రోహిత్ శర్మ రిటైర్మెంట్... ఈ ఒక్క పోస్ట్ చాలు సమాధానం చెప్పేందుకు
టి20 ప్రపంచ చాంపియన్ గా నిలిచిన అనంతరం నిరుడు ఆ ఫార్మాట్ కు గుడ్ బై పలికాడు రోహిత్. టెస్టుల్లో జట్టును ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేర్చాడు.
By: Tupaki Desk | 11 Sept 2025 2:00 PM ISTటీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆలోచనలు ఏమిటి..?? అతడు మరెంత కాలం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతాడు..?? 2027 వన్డే ప్రపంచ కప్ లోనూ జట్టును నడిపిస్తాడా? ఆటగాడి అయినా ఉంటాడా? అసలు ఇకమీదట రోహిత్ ను టీమ్ ఇండియా జెర్సీలో చూడబోమా..? ఇవీ మూడు నెలలుగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. మరోవైపు రోహిత్ ఫిట్ నెస్ పడిపోయింది... టోటల్ బాడీ షేప్ ఔట్ అయ్యాడు అనే విమర్శలు.. ఫొటోలు! ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ ను వచ్చే నెలలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ లో కెప్టెన్ గా పరిగణిస్తారా? అనే అనుమానాలు కలిగాయి.
ఈ ఒక్క ఫార్మాట్లోనూ...
టి20 ప్రపంచ చాంపియన్ గా నిలిచిన అనంతరం నిరుడు ఆ ఫార్మాట్ కు గుడ్ బై పలికాడు రోహిత్. టెస్టుల్లో జట్టును ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేర్చాడు. మూడు నెలల కిందట ఇంగ్లండ్ టూర్ కు ముంగిట ఈ ఫార్మాట్ కూ బైబై చెప్పాడు. అంటే.. అతడు వన్డే ల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు. ఇక రెండేళ్ల కిందట వన్డే ప్రపంచ కప్ త్రుటిలో చేజారింది. దానిని అందుకునేందుకు రోహిత్ కల కంటున్నట్లు తెలుస్తోంది. కానీ, కుర్రాళ్లు పోటీకి వస్తున్న నేపథ్యంలో 38 ఏళ్ల రోహిత్ ను కొనసాగిస్తారా? అన్నది చర్చనీయంగా మారింది.
వచ్చేనెలలో...
టీమ్ఇండియా వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించకనుంది. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి ముందే స్వదేశంలో ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో రోహిత్ కు చోటు దక్కలేదు. అతడి విషయంలో అసలు సెలక్టర్ల ఉద్దేశం ఏమిటో అన్నది కూడా తెలియడం లేదు. టెస్టుల్లో మాదిరిగానే వన్డేలకూ సైలైంట్ గా రోహిత్ వీడ్కోలు చెప్పేస్తాడా..? అన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ, అతడు తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వాటికి సమాధానం ఇచ్చాడు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగుతానని స్పష్టం చేశాడు.
ఏమిటా పోస్ట్..??
వాకింగ్ చేస్తున్నట్లు, ప్యాడ్స్ కట్టుకుంటున్నట్లు ఉన్న ఫొటోను రోహిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆసియా కప్ అనంతరం ఆస్ట్రేలియా సిరీస్ కు జట్టు ఎంపిక ఉంటుంది. ఇప్పటికే రోహిత్ ఫిట్ నెస్ టెస్టులు పాసైనట్లు కథనాలు వస్తున్నాయి. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి కూడా ఫిట్ నెస్ టెస్టును ఇంగ్లండ్ లోనే పూర్తిచేసినట్లు తెలుస్తోంది. మరి... రోహిత్ అయితే తాను సిద్ధం అన్నట్లు సంకేతాలిచ్చాడు. సెలక్టర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో?
