Begin typing your search above and press return to search.

రూ.27 కోట్లు.. ఐపీఎల్ చరిత్రలో తోపు ఆటగాడి ఫ్లాప్ కథ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే కాసుల వర్షం. ప్రపంచ క్రికెట్‌లో మరే లీగ్‌లోనూ లేని విధంగా ఇక్కడ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తారు ఫ్రాంచైజీలు.

By:  A.N.Kumar   |   2 April 2026 1:54 PM IST
రూ.27 కోట్లు.. ఐపీఎల్ చరిత్రలో తోపు ఆటగాడి ఫ్లాప్ కథ
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే కాసుల వర్షం. ప్రపంచ క్రికెట్‌లో మరే లీగ్‌లోనూ లేని విధంగా ఇక్కడ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తారు ఫ్రాంచైజీలు. అయితే ఈ భారీ ధర అనేది ఒక ఆటగాడికి ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో అంతకంటే రెట్టింపు ఒత్తిడిని కూడా తీసుకొస్తుంది. ప్రస్తుతం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సరిగ్గా ఇటువంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంత్, తన ధరను సమర్థించుకోవడంలో దారుణంగా విఫలమవుతుండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రికార్డు ధర.. కానీ నిరాశాజనక ప్రదర్శన

గత వేలంలో లక్నో ఫ్రాంచైజీ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును పంత్ తిరగరాశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి విడిపోయిన తర్వాత పంత్ మార్కెట్ వాల్యూ భారీగా పెరిగినప్పటికీ మైదానంలో అతని ప్రదర్శన మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది. గత సీజన్ నుంచి ఇప్పటి వరకు పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లను విశ్లేషిస్తే అతని బ్యాటింగ్‌లో మునుపటి వాడి వేడి కనిపించడం లేదని స్పష్టమవుతోంది. గత సీజన్‌లో ఒకే ఒక అర్ధశతకం మినహా మిగతా మ్యాచ్‌లలో పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది.

నాయకత్వ లోపాలు మరియు నిలకడలేమి

పంత్ కేవలం ఒక బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, జట్టును ముందుండి నడిపించే కెప్టెన్‌గా కూడా భారీ అంచనాలతో లక్నో జట్టులోకి వచ్చారు. కానీ మైదానంలో వ్యూహాలను అమలు చేయడంలో పంత్ తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బాధ్యతాయుతంగా ఆడకుండా అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవడం పరిపాటిగా మారింది. కెప్టెన్సీ నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నాయి. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్స్‌లో పదును తగ్గడం... ఒత్తిడిని అధిగమించలేకపోవడం.. భారీ ధర ట్యాగ్ అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతోందన్న విశ్లేషకుల అభిప్రాయం నిజమే అనిపిస్తోంది.

2026 సీజన్ ప్రారంభం.. మారని తీరు

ప్రస్తుత 2026 సీజన్ ప్రారంభంలోనైనా పంత్ తన విశ్వరూపం చూపిస్తాడని ఆశించిన వారికి మళ్ళీ నిరాశే ఎదురైంది. ఢిల్లీతో జరిగిన తాజా మ్యాచ్‌లో పంత్ తన పాత జట్టుపై ప్రతాపం చూపుతాడని భావిస్తే కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం అతని ఫామ్‌పై ఉన్న సందేహాలను మరింత బలపరిచింది. క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేయకుండానే పెవిలియన్ చేరడం జట్టు ఓటమికి ఒక ప్రధాన కారణమైంది.

భారత క్రికెట్ భవిష్యత్తుపై ప్రభావం?

గతంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ పంత్ విషయంలో పరిస్థితి వేరు. అతను ప్రస్తుతం భారత జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. టెస్టుల్లో అద్భుతాలు చేసే పంత్, టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఇదే వైఫల్యం కొనసాగితే ఐపీఎల్ చరిత్రలోనే 'మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫ్లాప్' అనే ముద్ర పడే ప్రమాదం ఉంది.

పుంజుకోవడం సాధ్యమేనా?

రిషబ్ పంత్ ఒక అసాధారణమైన ప్రతిభావంతుడు అనడంలో సందేహం లేదు. గతంలో అతను ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును గట్టెక్కించాడు. అయితే ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలంటే అతను తన సహజ సిద్ధమైన ఆటతో పాటు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. లక్నో యాజమాన్యం కూడా అతనిపై పెట్టిన భారీ పెట్టుబడికి న్యాయం జరగాలని కోరుకుంటోంది. మరి రాబోయే మ్యాచ్‌లలోనైనా 'స్పైడర్ మ్యాన్' తన అసలైన ప్రతాపాన్ని చూపిస్తాడో లేదో వేచి చూడాలి.