టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. టెస్టు సిరీస్ నుంచి కీలక ప్లేయర్ ఔట్
ఇప్పుడు ఏకంగా కీలక ఆటగాడు సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో సిరీస్ నెగ్గడం పక్కనపెట్టి డ్రా చేసుకోవడం కూడా టీమ్ ఇండియాకు సవాల్ కానుంది.
By: Tupaki Desk | 24 July 2025 4:38 PM ISTఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ లో వెనుకబడిన టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. ఇప్పటికే ఆకాశ్ దీప్ వంటి పేసర్ తో పాటు మరో స్టార్ ఆటగాడు అర్షదీప్ సింగ్ గాయాలతో సతమతం అవుతుండగా.. ఇప్పుడు ఏకంగా కీలక ఆటగాడు సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో సిరీస్ నెగ్గడం పక్కనపెట్టి డ్రా చేసుకోవడం కూడా టీమ్ ఇండియాకు సవాల్ కానుంది.
మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు 264 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. రెండో రోజు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సిరీస్ లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన పంత్ తొలి రోజు మంచి ఊపులో ఉండగా.. ఇంగ్లండ్ పేసర్ వోక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడబోయిన పంత్ పాదానికి బంతి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అతడు మైదానాన్ని వీడాడు. దీంతోనే పంత్ గాయం తీవ్రత ఎంత ఉంటుందో అర్థమైంది. అయినా రెండో రోజు బ్యాటింగ్ కు దిగితే చాలని అభిమానులు భావిస్తుండగా.. పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది.
పంత్ కుడిపాదానికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అతడు మ్యాచ్ ఆడడం కష్టమే. సిరీస్ లో చివరిదైన ఐదో టెస్టుకూ దూరమే.
వాస్తవానికి పంత్ మూడో టెస్టులోనే వేలిగాయానికి గురయ్యాడు. అదే బాధతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగాడు. కానీ, సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ ప్రభావం జట్టు విజయావకాశాలపై పడింది. మరోవైపు పంత్ ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులో తిరిగి బ్యాటింగ్ చేసేది కూడా లేదని తెలుస్తోంది. అతడు నిలవడానికే ఇబ్బంది పడుతున్నాడని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే చాన్సుంది. ఐదో టెస్టు నాటికి వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు పిలుపు వెళ్లొచ్చు.
లేదంటే ఐదో టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ లతో కీపింగ్ చేయించి.. కరుణ్ నాయర్ ను జట్టులోకి తీసుకోవడం టీమ్ ముందున్న మరో చాన్స్. వీటిలో కిషన్ ను పిలిచేందుకే మొగ్గుచూపినా.. అతడిని ఐదో టెస్టులో నేరుగా ఆడించకపోవచ్చు. జురెల్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలే ఎక్కువ. కీపింగ్ లో నైపుణ్యంతో పాటు బ్యాటింగ్ లోనూ మంచి టెక్నిక్-దూకుడు ఉన్న ధ్రువ్.. ఇప్పటికే తానేంటో చాటుకున్నాడు. ఈ సిరీస్ లో మొదటినుంచి జట్టుతో ఉన్నాడు. కాబట్టి అతడినే తుది జట్టులో ఆడించడం ఖాయం.
ఇక పంత్ ను మళ్లీ మైదానంలో ఎప్పుడు చూస్తామో చెప్పలేం. ఎందుకంటే అతడు టి20 జట్టులో లేడు. వన్డేల్లో రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు. అయినా సెప్టెంబరులో కానీ.. పంత్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
