నిరుడు క్రికెట్ వరల్డ్‌కప్..నేడు రగ్బీ వరల్డ్‌కప్..19 ఏళ్ల సంచలనం
భారత్ చేతిలో ఓటమితో ఫైనల్ చేరే చాన్స్ మిస్ అయింది. అయితే, అతడు 11 వికెట్లు తీయడమే కాక..బ్యాటింగ్‌లో 50 సగటుతో పరుగుతు చేశాడు.
By: Tupaki Desk | 20 July 2025 9:32 AM ISTఒకరు ఒక క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే కష్టం.. రెండు క్రీడల్లో అంటే అసాధ్యం అనే చెప్పాలి. పోనీ ఒకరు ఒక క్రీడలో ఒక ప్రపంచ కప్ ఆడడమే కష్టం.. రెండు క్రీడల్లో అంటే అది ఆశ్చర్యం.. కానీ, దీనిని సుసాధ్యం చేసి చూపాడు దక్షిణాఫ్రికాకు చెందిన రిలే నార్టన్. కేవలం 19 ఏళ్ల ఈ కుర్రాడి పేరు ఇప్పుడు క్రీడా ప్రపంచంలోనే సంచలనం. ఎందుకంటే.. గత ఏడాది అతడు ఇదే సమయంలో దక్షిణాఫ్రికా అండర్ 19 క్రికెట్ జట్టు కెప్టెన్. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాను సెమీఫైనల్ వరకు చేర్చడు నార్టన్. భారత్ చేతిలో ఓటమితో ఫైనల్ చేరే చాన్స్ మిస్ అయింది. అయితే, అతడు 11 వికెట్లు తీయడమే కాక..బ్యాటింగ్‌లో 50 సగటుతో పరుగుతు చేశాడు.
ఇప్పుడు అదే నార్టన్ ఏకంగా దక్షిణాఫ్రికా అండర్ 20 రగ్బీ జట్టుకు కెప్టెన్‌గా ప్రపంచ కప్‌లో ఆడుతున్నాడు. అంతేకాదు తమ జట్టును ఫైనల్స్‌కు కూడా చేర్చాడు. కొంత ప్రత్యేకమైన కుడిచేతి వాటం పేస్ బౌలింగ్, ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో ఆల్ రౌండర్‌గా క్రికెట్‌లో అదరగొట్టాడు నార్టన్. ఇది చూస్తే దక్షిణాఫ్రికా సీనియర్ జట్టుకు మంచి ఆల్‌రౌండర్ దొరికాడని భావించారు. కానీ, సీన్ కట్ చేస్తే ఇటలీలో జరుగుతున్న ప్రపంచ రగ్బీ అండర్ 20 చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో కెప్టెన్‌గా మెరిశాడు. కాగా, అటు క్రికెట్ ఇటు రగ్బీ అనే రెండు ప్రధాన క్రీడల్లో అసాధారణ విజయాల కారణంగా 19 ఏళ్ల నార్టన్ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో అత్యంత ఆకర్షణీయ యువ ప్లేయర్.
వాస్తవానికి నార్టన్ కాస్త కష్టపడితే క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేవాడని అంటున్నారు. కానీ, అంతలోనే రగ్బీపై దృష్టిమళ్లించాడు. ఇటీవల రగ్బీనే ప్రధానంగా ఎంచుకున్నాడు. బహుశా ఇది అతడి తండ్రి నుంచి సంక్రమించి ఉంటుంది. నార్టన్ తండ్రి క్రిస్ నార్టన్ 1991-2003 మధ్య మాటీస్ రగ్బీ తరపున ఆడాడు. అతడి
అడుగుజాడల్లోనే రిలే కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రపంచ రగ్బీ అండర్ 20 చాంపియన్‌షిప్‌లో రిలే నార్టన్ జూనియర్ స్ప్రింగ్‌బాక్స్ కెప్టెన్‌గా జట్టును నడిపిపించాడు. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా (73-17), డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ (32-22), స్కాట్లాండ్ (73-14)పై విజయాల్లో కీలకంగా నిలిచాడు. సెమీఫైనల్‌లో అర్జెంటీనాపై 48-24 తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా ఆదివారం న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడనుంది.
రిలే నార్టన్ తరహాలో గతంలో ఒక్కరే రెండు క్రీడల్లో దేశానికి ఆడారు. అదికూడా క్రికెట్-రగ్బీ ప్రపంచ కప్‌లలోనే. నమీబియాకు చెందిన రూడీ వాన్ వురెన్ ఈ ఘనత సాధించాడు. మరి రిలే నార్టన్.. ఈ చాంపియన్‌షిప్ తర్వాత అయినా క్రికెట్‌లో కొనసాగుతాడా? లేక రగ్బీలోనా?
