరీర్ ఇక ముగిసినట్లేనని భావించారు.
By: Tupaki Desk | 28 March 2025 3:00 PM ISTటీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్... ఈ మాట కొద్ది నెలలుగా వినపిస్తూనే ఉంది. కనీసం పరుగులు చేయలేని స్థితిలో ఆస్ట్రేలియాతో జనవరి మొదటి వారంలో జరిగిన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ కెరీర్ ఇక ముగిసినట్లేనని భావించారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలోనూ అతడే జట్టును నడిపించాలని సెలక్టర్లు భావించారు. ఇదే సమయంలో రోహిత్ కప్ కూడా సాధించిపెట్టడంతో అతడు మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని భావించారు.
టీమ్ ఇండియాకు ఇప్పట్లో టెస్టు మ్యాచ్ లు లేవు. ఇంగ్లండ్ తో జూన్ లో టెస్టు సిరీస్ తోనే కొత్త అంతర్జాతీయ సైకిల్ మొదలుపెట్టనుంది. ఐదు మ్యాచ్ ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. నిన్నటివరకు ఈ సిరీస్ కు రోహితే కెప్టెన్ అని వార్తలొచ్చాయి.
రిటైర్ అయినట్లేనా?
తాజాగా తెలుస్తున్నదాని ప్రకారం రోహిత్ ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడే ఉద్దేశంలో లేనట్లు తెలుస్తోంది. ఇదే సంగతిని సెలక్టర్లకు కూడా చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే ఇప్పటికే ముగిని ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్ కెరీర్ లో చివరిది అనుకోవాలి. ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో అతడు వ్యక్తిగత కారణాలతో (కుమారుడు పుట్టడం) ఆడలేదు. 2, 3, 4 మ్యాచ్ లు ఆడినా 31 పరుగులే చేశాడు. దీంతో చివరి టెస్టుకు వేటు వేశారు.
మరి కోహ్లి సంగతి
స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనలో లేడట. రోహిత్ మాత్రం ఇంగ్లండ్ వెళ్లడం లేదని ఖాయమైంది. దీంతో కొత్త కెప్టెన్ పేసర్ బుమ్రాను ప్రకటించే చాన్సుంది. బుమ్రా వెన్ను గాయం నుంచి కోలుకుంటేనే. లేదంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనసులోని యశస్వి జైశ్వాల్ కు టెస్టు జట్టు పగ్గాలు దక్కుతాయి. ఇంగ్లండ్ టూర్ నెలన్నర సాగనుంది. జూన్ 20న హెడింగ్లిలో తొలి టెస్టు జరగనుంది. అయితే, ఐపీఎల్ ముగిసిన వెంటనే మే నెలలోనే టీమ్ ఇండియా ఇంగ్లండ్ బయల్దేరుతుంది. మరోవైపు ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు)తో భారత-ఎ జట్టు రెండు మ్యాచ్ లలో తలపడనుంది. టెస్టు సిరీస్ సన్నాహకంగా దీనిని భావిస్తున్నారు. టెస్టు జట్టులోని ప్రధాన ఆటగాళ్లు వెళ్లనున్నారని సమాచారం.
