Begin typing your search above and press return to search.

గెలుపు ‘‘రంకె’’ సింగ్.. ది న్యూ ఫినిషర్

టీమిండియా ఇప్పటివరకు టి20ల్లో ఎన్నడూ ఛేదించనంత లక్ష్యాన్ని గురువారం నాటి ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఛేదించింది. మ్యాచ్ జరిగింది కూడా విశాఖపట్టణంలోనే.

By:  Tupaki Desk   |   24 Nov 2023 9:44 AM GMT
గెలుపు ‘‘రంకె’’ సింగ్.. ది న్యూ ఫినిషర్
X

మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యాడు.. హార్దిక్ పాండ్యా లేడు.. రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చారు.. రిషభ్ పంత్ గాయపడి జట్టుకు దూరమయ్యాడు.. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు మ్యాచ్ ఫినిషర్ ఎవరు..? అవసరమైతే చివరి బంతికి సిక్స్ కొట్టగల సామర్థ్యం ఎవరికి ఉంది..? దూకుడుగా ఆడుతూ.. చురుగ్గా పరిగెడుతూ.. చకచకా బౌండరీలు బాదుతూ మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆటగాడు ఎవరు..? దీనికి సమాధానమే ఇతడు.

టీమిండియా ఇప్పటివరకు టి20ల్లో ఎన్నడూ ఛేదించనంత లక్ష్యాన్ని గురువారం నాటి ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఛేదించింది. మ్యాచ్ జరిగింది కూడా విశాఖపట్టణంలోనే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. నిర్ణయం సరైనదేనని నిరూపించింది. వాస్తవానికి సూర్య నిర్ణయం సరైనదే. ఎందుకంటే సముద్రతీర నగరమైన విశాఖలో చలి కాలం కాబట్టి రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. దీంతోనే సూర్య మొదట బౌలింగ్ తీసుకున్నాడు. కాకపోతే.. మైదానం చిన్నది కావడం, ఆస్ట్రేలియా బ్యాటర్లు కాస్త అనుభవం ఉన్నవారు కావడంతో భారత యువ బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సెంచరీ బాదేశాడు. 50 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లతో 110 పరుగులు కొట్టాడు.

ఓపెనర్లు విఫలమైనా..

ఛేదనలో టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు. తొలి మూడు ఓవర్లలో ఒకటి మెయిడిన్. రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ అయ్యాడు. దూకుడుగా ఆడబోయిన యశస్వి జైశ్వాల్ (21) క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్.. బెరెండార్ఫ్‌ ఓవర్‌ ను మెయిడిన్‌ చేశాడు. కానీ, కెప్టెన్‌ సూర్య అద్భుత బ్యాటింగ్ విన్యాసాలతో జట్టును నడిపించాడు. ప్రపంచ కప్ వన్డేల్లో విఫలమైనా.. ఆ ప్రభావం లేనట్లుగా ఆడాడు. ఎప్పటిలాగానే టి20లను తన స్టయిల్ లో ఆడుతూ 360 డిగ్రీల మేర షాట్లు కొట్టాడు. అటు తొలి 12 బంతుల్లో 4 పరుగులే చేసిన ఇషాన్‌ కూడా.. సూర్య స్ఫూర్తితో చెలరేగాడు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌ తన్వీర్‌ సంఘాను దంచికొట్టాడు. 10 ఓవర్లకు 106/2 స్కోరు చేసిన టీమిండియా లక్ష్యం దిశగా సాగింది. ఇషాన్ హాఫ్ సెంచరీ తర్వాత ఔటైనా, హైదరాబాదీ తిలక్ వర్మ నిలవకున్నా.. సూర్య ప్రతాపంతో భారత్ విజయ లక్ష్యం 30 బంతుల్లో 54 పరుగులుగా మారింది.

రింకూ ఉండగా.. ఒత్తిడి చిత్తు

ఓ ఎండ్ లో సూర్య చెలరేగుతుంటే.. మరో ఎండ్ లో అతడికి తోడ్పాటు ఇచ్చాడు రింకూ సింగ్. వీరిద్దరి ప్రతాపంతో 16, 17 ఓవర్లలో 34 పరుగులు వచ్చాయి. కానీ, ఓ ఫోర్‌ కొట్టి సూర్య ఔటయ్యాక.. భారత్‌ కు 12 బంతుల్లో 14 పరుగులు కావాల్సి వచ్చింది. 19వ ఓవర్లో తొలి బంతి వైడ్‌ కాగా.. ఆ తర్వాతి మూడు బంతులకు అక్షర్‌ పరుగు తీయలేకపోయాడు. ఈ సమయంలో ఒత్తిడి పెరిగింది. మ్యాచ్ చేజరుతుందా? అని అనిపించింది. కానీ, రింకూ అయిదో బంతికి ఫోర్‌ కొట్టి చల్లబరిచాడు. చివరి ఓవర్‌ తొలి బంతికే మరో ఫోర్‌ బాదాడు. దీంతో 5 బంతుల్లో 3 కావాల్సి వచ్చింది. అయినా నాటకీయత తప్పలేదు. రెండో బంతికి సింగిల్‌ రావడం, మూడో బంతికి అక్షర్‌, నాలుగో బంతికి బిష్ణోయ్‌ రనౌట్‌ కావడమే దీనికి కారణం. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో అర్షదీప్ కూడా రనౌటయ్యాడు.

చివరి బంతికి సిక్సర్..

అర్షదీప్ రనౌటైనా.. రింకూ కే స్ట్రయిక్ రావడం భారత్ కు కలిసి వచ్చింది. వాస్తవానికి అప్పటికే స్కోర్లు (208) సమం అయ్యాయి. చివరి బంతికి ఒక్క పరుగు తీస్తే చాలు. అదీ జరగకుంటే మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లేది. ఇలాంటి పరిస్థితుల్లో రింకూ సిక్సర్‌ కొట్టాడు. అయితే, ఆ బాల్ నోబాల్‌ కావడంతో సిక్సర్‌ కు విలువ లేకుండా పోయింది. భారత్ కూడా గెలిచేసింది. 14 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వాస్తవానికి రింకూ చేసినవి 28 పరుగులుగా (సిక్స్ తో కలిపి) భావించాలి. ఈ మ్యాచ్ తో రింకూ మరోసారి సత్తా చాటాడు. బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. ధోని తరువాత మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్నోడిగా గుర్తింపు పొందాడు. ఎలాంటి ఒత్తిడిలో అయినా, ఏ పొజిషన్‌లో అయినా, ఎలాంటి మ్యాచ్‌ ను అయినా గెలిపించే సత్తా ఉన్నోడిగా అభిమానులు పొగుడుతున్నారు.

కొసమెరుపు: గురువారం నాటి మ్యాచ్ లో రింకూ అసలు ఒత్తిడిలో ఉన్నట్లే కనిపించలేదు. తనకు అలవాటైన రీతిలో బౌండరీలు కొట్టాడు. అది కూడా గుడ్డిగా కాదు. చక్కటి స్ట్రోక్ ప్లేతో బౌండరీలు సాధించాడు. అందుకనే మ్యాచ్ ముగిశాక కెప్టెన్ సూర్య మాట్లాడుతూ.. రింకూ సింగ్ తనకు అలవాటైన పాత్రలో ఒదిగిపోయాడని కొనియాడాడు. అతడు ఇదే జోరు కొనసాగిస్తే వన్డేలు, టి20ల్లో టీమిండియాకు బాగా ఉపయోగపడతాడనడంలో సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ రింకూ సింగ్.