రోహిత్ శర్మ.. "సూపర్ ఫిట్" మ్యాన్..
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నిక్ నేమ్ హిట్ మ్యాన్...! కానీ, అతడి ఫిట్ నెస్ చూస్తే విమర్శకులు అన్ ఫిట్ అనే అభిప్రాయం వ్యక్తం చేసేవారు.
By: Tupaki Desk | 26 Sept 2025 1:00 AM ISTటీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నిక్ నేమ్ హిట్ మ్యాన్...! కానీ, అతడి ఫిట్ నెస్ చూస్తే విమర్శకులు అన్ ఫిట్ అనే అభిప్రాయం వ్యక్తం చేసేవారు. ఇటీవల లండన్ నుంచి తిరిగొస్తున్న రోహిత్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో అతడు పొట్టతో... బాడీ షేప్ ఔట్ అయినట్లుగా కనిపించాడు. దీంతో కొందరు బాడీ షేమింగ్ కు కూడా దిగారు. ఆ ఫోటో వాస్తవమేనా? అనేది కూడా ఆలోచించకుండా కామెంట్లు చేశారు. పైగా రోహిత్ టెస్టులకు వీడ్కోలు ప్రకటించడం, ఐపీఎల్ తర్వాత 2 నెలలు గ్యాప్ రావడంతో అతడి ఫిట్ నెస్ దెబ్బతిన్నదని చాలామంది అంచనాకు వచ్చారు.
నోళ్లకు పదును..
రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్ లో అతడే కెప్టెన్. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమ్ ఇండియాకు కూడా సారథ్యం వహిస్తాడని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, కొందరు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. కారణం.. ఫిట్ నెస్ అని చెప్పసాగారు. అయితే, వీటన్నిటికీ చెక్ పెడుతూ రోహిత్ ఇటీవల అత్యంత కఠినమైన బ్రాంకో టెస్టు పాసయ్యాడు. ఇక మిగిలింది సెలక్టర్లు అతడిని కెప్టెన్ గా కొనసాగించడమే.
వచ్చే ప్రపంచ కప్ వరకు..
రోహిత్ చిరకాల వాంఛ వన్డే ప్రపంచ కప్ నెగ్గడం. 2027లో జరిగే ఈ ప్రపంచ కప్ లో అతడు ఆడాలని అనుకుంటున్నా వయసు సహకరిస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. అప్పటికి రోహిత్ 40 ఏళ్ల వాడవుతాడు. ఇప్పటికే చాలామంది కుర్రాళ్లు పోటీలో ఉన్నందున రోహిత్ ను వన్డే ఫార్మాట్ లో మరో రెండేళ్లు కొనసాగించడం కష్టమే. ఈ లెక్కన ప్రస్తుతం అతడి ముందున్న మార్గం సాధ్యమైనంత ఫిట్ నెస్ కాపాడుకుంటూ సెలక్టర్లకు సందేశం పంపడమే.
10 కిలోలు తగ్గేశాడు..
రోహిత్ శర్మది బొద్దు శరీరం. అతడు ఎంత ఫిట్ గా ఉన్నా పైకి మాత్రం బొద్దుగానే కనిపిస్తాడు. ఆ సంగతి వదిలేస్తే.. ఆస్ట్రేలియా టూర్ కు ముందు సాధ్యమైనంత ఫిట్ గా మారాలని భావిస్తున్న రోహిత్.. టీమ్ ఇండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో కసరత్తులు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 38 ఏళ్ల రోహిత్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 10 కిలోలు తగ్గి ముందుకు సాగుతున్నాను అంటూ కామెంట్ చేశాడు. దీనిని చూసిన అభిమానులు వావ్ అంటున్నారు.
-ఈ ఏడాది జూన్ తొలి వారం ముగిసిన ఐపీఎల్ తర్వాత రోహిత్ మళ్లీ మైదానంలోకి దిగలేదు. అక్టోబరు రెండో వారంలో ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ లేనట్లే. ఈ లోటు కనిపించకుండా ఉండేందుకు రోహిత్ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు స్పష్టం అవుతోంది.
విఫలమైతే...
ఆస్ట్రేలియాతో ఈ ఏడాది మొదట్లో జరిగిన టెస్టు నుంచి రోహిత్ ను తప్పించారు. కెప్టెన్ గా ఉన్నప్పటికీ సిరీస్ లో విఫలం కావడంతో పక్కనపెట్టారు. చివరకు అది రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేవరకు వెళ్లింది. మళ్లీ ఇప్పుడు వన్డే సిరీస్ కు వెళ్తున్నాడు. ఇందులో రాణించకపోతే వన్డేలకూ కొనసాగించడం కష్టమే.
