సిలిండర్లు మోసిన.. ఆ టీమిండియా క్రికెటర్ తండ్రి గుండె ఆగింది
ఖాన్ చంద్ సింగ్ లివర్ క్యాన్సర్ బారినపడ్డాడు. ఆరోగ్యం విషమించడంతో కొన్నిరోజుల కిందట ఢిల్లీ శివారు నోయిడా ఆస్పత్రిలో చేర్చారు.
By: Tupaki Political Desk | 27 Feb 2026 4:23 PM ISTబహుశా జింబాబ్వేపై గురువారం నాటి టి20 ప్రపంచ కప్ లో ఆ క్రికెటర్ ను తుది జట్టులోకి తీసుకోనిది అందుకేనేమో? అటువైపు తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండగా, ఇటువైపు హడావుడిగా జట్టును వీడిన ఆ ఫినిషర్.. బహుశా ఇక టి20 ప్రపంచ కప్ లో పాల్గొనడం అనుమానమే...! మరోవైపు జీవనోపాధికా సిలిండర్ మోసి.. కుమారుడిని క్రికెటర్ గా చూసి.. అతడు గొప్ప ఇంటికి అల్లుడిగా వెళ్తూ కుటుంబంతో పూర్తిగా స్థిరపడే వేళ ఆ తండ్రి తన జీవితం చాలించాడు. బహుశా అదొక్కటే ఆయన జీవితంలో లోటుగా ఉండిపోతుందేమో..?
తనయుడి ఉన్నతిని చూసి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దూసుకొచ్చి, వరుసగా ఐదు సిక్సులతో తమ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును గెలిపించి టీమిండియాలో చోటు దక్కించుకున్న ఫినిషర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన అతడి తండ్రి ఖాన్ చంద్ సింగ్ ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గ్యాస్ డెలివరీ ఏజెంట్ గా పనిచేసిన ఖాన్ చంద్.. ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించారు. ఈ పనిలో తండ్రికి రింకూ కూడా ఓ దశలో సాయం చేశాడు. అయితే, క్రికెట్ పై ఇష్టంతో ముందుకుసాగి విజయవంతం అయ్యాడు. చివరకు టీమ్ఇండియా టి20 జట్టులో స్థానం ఖాయం చేసుకున్నాడు.
లివర్ క్యాన్సర్ తో..
ఖాన్ చంద్ సింగ్ లివర్ క్యాన్సర్ బారినపడ్డాడు. ఆరోగ్యం విషమించడంతో కొన్నిరోజుల కిందట ఢిల్లీ శివారు నోయిడా ఆస్పత్రిలో చేర్చారు. నాలుగో స్టేజీ దాటడంతో శుక్రవారం మరణించాడు. కాగా, తండ్రి అనారోగ్యం నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ తర్వాత రింకూ జట్టును వీడాడు. జింబాబ్వేతో మ్యాచ్ కు ముందే మళ్లీ జట్టులోకి వచ్చాడు. కానీ, తుది జట్టులో చోటు ఇవ్వలేదు. అతడి బదులు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను తీసుకున్నారు.
రూ.3 కోట్లతో ఇల్లు కట్టి..
రింకూ క్రికెటర్ గా రాణించడంతో అతడి కుటుంబ జీవితమే మారిపోయింది. రింకూ రూ.3 కోట్లకు పైగా వెచ్చించి బంగ్లా కట్టించాడు. అందులో తన ఐదు వరుస సిక్సుల బ్యాట్ ను ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచాడు. ఇక రింకూ.. యూపీలోని సమాజ్ వాదీ ఎంపీ ప్రియా సరోజ్ (26)ను వివాహం చేసుకోనున్నాడు. మచ్లిషహర్ ఎంపీ అయిన ప్రియాతో గత ఏడాది జూన్ లోనే నిశ్చితార్థం జరిగింది. నవంబరులో పెళ్లి అనుకున్నారు. కానీ, వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ముహూర్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇక.. రింకూకు టీమ్ఇండియా టి20 జట్టులో చోటు స్థిరమైంది. ఫినిషర్ గా అతడు తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇలా కుటుంబం అంతా సంతోషకర క్షణాల్లో ఉండగా రింకూ తండ్రి మరణ వార్త వారికి బాధాకరమే.
