టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ ప్రకటనలో బీసీసీఐ అనూహ్య నిర్ణయం
ఈ నేపథ్యంలో నలుగురు ఆటగాళ్ల పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 10 May 2025 5:30 PMగత బుధవారం అనూహ్యంగా టెస్టు కెప్టెన్సీని వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటనకూ అతడే కెప్టెన్ అని భావిస్తుండగా.. రోహిత్ మాత్రం బైబై చెప్పేశాడు. దీంతో తక్షణమే కొత్త కెప్టెన్ ను ప్రకటించాల్సిన పరిస్థితి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు (బీసీసీఐ) ఎదురైంది. ఈ నేపథ్యంలో నలుగురు ఆటగాళ్ల పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి.
పదేళ్లకు పైగా జట్టులో ఉంటున్నా వచ్చిపోతూ.. గాయాల బారిన పడుతూ వస్తున్న బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, మేటి పేసర్ అయినప్పటికీ గాయాల బెదడ ఉన్న జస్ప్రీత్ బుమ్రా, దూకుడుగా ఆడతాడని పేరున్నా.. వికెట్ పారేసుకుంటాడనే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, ప్రపంచ క్రికెట్ పై బలమైన ముద్ర చాటుతున్న శుబ్ మన్ గిల్ లు టెస్టు కెప్టెన్ రేసులో ముందున్నారు. మరో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పేరు మొన్నటివరకు వినిపించినా అతడు పూర్తిగా వెనుకబడిపోయాడు.
వీరందరిలోనూ గిల్ కే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. బ్యాటింగ్ లో నిలకడ, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్టును నడిపిస్తున్న తీరు, ఇప్పటికే వైస్ కెప్టెన్ గా ఉన్నందున గిల్ కు కెప్టెన్సీ ఇవ్వాలని సెలక్టర్లు కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే నెల రెండోవారం నుంచి దాదు రెండు నెలల పాటు టీమ్ ఇండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తుంది. దీనికోసం కెప్టెన్ ఎవరో తేల్చే పనిలో టీమ్ ఇండియా సెలక్టర్లు బిజీగా ఉన్నారట. ఈ నెల 23న ఇంగ్లండ్ టూర్ కు జట్టును ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటివరకు నాలుగు గోడల మధ్య జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్ ను ప్రకటించే సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం మీడియా ఎదుటనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.