Begin typing your search above and press return to search.

టీమిండియాకు బిగ్ గుడ్ న్యూస్.. అతడు కోలుకుంటున్నాడోచ్

అండర్ 19 దశ నుంచే ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ ఎక్స్ ఫ్యాక్టర్ (ఫలితాన్ని మార్చే) ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 11:30 PM GMT
టీమిండియాకు బిగ్ గుడ్ న్యూస్.. అతడు కోలుకుంటున్నాడోచ్
X

ఏక కాలంలో మూడు అంతర్జాతీయ క్రికెట్ జట్లను ఎంపిక చేయగలిగినంతమంది ఆటగాళ్లున్నారు భారత దేశంలో ఇప్పుడు. మరోవైపు నుంచి చూస్తే.. జాతీయ జట్టు (టాప్) అత్యంత బలంగా ఉంది. అందులోకి ఎంపిక అంటే.. చాలా కష్టమే. ఒక్క చాన్స్ మిస్ అయినా.. తిరిగి రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే.. అలాంటిది ఓ క్రికెటర్ ఏడాది పాటు పూర్తిగా క్రికెట్ కే దూరమైనా.. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడిందంటే అతడెంత విలువైన ఆటగాడో చెప్పేదేముంది?

అతడొక ఎక్స్ ఫ్యాక్టర్

అండర్ 19 దశ నుంచే ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ ఎక్స్ ఫ్యాక్టర్ (ఫలితాన్ని మార్చే) ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన అతడు మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా పేరుతెచ్చుకున్నాడు. తొలినాళ్లలో కొంత నిరాశపరిచినప్పటికీ.. ధోని ప్రాభవం తగ్గుతున్న కొద్దీ వెలుగులోకి వచ్చాడు. సరిగ్గా చెప్పాలంటే.. దాదాపు నాలుగేళ్ల కిందట పంత్ ప్రస్థానం మొదలైంది. 2020-21 సీజన్ ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో అద్భుతంగా రాణించడంతో జట్టులో చోటు స్థిరమైపోయింది. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. తనపై అంచనాలను నిలబెబ్టుకోసాగాడు.

అనూహ్యం ఆ ప్రమాదం.

గతేడాది డిసెంబరు 30న ఉత్తరాఖండ్ లోని అమ్మను చూసేందుకు వెళ్తూ.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు రిషభ్ పంత్. ఆ ప్రమాదం జరిగిన తీరును చూస్తే.. పంత్ ప్రాణాలతో బతికి బయటపడడం అద్భుతమనే చెప్పాలి. అయితే, అతడి వాహనం ఎస్ యూవీ కావడంతో గండం తప్పింది. ప్రమాదం జరిగిన సెకన్లలోనే పంత్ వాహనం నుంచి బయటకు రావడంతో ప్రాణాలు దక్కాయి. ఇక ఈ ఘటనలో పంత్ వీపు భాగం కొంత కాలిపోయింది. కాలుకు గాయాలయ్యాయి. సరిగ్గా ఈ డిసెంబరు 30కి ఏడాది అవుతుండగా.. భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.

ట్రైనింగ్ లో వేగం పెంచాడు..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న పంత్‌ ట్రైనింగ్‌లో వేగం పెంచాడు. జిమ్‌ లో బరువులు ఎత్తుతున్నాడు. మూడు నెలల కిందట ఓ సాధారణ గ్రౌండ్ లో దిగుతున్న పంత్ వీడియోలు బయటకు వచ్చాయి. అంతకుముందు అతడు మేడపైకి ఎవరి సాయం లేకుండా వెళ్తున్న వీడియోలు పోస్ట్ చేశాడు. కాగా, ఏప్రిల్‌ నాటికల్లా ఐపీఎల్‌ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌లో చేరాలనే పట్టుదలతో ఉన్నాడట పంత్. దీనికోసం ఇటీవలే నెట్స్‌లోనూ సాధన మొదలుపెట్టాడు. ఇక వచ్చే ఏడాది మే-జూన్ లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో స్థానాన్ని ఆశిస్తున్నాడు పంత్. అయితే, ఐపీఎల్‌ లో ఆడి ఫిట్‌ నెస్‌, ఫామ్‌ నిరూపించుకుంటే పంత్ కు తిరుగుండదని చెప్పొచ్చు

పంత్ వస్తే ఎవరిని తీసేస్తారో..?

పంత్ స్వతహాగా వికెట్ కీపర్. అతడు లేని ఈ ఏడాది కాలంలో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, జితేశ్ శర్మలకు అవకాశాలు వచ్చాయి. మరిప్పుడు పంత్ తిరిగొస్తే.. ఏమిటి పరిస్థితి అన్నది చూడాలి. వాస్తవానికి 26 ఏళ్ల పంత్ టెస్టుల్లో అద్భుతంగా ఆడుతుండగా ప్రమాదానికి గురవడం టీమిండియాను దెబ్బతీసింది. టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో పంత్ ఉండి ఉంటే ఆ కథే వేరు. ఇక వన్డేలు, టి20లకూ అతడు కచ్చితంగా ఉండాల్సిన వాడు. పంత్ పునరాగమనంలో ఎవరిపై వేటు పడుతుందో చూడాలి.