Begin typing your search above and press return to search.

అపర దాన కర్ణుడు రోహిత్ శర్మ.. కిట్ లోని బ్యాట్లన్నీ మాయం

గత ఆదివారం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 5:26 PM IST
అపర దాన కర్ణుడు రోహిత్ శర్మ.. కిట్ లోని బ్యాట్లన్నీ మాయం
X

టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ఇక వచ్చే ఐపీఎల్ ఆడతాడో లేదో అనుకున్నారేమో? అసలు వచ్చే సీజన్ కు రిటైన్ చేసుకుంటారా? అని అనుమానించారేమో..? లేదా తమ అభిమాన క్రికెటర్ నుంచి, దిగ్గజ బ్యాట్స్ మన్ గుర్తుగా ఏదైనా పొందాలని భావించారేమో..? ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను భలే ఇబ్బంది పెట్టారు.

గత ఆదివారం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కాసేపటికి ఆటగాళ్లు ఓటమి నుంచి తేరుకున్నారు. అదే సమయంలో రోహిత్ శర్మ వద్దనున్న బ్యాట్లను ఇవ్వాల్సిందిగా అడగడం మొదలుపెట్టారు.

రోహిత్ చుట్టూ చేరిన చాలామంది యువ ప్లేయర్లు అతడి ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు. ఎవరినీ నిరాశపరచకుండా రోహిత్ వారి టీషర్టులు, బ్యాట్లపై ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. అయితే, సీనియర్ స్పిన్నర్ కర్ణ్ శర్మ కూడా ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. తనకు ఓ బ్యాట్ (రోహిత్ కిట్ లోంచి) కావాలని కూడా అడిగాడు.

దీనికి రోహిత్ స్పందిస్తూ.. ’’ఇప్పటికే ఆరు బ్యాట్లు తీసుకున్నారు. ఇక నా దగ్గర ఏమీ లేవు. బ్యాగ్ ఖాళీ అయింది చూడు..’’ అంటూ చూపించాడు. చివరకు కర్ణ్ శర్మ నిరాశ చెందాడు.

కాగా, రోహిత్ కిట్ లో ఇంకా మూడు బ్యాట్లు ఉన్నాయి. అంటే అతడి దగ్గర మొత్తం 9 బ్యాట్లు ఉన్నట్లు అన్నమాట. ముంబై ఆటగాళ్లు 6 తీసుకోవడంతో మూడు బ్యాట్లు మాత్రమే మిగిలాయి.

రోహిత్ నుంచి బ్యాట్లు పొందినవారిలో యువ హిట్టర్ రాబిన్ మింజ్, పేసర్ అశ్వని కుమార్, క్రిష్ణన్ శ్రీజిత్ తో పాటు వంద టెస్టులు ఆడిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో కూడా ఉండడం గమనార్హం.

ఐపీఎల్ లో ముంబైకి 5 టైటిళ్లు అందించిన రోహిత్.. ప్రస్తుతం లీగ్ నడుస్తుండగానే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. గత ఏడాది టి20 ప్రపంచ కప్ అనంతరం ఆ ఫార్మాట్ నుంచి వైదొలగాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో 328 పరుగులతో రోహిత్ సాధారణ ప్రదర్శన చేశాడు. 46.9 సగటు, 152.2 స్ట్రయిక్ రేట్ ఉన్నప్పటికీ.. మొదట విఫలం అయ్యాడు. దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకున్నారు.